**దశిక రాము**
**శ్రీమద్భాగవతము**
తృతీయ స్కంధం -24
బ్రహ్మణ ప్రశంస
ఈ ఇద్దరు జయుడు, విజయుడు అనే పేర్లు కల నా ద్వారపాలకులు. వీరు మిమ్మల్ని లెక్కచేయక, నా ఆజ్ఞను అతిక్రమించి చేసిన నేరానికి మీరు తగిన శిక్షే విధించారు. అది నాకు ఇష్టమే. అంతేకాక సేవకులు చేసే అపరాధం యజమానిదే అవుతుంది. కాని ఈ తప్పుకు మాననీయుడినైన నన్ను మన్నించి దయచూపండి. అంతేకాక...” అంటూ శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు.
శరీరంలో పుట్టిన భయంకరమైన కుష్ఠరోగంచేత చర్మం చెడిపోయి రంగు మారే విధంగా సేవకులు చేసే చెడ్డ పనులు యజమానుల గొప్ప కీర్తిని, పేరుప్రతిష్ఠలను పోగొడతాయి. వారికి లోకంలో చెడ్డపేరు వస్తుంది.
మీవల్ల నాకు లభించిన పుణ్యక్షేత్రం ఈ వైకుంఠం. ఇది ఎంతో పవిత్రమై, పొగడదగినదై, సుందరమై, అమృతమయమై, కీర్తివైభవంతో శోభిస్తూ అలరారుతున్నది. ఇది తన పేరు విన్నవారిని ఎటువంటి అపవిత్రులనైనా, కుక్క మాంసం తినే శ్వపచులనైనా పవిత్రులను చేస్తుంది.అటువంటి నేను మీవంటి సాధుజనులకు అపకారం చేసినవారు నాకు బాహువులవంటి వారైనా ఖండించడానికి వెనుకాడను. ఇంక ఇతరులను మీముందు లెక్కచేయడ మెక్కడిది?
బ్రాహ్మణోత్తముల సేవించడం వల్ల లభించినట్టిదీ, పాపాలను నాశనం చేసేదీ, అఖిలలోకాలను పవిత్రం చేసేది అయిన గంగ నా పాదపద్మాలనుండి ఉద్భవించింది. అటువంటి నన్ను...విరక్తునిగా తేలికగా భావింపక, శుభకరాలైన తన కటాక్షాలనే పూలదండలతో సకల సంపదల వైభవం కలిగిన లక్ష్మి నా వక్షస్థలాన్ని అలంకరించింది.ఆశలు లేనివాడై ధర్మమార్గంలో సంచరించే బ్రాహ్మణోత్తముడు తినే చిన్న అన్నంముద్ద వల్ల నా మనస్సుకు కలిగే సంతృప్తి యజ్ఞయాగాలలో నేతిలో ముంచి అగ్నిముఖంగా వ్రేల్చబడే హవిస్సును అందుకొని ఆరగించేటప్పుడు కూడా కలుగదు..ఎదురులేని యోగమాయావైభవంతో ఎల్లప్పుడూ ప్రసిద్ధుడనైన నేను బ్రాహ్మణుల పవిత్రమైన పాదపద్మ పరాగాలను భక్తితో నా నవరత్న ఖచిత సువర్ణ కిరీటంపై ధరిస్తాను. అటువంటి నా పాదపద్మాలలో జన్మించిన గంగాజలాన్ని తలపై ధరించి శివుడు మొదలైన దేవతలు వెంటనే పవిత్రు లవుతున్నార ఎవడైతే బ్రాహ్మణులు తనకు అపకారం చేసినా తిరిగి కోపగించడో, ఎవడైతే బ్రాహ్మణులను నన్నుగా భావిస్తాడో అటువంటివాడు ధర్మానుసారంగా నాకు మిక్కిలి ఇష్టమైనవాడు. ఎవరైతే గోవులను, బ్రాహ్మణులను, నన్ను, దీనజనులను భేదభావంతో చూస్తారో వారు అధోగతి పాలవుతారు. వారిని యమభటులు త్రాచుపాములవలె, భయంకరమైన గ్రద్దలవలె రోషంతో ముక్కులతో చీల్చుతారు. బ్రాహ్మణోత్తములు ఎన్ని విధాలుగా తమను అవమానించినా చిరునవ్వుతోను సంతోషంతోను నిత్యం వారిని పూజిస్తూ, తండ్రిని కన్నకొడుకులు అనురాగపూర్వకంగా పిలిచే విధంగా మంచిమాటలతో వారిని గౌరవిస్తూ పిలిచేవారు నాతో సమానులౌతారు.వినండి. అటువంటి పుణ్యాత్ములకు నేను ఎప్పుడూ ప్రియతముడనై అమ్ముడుపోతూ ఉంటాను. పూర్వం భృగుమహర్షి నన్ను తన్నినా కోపించకుండా మిక్కిలి సంతోషంతో ఆదరించాను
కదా!మునులారా! నా హృదయకమలంలోని అభిప్రాయాన్ని వీళ్ళు తెలిసికొనలేక మీ ఆజ్ఞను మీరిన దోషానికి తగిలఫలాన్ని పొందారు. నా సంకల్పం కూడా ఇదే. వీళ్ళు భూమిపై పుట్టి కొద్దికాలంలోనే తిరిగి నా సమీపానికి వచ్చేటట్లు అనుమతించండి.” అని ఆ ముకుందుడు చెప్పగా విని సనకాది మునులు అతని సుకుమార వచనామృతాన్ని రుచిచూచి కూడా కోపాన్ని విడువలేనివారై...సనకాది మునిశ్రేష్ఠుల మనస్సులు తృప్తిచెందలేదు. పరిమితంగా, గంభీరంగా, వివిధార్థాలతో అవగాహన కందక అమృతంతో సమానమై మాధుర్యగుణంతో కూడి, దోషరహితమైన ఆ మహావిష్ణువు మాటలకు మనస్సులో సంతోషించి “మన ప్రభువు ఇప్పుడు స్నేహంతో మనలను అభినందిస్తున్నాడో లేక నిందిస్తున్నాడో లేక మనము విధించిన శిక్షకు సంకోచిస్తున్నాడో తెలియదు” అనుకొంటూ వితర్కించుకొని అంతలోనే... హరి తమపై దయ కలిగి ఉన్నాడని అర్థం చేసికొని, కుతూహలంతో పులకించిన శరీరాలు కలవారై ఉత్కంఠతో సంతోషించి నుదుట చేతులు జోడించి....స్వయంగా కల్పించుకున్న యోగామాయాప్రభావం వల్ల విలసిల్లే ఐశ్వర్యంతో పరాక్రమంతో సర్వోత్కృష్టుడైన విష్ణువుతో ఆ మునులు వినయంతో ఇట్లా అన్నారు. దేవా! తేజోవంతమైన నిత్యైశ్వర్యం కల నాయకుడవు, భగవంతుడవు, పుణ్యమూర్తివి. మేము చేసిన పని నీకు సమ్మతమే అన్నావు. నీ లీలలు తెలిసికొనడం ఎవరికి సాధ్యం?
దేవా! నీవు పరమపావనుడవు, సాధుజన రక్షకుడవు, సర్వజ్ఞుడవు. దేవతలందరికీ పరదేవతలైన బ్రాహ్మణుల ఆత్మలకు అధినాయడవైన నీకు ఆ బ్రాహ్మణులే అధిదేవత లైనారట. ఎంత చోద్యం! కమలనయనా! నీవలన ఉద్భవించిన ధర్మం నీ అవతారాల వల్ల కాపాడబడి సుస్థిరంగా ఉంటున్నది. దేవా! దయామయా! పాపవిమోచనా! మార్పు పొందని సత్యస్వరూపంతో ఉన్న నిన్ను గమనించిన పెద్దలు నీవే ఆ ధర్మానికి ఫలస్వరూపమనీ, ఆ ధర్మంలోని ప్రధాన రహస్యమనీ చెప్తూ ఉంటారు.దేవా! మంచి వివేకం కలవాడా! గుణభూషణా! లోకపాలకా! నిత్యవినోదీ! ఎవని సంపూర్ణ అనుగ్రహం పొంది మునీశ్వరులు కోరికలు లేనివారై మృత్యుభయాన్ని పోగొట్టుకుంటారో అటువంటి నీకు ఈ లోకంలో మరొకరి అనుగ్రహమా? ఎంత వింత! లక్ష్మీదేవి పాదపద్మాలు ఎల్లప్పుడు సంపదలను కోరుకునే భక్తుల శిరస్సులకు అలంకారాలు. పద్మకేసరాలనుండి స్రవించే మకరందం మీది ఆశతో వచ్చే తుమ్మెదవలె ఆ లక్ష్మీదేవి భక్తజనులు అర్పించిన తులసిమాలలు కల నీ పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ఉండగా....కృపాకటాక్షములు పొంగిపొరలగా పొడచూపే భాగవతులమీద అనురక్తి యొక్క నీ మహిమ గమనించుటకు బహు విచిత్రమైనది. కమలాక్షా! నిత్యశుభాకారా! లక్ష్మీమనోహరా! నీ మహిమ చిత్రమైనది. దేవదేవా! నీవు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడవు. అందమైన శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అలరారేవాడవు. “ఈ శ్రేష్ఠులైన బ్రాహ్మణుల పాదాలకు అంటిన పుణ్యపరాగమే నా శరీరానికి ఆభరణం” అన్నావు. సమస్తలోకులకు బ్రాహ్మణుల గొప్పతనాన్ని తెలియజేయడానికే గదా పవిత్రమైన ఆ రూపు ధరించావు. అంతేకాకనీవు ధర్మమూర్తివి, సమస్త విశ్వానికి కర్తవు. అటువంటి నీవు రక్షింపదగినవారిని రక్షించకపోతే వేదాలలో చెప్పిన ధర్మమార్గం అధర్మమార్గం అవుతుంది. కనుక సత్త్వగుణాన్ని స్వీకరించినవాడవై ఈ ప్రాణుల క్షేమాన్ని తెలుసుకొని రక్షిస్తావు. ధర్మద్రోహులను నీ దైవశక్తిచేత దండించే నీకు వేదధర్మ... మార్గాన్ని నాశనం చేసే పద్ధతులు ప్రియంకావు. బ్రాహ్మణులపై దయ కలిగి వినయంతో పలికిన ఈ మాటలు భక్తవరుదుడవైన నీకు యుక్తమై ఉన్నాయి.ఆ విధంగా ఇతరులపట్ల వినయంతో మాట్లాడితే గౌరవానికి హాని అవుతుందని నీవు భావించినట్లైతే..విశ్వానికి కర్తవూ, విశ్వమూర్తివీ, విశ్వరక్షకుడవూ అయి విరాజిల్లే నీకు గౌరవహాని ఎక్కడిది? ఈ వినయాలు నీ లీలావిలాసాలు కదా!.మహానుభావా! మునులమైన మమ్ములను మిక్కిలి సంతోషంతో గౌరవించడం సజ్జనులను ఆదరించే నీ స్వభావం తప్ప మరొకటి కాదు. ఒక విన్నపం. ఈ జయ విజయులపై....మేము వీరిని శపించాము. దేవా! అంతకంటె కఠినంగా శిక్షించాలనుకుంటే నీ ఇష్టం. అలాకాక అధిక సంపదలిచ్చి రక్షించాలనుకుంటే
రక్షించు.నీవు ఎలా చేసినా మాకు ఇష్టమే కనుక నిర్దోషులూ, నిష్కల్మష హృదయులూ ఐన ఈ జయవిజయులను మేము అనరాని మాటలు అని ఉంటే మమ్మల్నయినా నీ ఇష్టం వచ్చినట్లు శిక్షించు” అని చేతులు జోడించి నమస్కరించిన సనకాది మునులను దయతో చూచి.....పుణ్యాత్ముడైన భగవంతుడు ఇలా అన్నాడు “మునులారా! ఈ జయవిజయులు భూలోకానికి వెళ్ళి అక్కడ లోభమోహాలు కలవారై రాక్షసులై జన్మిస్తారు. దేవతలకు అపకారం చేస్తూ సర్వలోక కంటకులై జీవిస్తూ నాపట్ల వైరభావం కలవారై....ఎంతో సాహసంతో నన్నెదిరించి నాతో యుద్ధం చేసి నా సుదర్శన చక్రం చేత మరణించి తిరిగి సంతోషంతో నా సన్నిధికి చేరుతారు. అంతే కాక...నన్ను విరోధంచేతనైనా తమ మనస్సులలో భావించడంవల్లనూ, నా సమక్షంలో నా ముఖాన్ని చూస్తూ మరణించడం వల్లనూ వీళ్ళు పుణ్యాత్ములై నా ఆస్థానంలో నివస్తిస్తారు.ఓ మునులారా! వినండి. ఆ తరువాత ఎన్నటికీ వీళ్ళు భూమిమీద జన్మించరు. మీరు చెప్పినట్లే నేను ఆలోచించాను. కనుక ఇక మీమనస్సులలో....దీనికోసం చింతించకండి.” అని విష్ణువు చెప్పగా బ్రహ్మపుత్రులైన ఆ సనక సనందాదులు అనంతుడైన శ్రీహరి భావాన్ని తెలుసుకొని అధికమైన ఆనందంలో తేలి ప్రసన్న హృదయాలతో క్షీరసాగర శయనుడూ, ఆర్తజనులను రక్షించడమే అలంకారంగా గలవాడూ, పాపాలను రూపు మాపేవాడూ అయిన శ్రీహరిని స్తుతించారు.ఇంకా అప్పుడా సనకాదులు పులకింత మొలకెత్తగా, ఆనందబాష్ప ధారలు కనులవెంట ప్రవహించగా మునులు శరణు కోరే ఉత్తముడూ, ఇంతవాడని అంతవాడని లెక్కింపరానివాడూ, దేవతలలో శ్రేష్ఠుడూ అయిన విష్ణువుయొక్క దివ్యమంగళ శరీరాన్ని, అతని వైకుంఠ మందిరాన్ని సందర్శించి క్రొంగ్రొత్త తామర రేకులవంటి కన్నులు గల అతనికి నమస్కరించి...తాము మాట్లాడిన మాటలను విష్ణువు మాటలుగా భావిస్తూ స్నేహభావంతో విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని స్తుంతించి, ఆ శ్రీహరిచేత....అనుజ్ఞ పొందినవారై ఆ సనకాదులు తమ నివాసాలకు వెళ్ళారు. శ్రీనాథుడు జయవిజయులను దయతో చూసి వెంటనే ఇలా అన్నాడు. మీరు తప్పనిసరిగా రాక్షసజాతిలో పుట్టవలసి వచ్చింది. నేను అడ్డులేని శక్తిసామర్థ్యాలు ఉన్నవాడనైనా బ్రాహ్మణుల శాపాన్ని నివారించలేను.అందువల్ల మీరు వెంటనే రాక్షసులై జన్మించి నాకు శత్రువులై మీ మనస్సులలో ఎల్లప్పుడు నన్నే స్మరిస్తూ నాచేత మరణించి ఇక్కడికి వస్తారు. వెళ్ళండి” అని ఆజ్ఞాపించి వికసించిన పద్మపత్రాలవంటి కన్నులు కలవాడూ, ఇంద్రాది దిక్పాలకుల కిరీటాలలోని మణులచేత ప్రకాశించే పాదపీఠం కలవాడూ అయిన హరి లక్ష్మీదేవి వెంటరాగా సంతోషంతో తన నిర్మల పుణ్య మందిరానికి వెళ్ళాడు.
అప్పుడు...జయవిజయులు తమ తేజస్సును కోల్పోయి నిశ్చేష్టులై నేల కూలారు. ముల్లోకాలలోను, దేవతా విమానాలలోను హాహాకారాలు చెలరేగాయి.ఆ జయవిజయులే ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు. వారి సాటిలేని మేటి తేజస్సే మీ తేజస్సు లన్నిటినీ వమ్ము చేసింది.దీని కంతా ప్రధానకారణం ఆ హరి. ఆ శ్రీనాథుని లీలలు వింతగా ఉంటాయి. సమస్త జీవరాసుల వృద్ధిక్షయాలకు కారణమైనవాడూ, ఆది అంతం అనే వికారాలు లేనివాడూ, దయకు నిలయమైనవాడూ అయిన విష్ణువు మీకు మేలు చేస్తాడు. ఈ విచారం వదలిపెట్టి వెళ్ళండి. మీ కోరికలు తీరుతాయి.”అని బ్రహ్మదేవుడు చెప్పగా విని దేవతలు ఆ వృత్తాంతాన్ని అర్థం చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళి పోయారు. దితి తన భర్త మాటలను తలచుకొని అసంతృప్తి చెందింది.
|| ఓం నమో భగవతే వాసుదేవాయ ||
|| ఓం | ఓం | ఓం ||
|| ఓం | శాంతిః శాంతిః శాంతిః ||
|| సర్వే జనా స్సుఖినో భవంతు. ||
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి**
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి