11, జనవరి 2025, శనివారం

11-54-గీతా మకరందము

 11-54-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ ||భగవత్స్వరూపదర్శనము మఱి దేనివలన లభించునో తెలియజేయుచున్నారు - 


భక్త్యా త్వనన్యయా శక్య 

అహమేవం విధోఽర్జున | 

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన 

ప్రవేష్టుం చ పరన్తప || 


తా:- శత్రువులను తపింపజేయువాడా! ఓ అర్జునా! ఈ విధమగు రూపముగల నేను అనన్యభక్తిచేత మాత్రమే యథార్థముగ తెలిసికొనుటకును, చూచుటకును, ప్రవేశించుటకును, సాధ్యమైనవాడ నగుచున్నాను. 

  

వ్యాఖ్య:- క్రిందటి శ్లోకమున వేదపఠన యజ్ఞాదులవలన భగవద్దర్శనము కాజాలదని చెప్పబడినది. మఱిదేనిచేత భగవద్దర్శనము కాగల్గునో ఈ శ్లోకమందు విపులముగ చెప్పబడినది. భగవత్సందర్శనమునకు ఉపాయము చెప్పబడిన శ్లోకమగుటచే ఇది అతి ముఖ్యమైనది. ముముక్షువు లిద్దానిని బాగుగ మననముచేసి అందలి భావములను కార్యాన్విత మొనర్పవలెను. 

      అనన్యభక్తివలననే మనుజుడు పరమాత్మను సందర్శింపగల్గునని యిట వచింప బడినది. భక్తి అను పదమునకు ‘అనన్య’ అను విశేషణముచేర్చుటవలన, ఇతరములగు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తినుంచక కేవలము పరమాత్మయందే అనన్యమగు ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగియుండవలయునని స్పష్టమగుచున్నది. పంపకములేని భక్తి, మఱియొక వస్తువుపై చెదిరిపోనిభక్తి, పరమాత్మతప్ప, అన్యవస్తువును అభిలషింపని భక్తి అనన్యభక్తి యనబడును. సామాన్యముగ జనులయొక్క భక్తి కొంత గృహారామాదులందు, దారాపుత్రులందు, సంపదలయందు, కీర్తిప్రతిష్ఠలయందు విభజింపబడినది యగుటవలన,భగవంతునిపై ఏ కొద్దియో భక్తి మిగులుచున్నది. ఇది అనన్యభక్తికాదు. దృశ్యపదార్థములందు పంపకము లేని భక్తియే అనన్యభక్తి. అదియే భగవత్సందర్శనమునకు ఏకైక ఉపాయమని యిట తెలుపబడినది. 

    అట్టి అనన్యభక్తి భగవానుని (1) తెలిసికొనుటకు (జ్ఞాతుం), (2) చూచుటకు (ద్రష్టుం), (3) ప్రవేశించుటకు (ప్రవేష్టుం) శక్యమగునని పేర్కొనబడినది. దాని భావమేమి?ఇచట తెలిసికొనుట, చూచుట, ప్రవేశించుట అను మూడు క్రియలు చెప్పబడినవి. ప్రారంభమున మనుజునకు ‘భగవంతుడిట్టివాడు’ అను పరిజ్ఞానము కలుగును. ‘జ్ఞాతుమ్’ ఇది మొదటి అంతస్తు. ఈ స్థితియందు భక్తునకు భగవంతుడొకింత దూరముగనే యుండును. ఇది ద్వైతస్థితి. తదుపరి అభ్యాసవశమున ఆ భక్తుడు భగవంతునకు ఇంకను సమీపమునకు వచ్చి ప్రత్యక్షముగా (face to face) ఆతనిని దర్శింపగల్గును. (ద్రష్టుమ్). ఇక భగవద్విషయమై అతనికేమాత్రము సందేహము యుండజాలదు. ఇది రెండవ అంతస్తు. ఇది మొదటిదానికంటె పైస్థితి. ఈ స్థితియందు భక్తుడు భగవంతునకు అతిసమీపమున వచ్చి చేరును. అత్తఱి, కరతలమందలి బిల్వఫలమునుగాని, ఆమలకఫలమునుగాని, మనుజుడు ప్రత్యక్షముగ చూడగల్గునట్లు, యాతడు భగవంతుని విస్పష్టముగ గాంచగల్గును. ఇది దాదాపు విశిష్టాద్వైతస్థితికి సమానము. 

     అటుపిమ్మట అభ్యాసప్రాబల్యముచే ఆ భక్తుడు భగవంతునికింకను సమీపమునకు వెళ్లి క్రమముగ వాఱియందు ప్రవేశించి ఐక్యమైపోవును. (ప్రవేష్టుమ్). ఉప్పుకల్లు సముద్రమునందు లయించినట్లు, వర్షబిందువు నదీజలమున మిళితమైపోవునట్లు, నీళ్లు పాలలో కలిసిపోయినట్లు, అత్తఱి భక్తుడు భగవంతునియందు విలీనమైపోవును. అపుడు భక్తుడు, భగవంతుడు - అను రెండు వస్తువులుండనేరవు. ఒకే భగవద్వస్తువు మిగిలియుండును. ఇది మొదటి రెండంతస్తులకంటెను పరమైనది. ఇది పూర్ణఅద్వైతస్థితి. ప్రతివాడు మొదటి రెండంతస్తుల యనుభవమునుబొంది, అంతటితో తృప్తినొందక సాధనాభ్యాసమును ఇతోధికముగ కొనసాగించుచు మూడవది యగు భగవత్సాయుజ్యమును బొందవలెను. పైన దెల్పిన మూడుస్థితులలో మొదటిది సామీప్యము, రెండవది సారూప్యము, మూడవది సాయుజ్యము. సామాన్యముగ కొందఱు భగవంతునిగూర్చి శాస్త్రాదులవలన ఒకింతతెలిసికొని అంతయు తెలిసినదని తృప్తినొంది సాధనను విరమింతురు. అది సరికాదు. అట్టివాడు పూర్ణత్వమును బొందజాలదు. ఆతడింకను ముందుకుపోయి, భగవానుని ప్రత్యక్షముగ దర్శించుటకు, ఆతనిలో ఐక్యమొందుటకు యత్నింపవలెను. కనుకనే శ్రీకృష్ణమూర్త్తి కేవలము ‘జ్ఞాతుమ్’ అనిచెప్పి ఊరుకొనక, ‘ద్రష్టుమ్’, ‘ప్రవేష్టుమ్’ అనికూడ వచించిరి. 

       ఒకమంచిఫలము బజారునందు కలదనియు, దానివర్ణము, రుచి, విలువ ఇట్టి దనియు ఒకడు ఇంటివద్ద కూర్చొని మఱియొకని ద్వారా తెలిసికొనెను - అనుకొనుడు. వెంటనే దానినిగూర్చి యాసక్తిగలిగి బజారునకువెళ్ళి దానిని చూచును. చూచిన పిదప ఇంకను ఆసక్తిగలిగి దానినికొని భుజించును. ఇచ్చోట, మొదటిస్థితి ‘జ్ఞాతుమ్’ అని భగవానుడు చెప్పినదానికి సరిపోవును. (భగవంతునిగూర్చి సద్గురువులవలన, సచ్చాస్త్రముల వలన తెలిసికొనుట). అట్లే రెండవస్థితి ‘ద్రష్టుమ్’ అనుదానికి సరిపోవును. (సాధనాభ్యాసములచే భగవంతుని ప్రత్యక్షముగ గాంచగల్గుట). మూడవస్థితి ‘ప్రవేష్టుమ్’ అను పదమునకు సరిపోవును. (సాధనపరిపక్వతచే భక్తుడు భగవంతుయందైక్యమగుట). ఇదియే జీవన్ముక్తదశ, మోక్షస్థితి. ఒక ఇంటినిగూర్చి తెలిసికొనుట, తెలిసికొనిన పిమ్మట దానిని సమీపించుట, తదుపరి ఇంటిలో ప్రవేశించుట యెట్లో, అట్లే భగవంతునిగూర్చియు నెఱుంగవలయును.

ప్రతివాడును అనన్యభక్తియొక్క సమాశ్రయముచే భగవదైక్యరూపమగు అద్వైత పరాకాష్ఠస్థితిని జీవితములో తప్పక పొందియేతీరవలెను. అపుడే సంసారదుఃఖమంతమగును. 

     ‘యదాహ్యేవైష ఏతస్మిన్నుదరమన్తరం కురుతే అథ తస్య భయం భవతి’ అను ఉపనిషద్వాక్యానుసారము భగవంతునకు తనకు రవ్వంతైనను ఎడమున్నచో భయము జనించును. భయముగలస్థితి పూర్ణస్థితి యెన్నటికిని కానేరదు. కాబట్టి ‘ప్రవేష్టుమ్’ అను మూడవదశను ప్రతిజీవియు అనన్యభక్తియొక్క సాహాయ్యముచేపొంది కృతార్థుడు కావలయును. 

     కేవలము వేదపఠనాదులచే ముక్తికలుగునని వచించినచో చదువురానివారు అక్కార్యమును చేయజాలరు. కనుక వారికీ ముక్తిలేకపోవును. కేవలము తపస్సులచేగాని, యజ్ఞములచేగాని ముక్తికలుగునని వచించినచో అవియు సర్వులకు అందుబాటులో లేవు, గనుక అందఱును చేయజాలరు. కేవలము దానములచే మోక్షము సిద్ధించునని చెప్పినచో బీదవారు దాని నాచరింపలేరు, కావున వారికిన్ని ముక్తిలేకపోవును. భక్తిచేతనే భగవద్దర్శనము, (భగవదైక్యము) చేకూరగలదని ఇచ్చట చెప్పుటవలన, అది సులభముగ నుండుటచేతను, సర్వులకును అందుబాటులో నుండుటచేతను ఎల్లరుకును అవలంబనీయమై యొప్పుచున్నది. కావున జీవరాసులయెడల కరుణగలిగి ఇట్టి సర్వజనసులభమగు మోక్షసాధనమును భగవాను డిచట తెలిపినవారైరి. 

                  

ప్ర:- భగవద్దర్శనమున కుపాయమేమి? 

ఉ:- అనన్యభక్తి. 

ప్ర:- దానివలన జీవునకు ఏ యే ప్రయోజనములు సిద్ధించును?

ఉ:- భగవంతునిగూర్చి తెలిసికొనగల్గును. వారిని చూడగల్గును. వారియందు ప్రవేశింపగల్గును.

కామెంట్‌లు లేవు: