గుణత్రయవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - అచంచల భక్తితో తనను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మసాక్షాత్కారమును బడయగలడని భగవానుడు వచించుచున్నారు-
మాం చ యోఽవ్యభిచారేణ
భక్తి యోగేన సేవతే |
స గుణాన్సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ||
తాత్పర్యము:- ఎవడు (భగవంతుడగు)నన్నే అచంచలమైన భక్తియోగముచేత సేవించుచున్నాడో, అతడీగుణములన్నిటిని లెస్సగా దాటివైచి బ్రహ్మముగానగుటకు (జీవన్ముక్తు డగుటకొఱకు) సమర్థుడగుచున్నాడు.
వ్యాఖ్య:- త్రిగుణముల కవ్వల -- పరమాత్మకలడు. త్రిగుణములను దాటినచో భగవత్ప్రాప్తిసిద్ధించును. కాని వానిని దాటుటెట్లు? ఎంతయో విచారణ, మనోనిగ్రహము, సంయమము దాని కవసరము. కాని భక్తియొక్క సహాయమున్నచో ఈ జ్ఞానస్థితి సులభముగ లభింపగలదు. కనుకనే గీతాచార్యులు దాదాపు ప్రతి అధ్యాయమందును, ప్రతియోగమందును, ఈ భక్తిని గూర్చి చెప్పుచున్నారు. ఈ పదునాల్గవ అధ్యాయము అఖండమగు జ్ఞానోపదేశము గావింపబడిన సందర్భమైనప్పటికిని దీని చివరగూడ భక్తియోగముయొక్క ఆవశ్యకతను నిరూపించిరి. అయితే సామాన్యభక్తి చాలదనియు, అచంచలభక్తి, "అవ్యభిచారిణీ భక్తి”, అనన్యభక్తి యుండవలయుననియు బోధించిరి. అనగా, దృశ్యవిషయములందు విభజింపబడని ఏకాంతభక్తి అవసరమని భావము. భక్తిమార్గము సర్వులకును చాలసులభమైనది యగుటచే, అట్టి ఉత్తమ భక్తిని ప్రతివారును సంపాదించి తద్ద్వారా భగవత్కృపను, తద్ద్వారా బ్రహ్మజ్ఞానవ్యాప్తిని, దానిచే బ్రహ్మానుభూతిని బడయుటకు అనుకూలముగ నుండును. ఆ విషయమే ఇచట తెలుపబడినది.
బ్రహ్మత్వమును ఎవడు పొందగలడో, మోక్షసిద్ధి యేప్రకారము చేకూరగలదో ఈ శ్లోకమందు చక్కగ నిరూపింపబడినది. అచంచలభక్తికలవాడే మోక్షమునకు (ఆత్మానుభూతికి) అర్హతను సంపాదించగలడని స్పష్టముగ నిచట పేర్కొనబడినది. కావున యోగ్యతయే యిచట ప్రధానముగాని జాతిమతకులవర్ణాశ్రమాదులు కావు).
‘అతీత్య’ అని చెప్పక "సమతీత్య” అని చెప్పుటచే నిర్మలభక్తికలవాడు త్రిగుణములను లెస్సగ దాటగలడని తెలియుచున్నది.
‘కథం చైతాం స్త్రీన్గుణానతివర్తతే' - 'ఈ గుణము లెట్లు దాటబడును?' అను అర్జునుని ప్రశ్న కీ శ్లోకము సమాధానమైయున్నది. అచంచలభక్తిచేతనే (జ్ఞానప్రాప్తినిబడసి, తద్ద్వారా) మూడుగుణములను దాటి మనుజుడు బ్రహ్మైక్యమును బడయగల్గుచున్నాడని యిచ్చోట వచింపబడినది. కావున సులభతరమైనట్టి ఈ భక్తియోగము యొక్క సహాయముచే సాధకుడు ఆత్మజ్ఞాన మొుంది త్రిగుణములను దాటి ముక్తిని శీఘ్రముగ బడయవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి