🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చండీ పరదేవతాయై నమోనమః.
నమశ్శివాయై చ నమశ్శివాయ
జయజయ శంకర హరహర
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చండీ పరదేవత.
- - - - - - - - - - - - -
వేదకాలం నుంచి మహర్షులు తపోభూములలో అనేక యజ్ఞయాగాదులను లోకకల్యాణం కోసం నిర్వహిస్తూ ఉండేవారు. మహా రాజులు తాము నిర్వహించ వలసిన అశ్వమేథ రాజసూయాది యాగాలను తాము నిర్వహిస్తూ, మహర్షులకు యజ్ఞ యాగాది నిర్వహణకు, గురుకుల నిర్వహణలకు సహాయపడుతుండేవారు. మహర్షులు తమ తపోబలంలోని ఆరవ వంతును చక్రవర్తికి సమర్పించే వారు. మానవులు యజ్ఞ యాగాదులు చేసి, హవిస్సులను సమర్పించి దేవతలను తృప్తి పరిచేవారు. దేవతలు ప్రసన్నులై సకాలంలో వర్షాలు కురిపించి మానవులను అనుగ్రహించేవారు. ఈ విధంగా మానవులు, దేవతలు, మహర్షులు రాజులు సహకరించుకుంటూ సామాన్య ప్రజలందరికీ సర్వ విధ సౌఖ్యాలను కలిగిస్తుండేవారు. కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో ఈ విషయాన్నే ఇలా చెప్పారు.
"దుదోహ గాం స యజ్ఞాయ
సస్యాయ మఘవా దివం
సంపద్వినిమయేనోభౌ
దధతుర్భువన ద్వయం"
కాలం మారింది. ఆ యుగాలలో జరిపే యజ్ఞాలు కలి యుగంలో నిషేధింపబడ్డాయి. అయినా శాస్త్ర విహితమైన యజ్ఞ యాగాదులు జరుగుతూనే ఉన్నాయి. కలియుగంలో మనల్ని రక్షించే దేవతలు ఇద్దరని చెప్తారు. వారిలో ఒకరు వినాయకుడు కాగా, మరొకరు చండీదేవత. ‘కలౌ చండీ వినాయకౌ’ అంటారు. ఎందుకంటే మానవులకు ఎక్కువగా బాధలు రాహు కేతు గ్రహముల ప్రభావం వల్ల కలుగుతాయంటారు. రాహుగ్రహ అధి దేవత దుర్గాదేవి, కేతుగ్రహ అధిదేవత గణపతి. అందుకే వీరిని ఆరాధిస్తే సర్వ దేవీ దేవతలు, నవ గ్రహాలు అనుగ్రహిస్తారు. ఎందుకంటే వీరి ఆరాధనలో మనం సర్వ దేవతలను ఆరాధిస్తాము.
చండీయాగం గురించి చాలా సార్లు మనం చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాము.
చడి - కోపనే అనే ధాతువు నుండి చండీ అనే పదము ఏర్పడింది. కోపముగా ఉండే తల్లి చండీమాత.
గౌరీమాత - లలితా దేవి కరుణామూర్తి అయితే, అధర్మ మార్గంలో ఉన్నవారిని ధర్మ మార్గంలోకి, సన్మార్గంలోకి నడిపించేందుకు కన్నెర్రచేసే ఆమె రూపమే చండమాత. సకలదేవతా స్వరూపిణిగా పూజలందుకుంటున్న దుర్గామాతయే, లలితా పరాభట్టారికయే చండీ పరదేవత.
చండీమాతను ధ్యాన, ఉపాసన మార్గాల్లో కొద్దిపాటి తేడాలతో చండి, నవ చండి, శత చండి, సహస్ర చండి, ఆయుత చండి , ప్రయుత చండిగా ఆరాధిస్తాము. చండీయాగ పరిధిని బహుముఖాలుగా విస్తృత పరిచి చండీయాగాలు నిర్వహిస్తారు.
ఈ సృష్టిలో మంచీ చెడులు, కష్టసుఖాలు కలిసే ఉంటాయి. ప్రకృతి పంచ మహాభూతాత్మకము. ఈ పంచమహాభూతముల వల్లనే, సూర్య చంద్రుల వల్లనే మనమందరం, సర్వ ప్రాణికోటి, మన గలుగుతున్నాము. గాలి, నీరు, నిప్పు, భూమి - ఇవన్నీ సమ తుల్యతను పాటిస్తూ, సౌమ్యంగా ఉంటే మనమందరం ఆనందంగా హాయిగా ఉంటాము. వాటితో పాటు ఆ శక్తుల యొక్క ప్రచండత్వము కూడా మనకు అవసరమే ! వేసవికాలంలో సూర్యుడు తన సంపూర్ణ శక్తిని, ప్రచండత్వాన్ని చూపిస్తేనే, వర్షాకాలంలో వానలు పడతాయి. కనుక మనకు దేవతల సౌమ్య రూపము, ప్రచండ శక్తి కూడా అవసరమే ! అయితే, మానవుల ప్రవర్తనకు, ప్రకృతికి సంబంధం ఉంటుంది. మానవులలో అధర్మ ప్రవర్తన పెచ్చు మీరితే, ప్రకృతి మాతకు కోపమొస్తుంది. అప్పుడు అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అంతు తెలియని రోగాలు మొదలైనవి తలెత్తుతాయి. అప్పుడు మానవులు బుద్ధి తెచ్చుకుని మళ్ళీ అమ్మవారిని ప్రార్ధిస్తారు, చండీహోమము వంటి హోమములు చేస్తారు.
యజ్ఞయాగాదులు నిర్వహించేటప్పుడు ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. సంకల్పం మంచిదైతే మహోగ్రరూపధారిణి అయిన కాళీమాత కూడా కరుణామూర్తిగానే సాక్షాత్కరిస్తుంది. అదే సంకల్పం మానవ కల్యాణానికి విరుద్ధమైనదిగా ఉంటే, రజోగుణ ప్రవృత్తితో, స్వార్ధబుద్ధితో కూడి ఉంటే, సౌమ్యరూపిణి సైతం ఉగ్రరూపిణిగా దర్శనమీయవచ్చును. ధర్మవర్తనుల మీద, భక్తుల మీద జగన్మాత యొక్క అవ్యాజ ప్రేమ తత్త్వమే చండీ తత్త్వము.
చండీమాతకు కోపం ఎక్కువే ! అయితే ఆ కోపం ఎలాంటిదంటే, పిల్లవాని విషయంలో తల్లికి వచ్చే కోపంలాంటిది. తన పిల్లలను దుష్ట శక్తుల నుండి కాపాడుకోవడం కోసం దుర్గామాత చండీ దేవతగా అవతరిస్తుంది.
శాక్తేయ తంత్ర భాగంలో, మంత్ర భాగంలో అత్యంత శక్తిమంతము, అత్యద్భుత ఫలితాలను ప్రసాదించేదిగా చండీ యాగానికి గొప్ప పేరున్నది. ఇది ఎంతో శక్తిమంతమైనదీ, మరెంతో ఉత్కృష్టమైనది. అయితే, భక్తి శ్రద్ధలు నియమ నిష్ఠలు ముఖ్యం. జగదంబ పట్ల భక్తిశ్రద్ధలు ఉన్నావారు, పంచదశి, లేక షోడశి మంత్రోపదేశమున్నటు వంటివారు యజమానులుగా కూర్చుని, నిత్య సంధ్యావందనం చేసే బ్రాహ్మణులందరూ యాగ హోమములో భాగస్వాములయి, లోక కళ్యాణం కోసం చండీయాగమును చెయ్యచ్చును.
శుంభ నిశంభ, చండ ముండాసురులను, రక్త బీజ, మహిషాసురాది దుష్ట రాక్షస సంహారం కోసం అమ్మవారు దుర్గ, చండిక, చాముండీ, బాలా తదితర అవతారాలుగా తనను తానే సృజింపజేసుకుని లోక కల్యాణం కోసం దుష్ట దనుజ సంహారం చేసింది.
ఏదైనా ఒక గొప్ప కార్యం సిద్ధించాలని ఉపాసకుడు అనుకుంటే, ఎప్పుడైనా చండీ సప్తశతి లేక దుర్గా సప్తశతిని పారాయణం చేయవచ్చు, చండీ యాగం నిర్వహించవచ్చు. దేవీ నవరాత్రులప్పుడు చేస్తే విశేష ఫలప్రద మవుతుంది. చండీహోమములో దుర్గా సప్తశతి మంత్రాలతో జరిగే హవనము మనకు చండీపరాంబిక శక్తిని తెలియజేస్తుంది.
దుర్గా సప్తశతి అంటే 700 శ్లోకాలలో దుర్గామాత వైభవాన్ని ప్రస్తుతించటం. దుర్గా సప్తశతిని పారాయణం చెయ్యటం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది మనోబలం పెరుగుతుంది, దుష్టత్వంపై పోరాటపటిమ ఏర్పడుతుంది.
ఇలాంటి యాగాలు, యజ్ఞాలు చేయడం వల్ల సకాల వర్షాలు కురుస్తాయి, కరువుకాటకాలు పోతాయి, విశ్వశాంతి చేకూరుతుంది.
సామూహికంగా అందరూ కలిసి మంచి మనసుతో ప్రార్థించటము వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది.
కరోనా లాంటి మహమ్మారుల తో, కరవుకాటకాలు, వరదల వంటి ప్రకృతి భీభత్సాలతో, శతృ దేశ దురాక్రమణల వలన
దేశానికి విపత్తి ఏర్పడే సందర్భంలోను ప్రజలు సామూహిక బాధలను అనుభవించ వలసి వచ్చినప్పుడు సర్వ మానవ శ్రేయః సంకల్పంతో సామూహికంగా చండీయాగము చెయ్యటం వలన ఉపద్రవాలన్నీ శాంతించి శుభములను కలుగుతాయి. శాంతి సౌమనస్యాలు నెలకొంటియి. ఆనందోత్సాహాలు వృద్ధి చెందుతాయి.
కలిపురుషుడు వివిధ రూపాలలో రాజ్యమేలుతున్న నేటి కాలంలో మహా ప్రచండ శక్తితో జ్వలించే చండీ దేవతే మనకు అండగా నిలిచి రక్షించాలి, ఆ జగన్మాత ద్వారానే దుష్టశక్తుల అంతం జరుగుతుందన్న భావనతోనే సాధారణంగా అందరూ చండీయాగ నిర్వహణకు సంకల్పిస్తారు. కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు చండీహోమము చేస్తారు, లేదా చేయిస్తారు.
కేవలము లోక కల్యాణ సంకల్పంతో, పరదేవతకు సమర్పణ భావనతో చండీయాగము చెయ్యటం వలన మన వ్యక్తిగత కోరికలు కూడా నెరవేరుతాయి, మన సంకల్పాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మనం కూడా అందరిలో ఉన్నాము కనుక !
అమ్మవారికి విశేషమైన పూజలు జరిపే ఆశ్వయుజ మాసంలో భక్తులు చండీహోమము జరుపుకుంటూ చండీ పరదేవతకు ఆనందాన్ని కలిగించి ఆమె అనుగ్రహానికి పాత్రులగుదురు గాక !
సర్వ మానవాళినీ చండీపరదేవత రక్షించుగాక ! అని ప్రార్ధిస్తున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డా.విశాలాక్షి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి