11, జనవరి 2025, శనివారం

వాసనా త్రయం

 వాసనా త్రయం దేహా వాసన, లోక వాసన శాస్త్ర వాసన 

*శాస్త్రాన్ని ఎంత తెలుసుకున్నా - ఎన్ని సాధనలు చేస్తున్నా ఎందువల్ల ఆత్మసాక్షాత్కారం కలగటం లేదు?* అంటే బుద్ధికి సూక్ష్మత్వం - శుద్ధత్వం లేకపోవటం వల్లనే అని తెలుస్తున్నది.
*బుద్ధికి శుద్ధత్వం ఎందుకు లేదు?* మలిన వాసన వల్ల –
*మలిన వాసనలు ఏవి?* - 1.లోక వాసన 2.శాస్త్ర వాసన 3.దేహ వాసన.
*(1) లోక వాసన* :- ఇతరులు నన్ను స్తుతించేటట్లు - నిందించకుండా ఉండేటట్లు పనులు చేయాలి అనే భావనతో పని చేయటం లోక వాసన. ఏం చేయాలి? ఇతరుల నిందాస్తుతులను పట్టించుకోకుండా తన హితం కొరకు పని చేయాలి.
*(2) శాస్త్ర వాసన* :- (i) శాస్త్రాలన్నీ చదివి పూర్తి చేయాలి అనే పాఠ వ్యసనం.
(ii) అభ్యాసం కోసం అనేక విధాలైన శాస్త్రాలను సంగ్రహించి, వెదకటమనే బహు శాస్త్ర వ్యసనం
(iii) వేద శాస్త్రాలలో విధించబడిన కర్మానుష్టానమునందే జీవిత కాలమంతా గడిపివేయటమనే అనుష్టాన వ్యసనం. కర్మలయందు శ్రద్ధ అనే జడత్వాన్ని విడిచిపెట్టాలి. ఈ కర్మ వాసన పునర్జన్మకు కారణమౌతుంది. అలాగే శాస్త్ర వాసన దర్పం పెరగటానికి తోడ్పడుతుంది.
మరేం చేయాలి? - పరమార్థ తత్వాన్ని తెలుసుకొనేంతవరకే శాస్త్రాలను తిరగేయాలి. స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఆచరణకు ప్రాధాన్యత నివ్వాలి.
*(3) దేహ వాసన* :- దేహాత్మ బుద్ధి. దేహమే ఆత్మ (నేను) అనే బుద్ధి. దేహ పోషణ యందే కాలమంతా వెచ్చించటం. కంఠాన్ని బాగుచేసుకోటానికి ఔషధాలు సేవించుట, సుగంధ తైలాలు, వస్త్ర భూషణాలు ఉపయోగించటం, పుణ్యం కోసం గంగా స్నానాలు, సాలగ్రామాదులు సంపాదించటం, దోషాలు పోగొట్టుకొనుటకు శౌచం, ఆచమనం ద్వారా పవిత్రమగుట - ఇవన్నీ జ్ఞాన ప్రతి బంధకాలు -
ఈ 3 రకాల వాసనలు తొలగించుకుంటే బుద్ధి శుద్ధమౌతుంది. ఇక *బుద్ధికి సూక్ష్మత్వం ఎందుకు లేదు? ఎలా వస్తుంది?* -
రాజస తామస వృత్తుల వల్ల (ఆలోచనల వల్ల) సూక్ష్మత్వం లేదు. ఆ వృత్తులను నిరోధించి బుద్ధికి పదును పెడితే సూక్ష్మమవుతుంది. దానిని రెండు విధానాల ద్వారా సాధించాలి.
(i) యోగం. (ii) విచారణ (వివేకం)
*(i)* ధ్యాన యోగం ద్వారా రాజస తామస వృత్తులను నిరోధించవచ్చు.
*(ii)* ఆత్మ విచారణ ద్వారా బుద్ధి సూక్ష్మమవుతుంది.
*ఆత్మ విచారణ అంటే* -
దేహమనోబుద్ధుల కన్న - వేరుగా ఉన్నది, పంచకోశాలకు ఆవల ఉన్నది, మూడు అవస్థలకు సాక్షిగా ఉన్నది ఆత్మ అని విచారణ చేసి గ్రహించాలి, ఆ ఆత్మ నేనేనని మళ్ళీ మళ్ళీ స్మరించాలి.
ఇలా వాసనాక్షయం ద్వారాను, ధ్యాన యోగ, ఆత్మ విచారణ ద్వారాను బుద్ధి శుద్ధమౌతుంది, సూక్ష్మమవుతుంది. ఇట్టి బుద్ధి తత్వంలో నిలిస్తే - ఆత్మలో నిలిస్తే - బ్రహ్మంలో నిలిస్తే సమాధిలో నిలిస్తే ఆత్మానుభూతి కలుగుతుంది.

శ్రీ ఆదిశంకరాచార్యులవారి ఆత్మబోధ.

కామెంట్‌లు లేవు: