20, సెప్టెంబర్ 2020, ఆదివారం

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


88 - అరణ్యపర్వం.


ఇంద్రుని రథానికి, రధసారధి మాతలికి వీడ్కోలు పలికిన తరువాత, అర్జునుడు చాలా సేపు ధర్మరాజు మిగిలినవారితో, ఆత్మీయసంభాషణలు జరిపి, తాను పాశుపతాస్త్రము పరమేశ్వరునుండి పొందిన వైనం, మిగిలిన దేవతలు అనుగ్రహించి యిచ్చిన అస్త్ర శస్త్రాల గురించీ విపులంగా చెప్పాడు. పనిలోపనిగా ఊర్వశి తనకిచ్చిన శాపం గురించికూడా చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. అయితే అజ్ఞాతవాసంలో ఆ శాపమే వరంగా పరిణమిస్తుందని ఇంద్రుడు చెప్పిన విషయం కూడా చెప్పి, వారిని వ్యధకు లోనుకాకుండా చేశాడు. నకుల సహదేవులను రాత్రంతా తనతో వుంచుకుని, అనేక విషయాలు వారితో పంచుకున్నాడు.


మరునాడు, ధర్మజుని కోరిక మేరకు, తాను పొందిన అస్త్రాలను ప్రయోగించి తనవారిని ఆనందింప జేయాలని అర్జునుడు గాండీవధారియై పాశుపతం ధరించి ప్రయోగించ బోతుండగా, భూదేవి గజగజ వణికింది. ప్రకృతి అప్పటికే భయసూచకంగా పెద్దగాలి రూపంలో చెట్లను ఊపసాగింది. జంతువులు భీతితో అటూ యిటూ పరుగిడసాగాయి. ఆసమయంలోనారదులవారు యేతెంచి, ' అర్జునా ! నిష్కారణంగా, వినోదం కోసం అట్టి పవిత్రమైన శక్తివంతమైన ఆయుధాలు, శస్త్రాలు ప్రయోగించవద్దని నీకు పరమశివుడు, మిగిలిన దేవతలు ముందు చెప్పినమాట మరచినావా ! ' అని అతనిని అస్త్రవిద్య చూపే కార్యక్రమం నుండి విరమింప జెసి, ధర్మరాజుతో ఆ అస్త్రాలశక్తి రణ రఁగంలోనే చూడమని చెప్పి, నారదుడు, కుశల ప్రశ్నల అనంతరం, తిరిగి వెళ్ళి పోయాడు.


ఆ విధంగా నాలుగు సంవత్సరాలు వారు నాలుగురోజులలాగా, గంధమాదన పర్వత పరిసరప్రాంతాలలో గడిపారు. మొత్తం 11 సంవత్సరాల అరణ్యవాస కాలం ముగుస్తున్నది. స్థలమార్పు అవసరమని భావించి, అన్నిరోజులూ తమకు ఆశ్రయమిచ్చిన, చెట్లకు, సరోవరాలకు, మునులకు, ఋషులకు అభివాదం తెలిపి, అక్కడనుండి శలవు తీసుకుని, బదరికాశ్రమానికి చేరారు పాండునందనులు, పరివారంతో సహా.


బదరికాశ్రమంలో కొంతకాలం గడిపి, వృషపర్వుని ఆశ్రమంలో ఒకరాత్రి విశ్రమించి, విశాఖయూపవనం చేరారు పాండవులు. అక్కడ ఒక సంవత్సరం గడిపారు. అప్పుడే యమునోత్రిని కూడా దర్శించారు.


ఒకరోజు, అక్కడవనాలలో సంచరిస్తుండగా, భీమసేనుడు వేటకువెళ్లి, వీరోచితంగా క్రూరమృగాలను వేటాడుతూ, కంటబడిన విషసర్పాలను కూడా చంపివేస్తూ, అడవి అంతా కలయ తిరుగుతున్నాడు. అంతలో, అతి పెద్ద శరీరంతో, పర్వతభాగాన్ని పెనవేసుకుని, పసుపుపచ్చని రంగులో, యెర్రని అగ్నిగోళాల వంటి నేత్రాలతో, నాలుగు కోరలతో, గుహలాంటి నోరుతో వున్న అజగరము ( కొండచిలువ ) , భీముని చూడగానే, అమాంతం సమీపించి, భుజాలను కదలకుండా బంధించి వేసింది. ఒక్కసారిగా, కొండచిలువ స్పర్శ తగలగానే, జవసత్వాలు వుడిగిపోయినట్లై భీముడు, స్పృహ తప్పి పోతున్నాడు. ఏమి జరుగుతున్నదో అర్ధం గాని స్థితిలో వుండిపోయాడు.


యెంత ప్రయత్నించినా అజగరబంధము నుండి భీముడు బయట పడలేకపోతున్నాడు. అంతటి శక్తిని యెప్పుడూ చూడని, భీమసేనుడు, ' ఓ అజగరమా ! నేను పాండు తనయుడను, భీమసేనుడను. ధర్మజుని సోదరుడను. నాకు నాగదేవత వాసుకి వరం వలన, పదివేల ఏనుగుల బలం ప్రసాదింపబడినది, నా బాల్యంలోనే. అనేకమంది రాక్షసులు, క్రూరజంతువులను , ఒక్క పిడిగుద్దుకే చంపిన బలశాలిని. '


' నీవెవరు ? నీకింత బలం యెలావచ్చింది ? నీవు నిజంగా సర్పరాజువేనా ! లేక శాపవశాన వున్న దేవతవా ! ' అని వినయంగా అడిగాడు. ' ఓహో ! నీవేనా భీమసేనుడవు. నీవెప్పుడైనా నీ ముందు తరాలలోని పెద్దలలో నహుషుడు అనే పేరు విన్నావా ? నేనే నహుషుడను. ఒకప్పుడు మదించిన గర్వంతో, బ్రాహ్మణులను కించపరచి, అనాదరంగా చూసిన కారణంగా, నాకుఅగస్త్యమహర్షి యీవిధంగా అజగర శరీరం పొందమని శాపమిచ్చాడు.'


' భీమా ! నేను మిక్కిలి ఆకలిగా వున్నాను. నాకు ఒకప్రక్క, నా వంశీకుడిని చూసిన ఆనందము, ఇంకొకప్రక్క నా వంశజుడిని ఆహారంగా పొందవలసిన దుష్టితి చూసి బాధ కలుగుతున్నవి. కానీ శరీరం నిలుపుకొనడానికి ఆహారం ముఖ్యం కదా ! నా నుండి తప్పించుకొనవలెనన్న నీకు ఒకటే మార్గం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే, నిన్ను నా బంధం నుండి విముక్తుడిని చేస్తాను. నేను నా శాపవిముక్తికై యెదురుచూస్తున్నాను. ' అని నహుషుడు భీమునితో చెప్పాడు.


' సర్పరాజమా ! నాకు నీపై కోపంలేదు. కానున్నది కాక మానదు. నీకొచ్చిన దుస్థితి వలెనే, అతి బలవంతుడనైనా , శక్తి కోల్పోయి, నీకు బందీనై వున్నాను. ఇది నేను పెద్దలను, తెలిసో తెలియకో, తూలనాడిన ఫలితమేమో ! సజ్జనుడు సుఖానికైనా, దుఖానికైనా కారణాలు ఆపాదించుకుని, పురుషప్రయత్నం చెయ్యడంలోనే కార్యసిద్ధి కలుగుతుంది. కానీ నా విషయంలో నేను అశక్తుడను. పురుషప్రయత్నం చెయ్య లేకున్నాను. ' అని అంటూ స్పృహతప్పి పడిపోయాడు. 


సరిగా, అదేసమయానికి, ధర్మరాజుకు దుశ్శకునాలు గోచరించాయి. ఆయన వామనేత్రం అదిరింది. ఆర్తనాదాలు వినిపించాయి. ధర్మరాజు ఆందోళనతో, అందరనూ రమ్మని పిలిచాడు. ఒక్క భీముడు తప్ప అందరూ సమావేశమయ్యారు. భీమసేనునికి యేదో కీడు వాటిల్లింది అని ధర్మరాజు భావించి హుటాహుటిన, ధౌమ్యుని వెంటబెట్టుకుని, ధర్మరాజు అడవులలోనికి వచ్చాడు. 


భీముని అడుగుజాడలు పరిశీలిస్తూ, కొంతదూరం జాగ్రత్తగా గమనిస్తూ పోగా, అక్కడ అజగరబంధంలో కళావిహీనుడై, స్పృహతప్పి పడివున్న భీమసేనుని చూసి బిగ్గరగా రోదిస్తూ, ఈ అజగర వృత్తాంతమేమిటని, ప్రక్కన వున్న ధౌమ్యునిఅడిగాడు, ధర్మరాజు. ధౌమ్యులవారు చెబుతున్నారు: నహుష చక్రవర్తి, అధికారగర్వంతో, కన్నుమిన్నుగానక, ఉత్తములైన, వేదవేదాంగ పారంగతులైన విప్రశ్రేష్ఠులను, గుర్రాలకు బదులుగా, తన రధవాహకులుగా నియమించుకుని హింసించడం అలవాటుగా చేసుకున్నాడు. అందువలన అగస్త్యుని శాపానికి గురయి, నహుషుడు యీ కొండచిలువ రూపంలో పడి వున్నాడు. ఈ నహుషుడు అడిగే ప్రశ్నలకు యెవరైనా సరిఅయిన సమాధానాలు చెప్పగలిగితే, భీముని ప్రాణము నిలుస్తుంది, నహుషుని శాపవిమోచనం అవుతుంది. 


ఈ వృత్తాంతము వినిన ధర్మరాజు, నహుషుని ప్రశ్నలకు తాను సమాధానం యిస్తానని ముందుకు వచ్చాడు. నహుషునిలో తనకు శాపవిముక్తి అవుతుందేమో అని ఆశ చిగురించింది. నహుషుడు మొదటి ప్రశ్నను సంధిస్తున్నాడు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


*ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: