*తిరుమల సర్వస్వం 115-*
*తాళ్ళపాక అన్నమాచార్యుడు 3*
*అలమేలు మంగమ్మ దర్శనం*
ఇంతలోనే, *"అన్నమయ్యా! లే నాయనా!"* అంటూ ఓ స్త్రీమూర్తి ఆప్యాయమైన పిలుపు స్పహతప్పి పడిఉన్న అన్నమయ్యకు వినబడింది. పుత్రవాత్సల్యం తొణికిసలాడుతున్నట్లున్న ఆ మధురస్వరం, తన తల్లి లక్కమాంబ తనను లాలనతో పిలుస్తున్నట్లుగా అనిపించి, కొద్దిగా ఊరట చెందాడు. నడిమార్గంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను కాపాడమని ఆ స్త్రీమూర్తిని వేడుకున్నాడు. దయార్ద్ర హృదయురాలైన ఆ తల్లి, *"నాయనా! అందరికీ అమ్మనైన నేను అలమేలుమంగను. శ్రీవేంకటేశ్వరుని హృదయంలో కొలువై ఉంటాను. ఇప్పుడు నీవు సాక్షాత్తు పరమ పవిత్రమైన తిరుమలక్షేత్రం పై ఉన్నావు. ఈ క్షేత్రం అంతా సాలగ్రామమయం. కొండపైనున్న శ్రీనివాసుడు కూడా సాలగ్రామ శిలారూపమే! అందువల్ల పాదరక్షలతో ఈ కొండను ఎక్కడం మహాపాపం. నీ కాలికి ఉన్న పాదరక్షలను విడిచి శిఖరాన్ని అధిరోహించు. నీ మనోరథం సిద్ధిస్తుంది."* అంటూ దారీ-తెన్నూ తెలియని అన్నమయ్యను ఓదార్చింది.
అప్పటికే శ్రీనివాసుని గురించి, అలమేలుమంగను గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉన్న అన్నమయ్యకు, తన తప్పు తెలిసింది. వెంటనే కాలిజోళ్లను దూరంగా విసిరి వేశాడు. అలమేలుమంగ దర్శనంతో తన జన్మ చరితార్థం అయినట్లుగా భావించి, నిండు మనసుతో తన తప్పు క్షమించమని ఆ లోకపావనిని వేడుకున్నాడు. ఆ తల్లి తనతో తెచ్చిన శ్రీవారి అన్నప్రసాదాలను-గోరుముద్దలుగా చేసి బాలుడైన అన్నమయ్యకు తినిపించి, తనను *"ముల్లోకాలకు తల్లి"* గా చాటుకుంది.
శ్రీవారి ప్రసాదం!! అందునా సాక్షాత్తు అమ్మవారి చేతితో తినిపించబడింది.. ఇంకేముంది! అన్నమయ్యలో సరిక్రొత్త ఉత్సాహం ఉరకలు వేసి, ఒక మహత్తరమైన ఆధ్యాత్మికశక్తి ఆవహించింది
*జొచ్చితి తల్లీ! నీ మరగు*
*సొంపుగ నీ కరుణా కటాక్షమె* *ట్లిచ్చెదొ నాకు నేడు పర*
*మేశ్వరి! యో యలమేలుమంగ! నీ..*
అంటూ ప్రారంభించి, అలమేలుమంగను ఓ నూరు పద్యాల శతకంతో ఆశువుగా స్తుతించాడు.
దాంతో పరమానందం చెందిన అలమేలుమంగ, అన్నమయ్యను మనసారా ఆశీర్వదించి, వేంకటాచలాన్ని స్వయంగా సేవించి, తరించి, ఇతరులను కూడా తరింపజేయమని ఆదేశించి అదృశ్యమయ్యింది. అమ్మవారి అనుజ్ఞను శిరసావహించిన అన్నమయ్య, తరువాతి కాలంలో పలుమార్లు శ్రీవారి దర్శనం చేసుకోవడం ద్వారా తాను తరించి, శ్రీవారి యెడ భక్తిభావం ఉట్టిపడే తన రసరమ్య గీతాలాపనతో కోటానుకోట్ల భక్తులను తరింపజేశాడు.
కారణజన్ముడు అన్నమయ్య తిరుమలశిఖరాన్ని చేరుకోవడం, శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళమూర్తిని దర్శించుకోవడం, ఆయాసందర్భాల్లో అన్నమయ్య నోటినుండి ఆశువుగా అనేక గీతాలు వెలువడడం వివరంగా తెలుసుకుందాం.
కరుణామయు రాలైన అలమేలుమంగమ్మ చేతి ప్రసాదసేవనంతో, ఆమె ప్రోత్సాహంతో, అన్నమయ్య నిరాశానిస్పృహలు పటాపంచలయ్యాయి. ఉత్సాహం రెట్టింపైంది. ప్రతి రాయిలోను, ప్రతి చెట్టులోనూ, ప్రతి మెట్టులోనూ, అన్నింటిలోనూ శ్రీవారే గోచరిస్తున్నారు. శ్రీవేంకటేశ్వరునిపై రాగరంజితమైన కీర్తనలను అలవోకగా ఆలపిస్తుండగా, భక్తులు ఒక్కొరొక్కరుగా అన్నమయ్యను అనుసరిస్తూ, పదంలో పదం కలుపుతున్నారు. ఇంతలోనే అల్లంత దూరంలో వేంకటాద్రి పర్వత శిఖరం గోచరించింది. ఇనుమడించిన ఉత్సాహంతో శేషాచల శిఖరాలను ఆర్తిగా అభివర్ణించాడు:
*అదివో అల్లదివో శ్రీహరి వాసము*
*పదివేల శేషుల పడగల మయము ||*
*అది వేంకటాచల మఖిలోన్నతము*
*అదివో బ్రహ్మాదుల కపురూపము*
*అదివో నిత్యనివాస మఖిల మునులకు*
*అదె చూడుడదె మ్రొక్కు డానందమయము ||*
*తాళ్ళపాక అన్నమాచార్యుడు-2*
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
*తిరుమల కొండపై అన్నమయ్య*
మోకాళ్ళపర్వతాన్ని వడివడిగా ఎక్కుతూ, మధ్యదారిలో ఉన్న *"త్రోవభాష్యకార్ల సన్నిధి"* లో భగవద్రామానుజుల వారిని సేవించుకుని, తనను అనుసరిస్తున్న భక్తబృందంతో పాటుగా శేషాచల శిఖరాన్ని చేరుకున్నాడు. ముందుగా స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరిస్తూ -
*సకల గంగాది తీర్థస్నాన ఫలములివి*
*స్వామి పుష్కరిణి జలమె నాకు...*
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి