🙏ప్రపంచ భాషలలో సంస్కృత భాష స్థానం 🙏
మూడవ భాగము
ప్రపంచములో ఏభాషయు సాధింపజాలని యొక విశేషమును సంస్కృతము సాధించినదని శ్రీ వివేకానంద స్వామి నుడివియున్నారు. ఏభాషలోనైనను కావ్యము రసవంతమై రమ్యముగానున్నచో అందు ధర్మబోధ తక్కువగా నుండును. ధర్మబోధ యెక్కువగానున్నచో రమ్యత తక్కువగానుండును. రమ్యతయు, ధర్మ్యతయు కలియుట మేలనియు, కాని అట్టి కలయిక కన్పట్టుటలేదనియు అరిస్టాటిల్ మున్నగు ప్రాచీనవిమర్శకులు పరితపించారు. పాశ్చాత్య నాటకకర్తలలో మేటియైన షేక్స్పియరులోకూడ ధర్మబోధ ప్రయత్నము తక్కువయనియు, షేక్స్పియరు లోకమునకు సందేశమునిచ్చు దృష్టితో నాటకములను వ్రాయనేలేదనియు విమర్శకులు చెప్పుచున్నారు. రమ్యతను, ధర్మ్యతను అత్యున్నత పథములో సమముగా సాధించిన గ్రంథము వాల్మీకి రామాయణము మాత్రమే. ఈ యంశమును స్వామి వివేకానందుడు అమెరికనులకు తెలుపుచు ఇట్లు పలికెను.
“Nowhere else are the aesthetic and the didactic so harmoniously blended as in the Ramayana”.
ఈ విషయములో రామాయణమునే వరవడిగా నుంచుకొని సంస్కృతకావ్య నాటకాదులు బయలుదేరినవనుట స్పష్టము. ఆలంకారికులుకూడ ఈలక్ష్యమునే ఆదేశించారు. ప్రతాపరుద్ర యశోభూషణములో విద్యానాథడు రచించిన "యద్వేదాత్ప్రభుసమ్మితాదధిగతం” ఇత్యాది శ్లోకసందర్భమును పరికింపదగును.
పాఠకుని హృదయము ఆనందసముద్రములో ఓలలాడుటతో బాటు, ధర్మసౌధశిఖరమును సోపానక్రమముచే అధిరోహించుట రామాయణ పఠనసమయములోనేకాక కాళిదాసాది ఇతర సంస్కృతకవుల గ్రంథములను పఠించు సమయములో కూడా అనుభవగోచరము.
అట్టి గ్రంథములే యింతకాలము భారతీయులను సత్వగుణ ప్రధానులనుగ చేసి, వారికి ప్రపంచములో నొక విశిష్టతను చేకూర్చినవి. ఆధునిక కాలములో (సైన్సు) విజ్ఞానము పర్వతరాశివలె పెరిగిపోయింది. దానిప్రక్కను భారతీయ సంస్కృతియను మరొకపర్వతమున్నది. ఈ సంస్కృతిచే పరిమళింప చేయబడని ఆధునికవిజ్ఞానమును మనముపయోగించుకొందుమేని అది యిప్పటిరీతిగానే ప్రపంచమునకు శాంతి ప్రదానశక్తిలేక, కల్లోలస్ధితికే కారణమగుచుండును. ఈరెండు పర్వతములను కలుపగల వంతెనయే సంస్కృతభాష. భారతరామాయణగాధలు, బోధలును, కాళిదాసాదికవుల గ్రంథములలోని మధురసందేశమును, భర్తృహరి సుభాషితాది హృదయంగమోపదేశములును నేటి విజ్ఞానపర్వతమునకును, భారతీయజీవిత పథమను సంస్కృతికిని సేతుబంధముగా పనిచేయగల్గి ఆధునికనాగరికతలో నూతనయుగము నావిర్భవింపచేయ గలవు. ఇట్టి సేతువును నిర్మింపవలసిన యావశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదుగారు 1952 వ సంవత్సరములో కాశీలోజరిగిన సంస్కృత విశ్వపరిషదధివేశమునకు అధ్యక్షతను వహించుచు, స్పష్టపరిచి యున్నారు.
నైతికముగాను, ధార్మికముగాను సంస్కృతము మానవులకు గల్గింపగల యభ్యున్నతి నిరుపమానమైనది. ప్రపంచములో నెక్కడెక్కడ సంస్కృతము ప్రాకినదో, అక్కడక్కడ మానవహృదయమునకు మృదుత్వమేర్పడినదని రవీంద్రనాధటాగోరువంటి విశ్వమానవ సమదృష్టిగల విశ్వకవికూడ నుడివియుండుట గమనింపదగిన విషయము. భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క ప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా సంస్కృతభాషాద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్ని శతాబ్దములపాటు సంస్కృతము యూరపియనులకు అందలేదు.” (11-2-53 తేదీని కాశీలో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము).
ఇటీవల యూరపియనులు వాణిజ్యాదులకొరకు భారతదేశానికి వచ్చుటయు, సంస్కృతమును నేర్చుకొనుటయు, సంస్కృతసాహిత్యగ్రంథములనేకాక శాస్త్రములనుకూడ తమతమ భాషలలోనికి పరివర్తింపచేసికొనుటయు సంభవించెను. 18 వ శతాబ్దిలో ప్రారంభమైన యీ సంస్కృత సంస్కృతి ప్రసారము పాశ్చాత్యభాషలపైననూ, విజ్ఞానముపైనను అపారప్రభావమును చూపెను. సంస్కృతభాషను నేర్వనివారిపైకూడ ఈ ప్రభావము పడెను. . ఐరోపాలో 15 వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు విజ్ఞానపునర్విజృంభణమునకు తరువాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నిటిలోను గొప్పది సంస్కృత సంపర్కమువలన జరిగిన వైజ్ఞానికసంచలనమే యని ఎ. ఎ. మాక్డోనెల్ తన Sanskrit Literature అను గ్రంథములో వ్రాసియున్నాడు.
ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగ నిబద్ధమగుటలో విశేషముగ తోడ్పడినది సంస్కృతభాష. రాజకీయ శాస్త్రములో జాతీయతకు (Nationhood) కావలసినవిగ చెప్పబడిన యంశములలో భాషైక్యమొకటి. ప్రాచీనభరతఖండములో ప్రాంతీయభాషలుండినను వివిధప్రాంతముల నడుమ సామాన్యభాషగా నుండినది సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికిని గలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్నప్రాంతముల వారు సమావేశమైనప్పుడుకూడ వారు పరస్పరము అవగాహనము చేసికొనవలయునన్నచో వారివారి భాషలలో సామాన్యముగనుండు సంస్కృత పదజాలమే సహాయము చేయును. ఒక యాంధ్రుడును బీహారు ప్రాంతవాసియు నొకచోట కలిసినప్పుడు ఆంధ్రుడు బీహారీని "మీ నివాస మెక్కడ?” అని తెలుగులో అడిగినను అతని కర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోను సమానమే. 'భోజనము', 'శ్రమ', 'దానము' మున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోను ఉండును. కావున భాషా భేదమున్నను, భారతీయు లెల్లరు సంస్కృతపద సూత్రబద్ధులై భాషైక్యముగూడ పొందియున్నారు.
సంస్కృతభాషవలెనే తద్భాషా నిబద్ధమైయున్న విజ్ఞానముకూడ భారతదేశమున కైక్యమును సాధించింది. రామాయణము, మహాభారతము, భర్తృహరి సుభాషితములు మున్నగునవి భారతదేశములోని ఏప్రాంతమువారికైను సమాన పరిచితములే; వానినిచూచి యుప్పొంగని భారతీయుడు లేడు. సంస్కృతభాషను కాళిదాసాదివిరచితశ్లోకములద్వారమున నేర్పు సంప్రదాయమొకటి మన దేశములో నున్నది. దీనివలన సంస్కృతము, సంస్కృతి కూడా ఒకేసారి బాలబాలికల హృదయములో ప్రవేశించు సదవకాశము కల్గును. జీవితకాలమంతయు జ్ఞప్తియందుంచుకొనవలసిన రసవంతములైన శ్లోకములద్వారా భాష నేర్చుకొనుటవలన యువకులు వానిని కంఠస్థముచేయుటయు, జీర్ణించుకొనుటయు సంభవించును. నేటి పాఠ్యపుస్తకములద్వారా సంస్కృతము నేర్చుకొనుచో నీ ప్రయోజనము బోవును. మహాకవుల గ్రంథములు బాలురకు బోధపడునాయనుశంకకు అవకాశము లేదు. ప్రపంచములో ఏభాషకును లేని విశేషమొకటి సంస్కృతభాషకు ఉంది. ఈభాషలో మహోన్నతకవులే మహాసులభకవులు. వాల్మీకి, కాళిదాసు లెంతగొప్పవారో అంత సులభులు. కావున ఈ విషయమున సంస్కృతభాష మరొక భాషతో పోల్చదగినదికాదు.
"సంస్కృతభాషయు, తన్నిబద్ధవిషయములును భారతదేశమునకు పరంపరాగతములైన పెన్నిధానములు. ఇవి భారతీయులకు పూర్వులనుండి వారసత్వముగా సంక్రమించిన మహోత్కృష్టభాగ్యరాశిగా చెప్పదగినవి. ఇవి భారతదేశములో నిలచియున్తకాలము ఈదేశమునకు మూలభూతమైన ప్రతిభ జీవించియుండును” ఇది భారతప్రధాని నెహ్రూ, సంస్కృతభాషావాఙ్మయములనుగురించి వెలుబుచ్చిన అమూల్యాభిప్రాయము.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి