11, జనవరి 2025, శనివారం

*శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం

 🎻🌹🙏 *శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం మంగళగిరి*


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸 ఇటు నరుడు కాకుండా .. అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నారసింహ అవతారం.. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహ స్వామి గా భక్తులతో కీర్తించబడుతున్నాడు.


🌿 అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలసిన స్వామిని పానకాల నరసింహ స్వామిగా భక్తులు పూజిస్తారు.


🌸 ఈ దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. 


🌿 హిరణ్యకశిపుని వధానంతరం

 శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో, రౌద్రంగా , అందరికీ భీతికొల్పుతూ వున్నారు.

దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం కనబడలేదు.  


🌸శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము సమర్పించినది. దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు.  


 🌿ఈయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి.  

ఈయనకి భక్తులు కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని , ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.


🌸 ఇక్కడ ముగ్గురు నరసింహస్వాములు భక్తుల పూజలందుకుంటున్నారు.

 ఒకరు ఎగువ సన్నిధి పానకాల నరసింహస్వామి, 

రెండవ వారు దిగువ సన్నిధి లక్ష్మీనరసింహస్వామి కాగా, కొండ శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి మూడవవారు. 


🌿 కృష్ణానదికి అతి దగ్గరలో ఈ వైష్ణవక్షేత్రం నెలకొని వుంది. లక్ష్మీదేవి యీ పర్వతంపైన తపస్సు చేసినందున యీ క్షేత్రాన్ని మంగళగిరిగా పిలువబడుతున్నది. అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ , మార్కొండ అనే పేర్లుండేవి.


 🌸ఈ క్షేత్రంలో పానకాల నరసింహస్వామి ముఖ్య దైవం. పానకాన్ని భక్తుల నుండి స్వీకరిస్తూ పానకాలరాయుడుగా యీ దైవం పేరొందారు.

 

🌿 పురాణాల ప్రకారం పానకాల స్వామి స్వయం వ్యక్తరూపుడు. ఈ ఆలయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. రాత్రులు దేవతలు పూజకై వస్తారని భక్తుల నమ్మకం. 


🌸పానకాల స్వామికి బెల్లం, మిరియాలు, యాలుకులు కలిపిన నీటితో పానకం తయారుచేసి భక్తులు సమర్పిస్తారు. నివేదించిన పానకంలో స్వామి వారు సగం త్రాగి మిగిలినవి భక్తులకు వదిలి వేస్తారని నమ్మకం. 


🌿భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంక పానకం పోయటం ఆపి , మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా , ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.


🌸సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. 


🌿 మంగళగిరి దిగువ క్షేత్రములో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయుమువున్నది. దేవతలు ప్రతిష్ఠించిన మూర్తులు దైవీయాలు. 


 🌸ఈ దేవాలయములోని మూల విరాఠ్‌ను ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస కాలమందు ధర్మరాజు ప్రతిష్ఠించారని చెప్తుంటారు. కాబట్టి ఈ మూర్తి దైవీయము. 


🌹 గండదీపం : 🌹


🌿 కొండశిఖరాన వున్న గండాల స్వామికి రూపం లేదు. అక్కడ దీపం వెలిగించేందుకు ఏర్పాటు మత్రమే ఉంటుంది గాని ప్రత్యేక విగ్రహం వుండదు. భక్తులు తమకు గండాలు వచ్చినప్పుడు గండం నుండి గట్టెక్కించమని, గండం తీరిన తరువాత గండదీపం వెలిగిస్తామని మొక్కుకుని ఆ ప్రకారం వెలిగిస్తారు.


🌸 అక్కడ వుండే భాండీలో ఆవు నెయ్యిగాని, నువ్వుల నూనెగాని పోసి, పెద్ద వత్తి పెట్టి సాయంత్రాలలో వెలిగించి వస్తారు. ఆ గండదీపం చుట్టుప్రక్కల చాలా గ్రామాల పజలకు కన్పిస్తుంటుంది.


🌹 దక్షిణావృత శంఖం :🌹


🌿 మంగళగిరి లక్ష్మీ నరసింహ దేవాలయంలో వున్న విశిష్ఠ సంపదలో దక్షిణావృత శంఖం ఒకటి. దీనిలో నుండి సర్వదా, సర్వవేళలా ప్రణవనాదం(ఓంకారం) వినిపిస్తుంటుంది. బంగారు తొడుగు యీ శంఖానికి వుంది. ముక్కోటి ఏకాదశినాడు యీ శంఖంతో భక్తులకు తీర్ధమందిస్తారు.


🌸 ఈ దేవాలయానికి 11 అంతస్థుల గాలిగోపురం తరువాత చెప్పుకోదగిన నిర్మాణము "పెద్ద రథము". ఇది ఆరు చక్రాలతో ఎంతో సుందరంగా గంభీరంగా వుంటుంది. దీనిని ఎంతో బరువైన, పొడవైన త్రాడుతో ప్రజలు ఉత్సాహంగా, అలుపెరుగకుండా లాగుతారు.


🌿 మంగళగిరిలో పానకం విశిష్టత. 

ఆలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాల్లో నాలుగు రకాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీటిని జలతీర్థం, కషాయతీర్థం, పంచామృత

అభిషేక తీర్థం, పానక తీర్థం అంటారు.


🌸ఇక్కడి పానక తీర్థాన్ని సేవిచండం ద్వారా దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వస్తుంది. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి... స్వస్తి..🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: