11, జనవరి 2025, శనివారం

ఆధ్యాత్మికం - దానమే ధర్మం*

 *ఆధ్యాత్మికం - దానమే ధర్మం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*భారతీయ సంస్కృతిలో దానం ప్రముఖమైంది. అదెంతో మహిమాన్విత స్థానాన్ని సంతరించుకుంది. సనాతన ధర్మానికి ప్రధాన సూత్రమైన దానగుణం, మానవహితానికి ఏర్పరచిన పరిపక్వ ప్రణాళికగా గోచరిస్తుంది. దానం స్వీకరించేవాడికి భుక్తి ప్రదాయకం. ఇచ్చేవాడికి ముక్తి ప్రదాయకం. దానం ఇచ్చేవాడి ఆయువు పెరిగినా, తీసుకునేవాడి ఆయువుమాత్రం తరగదు. సంపన్నులు నిరుపేదలను, నిస్సహాయులను ఆదుకునేందుకు దానగుణం మానవజాతిలో సర్వదా సుస్థిరమై వెలుగొందాలనే మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.*


*తల్లికిచ్చిన దానం నూరు రెట్లు, తండ్రికిచ్చిన దానం వెయ్యి రెట్లు, సహోదరులకిచ్చిన దానం అనంతంగా ఫలితాన్నిస్తుందంటారు. పాపాత్ములకు, దుర్వ్యసనపరులకు ఇచ్చిన దానం పూర్తిగా వ్యర్థమైపోతుంది. అంటే, యోగ్యులకే దానం చెయ్యాలి. పాత్రతనెరిగి దానం చెయ్యాలి. తీర్థయాత్రల్లో, పుష్కర స్నాన సమయాల్లో, శుభకార్యాల్లో చేసే దానం పుణ్య ఫలితాలనిస్తుంది.*


*మహాభారతం 'అరణ్యపర్వం'లో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు దానధర్మాల మహిమ గురించి విపులీకరించాడంటారు. దానం ఇవ్వలేనివాడు, ఇవ్వగలిగే సత్పురుషుణ్ని యాచకుడికి చూపినా పుణ్యఫలమే సంప్రాప్తిస్తుందట. బీదలకు చేసేదానం దేవుడికిచ్చిన అప్పుతో సమానం. దేవుడు మళ్లీ వడ్డీతోసహా మనకందజేస్తాడు!*


*మరికొన్ని పురాణాల్లో పదమూడు విధాల దానాల వివరణ ఉంది. రక్తదానం, ఆరోగ్యదానం, అవయవదానం, నేత్రదానం, కాయదానం, శ్రమదానం, సమయదానం, అభయదానం, ఆశీర్వచన దానం, దయాదానం, క్షమాదానం, త్యాగదానంతోపాటు గోదాన - కన్యాదాన మహిమలనూ విపులీకరించారు.*


*దానం చేస్తున్న మనిషిలో ప్రేమ, శ్రద్ధ, అభిమానం ఉండాలి. లోభత్వం ప్రకటించకూడదు. ఔదార్యం, దాక్షిణ్యం కలిగిన దానమే సత్ఫలితాలను ఇస్తుంది. విసుగుదలతో రాగద్వేషాలతో ఇచ్చేదానం నిరర్థకం. పేదలకు మనం పెట్టే ఆహారం దేవుడి ఖాతాలో మన పేర జమవుతుందని గ్రహించాలంటారు పెద్దలు.*


*జ్ఞాని అయిన ధనికుడు తన సంపాదనలోని కొంత భాగాన్నయినా దానం చెయ్యాలన్న నియమం పెట్టుకుంటాడు. ధనికుడైన లోభి కన్న దానశీలి అయిన పేదవాడు గొప్పవాడు. సముద్రంలో ఉన్న అపారమైన క్షారజలంతో దాహార్తి తీరదు. కానీ, చెలమలోని గుక్కెడు నీరు అతడి దాహం తీర్చి ప్రాణం నిలబెట్టగలదు. నీరు మంటను ఆర్పేసినట్టు దాన ధర్మాలు పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిస్తాయి.*


*వందమందిలో శూరుడొకడే ఉంటాడు. వేయిమందిలో పండితుడొక్కడే ఉంటాడు. పదివేల మందిలో వక్త ఒక్కడే ఉంటాడు. లక్షమందిలో నిజమైన దాత ఒక్కడే ఉండొచ్చు. ఉండకపోనూ వచ్చు. దాన గుణ వైశిష్ట్యం అంత మహత్తరమైంది. క్షేత్రమెరిగి విత్తనం వేస్తే మంచి మొక్క వస్తుంది. మహావృక్షమవుతుంది. అలాగే అర్హతగలవాడికి దానం చెయ్యడంవల్లనే అనంతపుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఆర్భాటంతో, ప్రచారంతో, కీర్తికండూతితో చేసే దానం ఫలితమివ్వదు. గుప్తదానానికుండే ఫలితం అనంతమైనది.*


*ఒకరోజున మహాకవి కాళిదాసు భోజరాజు ఆస్థానానికి బయలుదేరాడు. అది వేసవికాలం, ఎండ తీక్షణంగా ఉంది. ఒక పేదవాడు చెప్పులు లేకుండా ఆ ఎండలో నడుస్తూ బాధపడుతూ ఎదురైనాడు. కాళ్లు కాలుతూ, అవస్థపడుతున్న ఆ పేదవాడి బాధకు జాలిపడిన కాళిదాసు తన చెప్పులతనికి ఇచ్చి నడక కొనసాగించాడు. అలా నడవడం తనకూ కష్టంగానే ఉంది. అయినా ఒక బాటసారికి సాయపడిన తృప్తి, ఆనందం ముందు అది బాధనిపించలేదు. ఇంతలో రాజుగారి ఏనుగును మావటివాడు అటువైపు తోలుకుని పోతూ కాళిదాసు పాదరక్షలు లేకుండా నడవడం చూసి దిగి, ఏనుగుమీద ఎక్కించుకొని రాజుగారి కొలువుకు తీసుకెళ్లాడు. కొలువులోని కవులు ఆశ్చర్యపోయి 'మహాకవీ! ఇవాళ ఏమిటీ మహర్దశ?' అని అడిగారు. 'నేను చేసిన స్వల్పదానానికే గౌరవం' అని జరిగినది వివరించాడు కాళిదాసు. నిర్మల హృదయంతో నిస్వార్థ బుద్ధితో చేసే ఇటువంటి దానం మానవుణ్ని మహోన్నత యశోశిఖరాలకు తీసుకుపోతుంది. దానంచెయ్యడానికెంత సంపద ఉందన్నది ప్రశ్న కాదు. ఆపదలో ఆదుకునే ఆవగింజంత దానమైనా చాలు, మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది. దరిద్రుడైనా తనకున్నదాంట్లో కొంత దానంచేసి నిస్సహాయులకు తోడ్పడవచ్చు. దానానికి ఉపయోగపడని ఎంత ధనరాశి అయినా వృథా. ఎవడికేది అవసరమో గ్రహించి ప్రదానం చేసేదే దానం. రక్త, నేత్ర, మూత్రపిండ దనాలు విశిష్టమైనవని ఆయుర్వేదంలోని అష్టాంగ మార్గం ప్రవచిస్తోంది. దీనులకు, ఆర్తులకు చేసే ఏ దానమైనా విశిష్టమైనదేనన్నారు ఆదిశంకరులు. మనంచేసే దానధర్మాలే మనకోసం ఏర్పరచుకునే సంక్షేమ నిధులు. దానం చెయ్యడం అంటే మనకోసం భగవంతుడే వెదికేలా చేసుకోవడమన్నమాట. సంపద ఉంటే దానం చెయ్యాలి. లేకుంటే హృదయాన్నయినా దానం చెయ్యాలి. అప్పుడే మానవ జన్మ చరితార్థం.*


- *చిమ్మపూడి శ్రీరామమూర్తి ✍️*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: