11, జనవరి 2025, శనివారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(17వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️  

*రసాతలంలో మునిగి ఉన్న భూమండలాన్ని యజ్ఞవరాహా రూపంలో తన కోరల కొనలతో ఎత్తసాగాడు విష్ణుమూర్తి.  తన శక్తియుక్తులన్నీ అందుకు ధారపోయసాగాడు. ఆ సమయంలో హిరాణ్యాక్షుడు వచ్చాడక్కడకి. వస్తూనే విష్ణుమూర్తిని యుద్ధానికి రమ్మన్నాడు. పట్టించుకోకపోతే కవ్వించాడతన్ని. ఆ కవ్వింపుకి కోపం వచ్చింది విష్ణుమూర్తికి. హిరణ్యాక్షుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరూ ప్రళయ భీకరంగా యుద్ధం చేయసాగారు. బ్రహ్మాది దేవతలూ, మునులూ దగ్గరుండి ఆ యుద్ధాన్ని చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఆ భయంలోనే హిరణ్యాక్షుని త్వరగా సంహరించి, లోకాల్ని కాపాడమని విష్ణుమూర్తిని వేడుకున్నారంతా. వినవచ్చిన వేడుకోలుకి ‘సరే’నన్నట్టుగా తలూపాడు విష్ణుమూర్తి.*


*రాక్షసమాయతో యుద్ధం చేస్తున్న హిరణ్యాక్షుణ్ణి మరింత గట్టిగా ఎదుర్కొన్నాడప్పుడు.*


*‘దేవాదిదేవా! ఆలస్యం చెయ్యకు. చీకటి చిచ్చు రగలకముందే, రాత్రి కాకుండానే ఆ రాక్షసుణ్ణి అంతమొందించు.’’ ప్రార్థించారు మునులు. ఆ ప్రార్థనను ఆలకించిన మరుక్షణంలోనే విష్ణుమూర్తి చక్రాయుధాన్ని ధరించాడు. వాయువు మేఘాలను చెదరిగొట్టినంత సులభంగా చక్రాయుధంతో రాక్షసమాయను ఛేదించాడు. హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. హిరణ్యాక్షుడు నేలకొరగడంతో బ్రహ్మాది దేవతలూ, మునులూ హరిని వేదసూక్తాలతో అనేక విధాల స్తోత్రం చేశారు. దేవదుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. లోకాలన్నీ శాంతించాయి. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన విష్ణుమూర్తి, భూమండలాన్ని రక్షించి, వరాహ అవతారాన్ని చాలించాడు. వైకుంఠానికి వెళ్ళిపోయాడు.*


*కపిలుడు:~*


*బ్రహ్మ సృష్టించిన ప్రజాపతులలో కర్దముడు ఒకడు. సరస్వతి నదీతీరం అతని నివాసం. పదివేల సంవత్సరాలు ఘోరమయిన తపస్సు చేసి, శ్రీహరి అనుగ్రహాన్ని సంపాదించాడతను. తన కుమార్తె దేవహూతిని కర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు స్వాయంభువ మనువు.*


*కర్దముడికీ, దేవహూతికీ తొమ్మిది మంది కుమార్తెలూ, ఒక కుమారుడూ జన్మించారు. ఆ కుమారుడే కపిలుడు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశతో జన్మించాడతను. తన తొమ్మిది మంది కుమార్తెలనూ మరీచ్యాది మహామునులకు ఇచ్చి పెళ్ళి చేశాడు కర్దముడు.*


*కళను మరీచికీ, అనసూయను అత్రికీ, శ్రద్ధను అంగీరసునికీ, హవిర్భూవును పులస్త్యునికీ, గతిని పులహునికీ, క్రియను క్రతువుకీ, ఖ్యాతిని భృగుమహర్షికీ, అరుంధతిని వసిష్ఠమహర్షికీ, శాంతిని అధర్వణునికీ ఇచ్చాడు.*


*సాక్షాత్తూ భగవంతుడే తనకు కుమారునిగా జన్మించినందుకు కర్దముడు ఎంతగానో ఆనందించాడు. ఆఖరికి సంసారబంధాలు తెంచుకుని, మూక్తిమార్గం అనుసరించాడు. ఆ దశలో తల్లి దేవహూతికి కపిలుడే ముక్తిమార్గం బోధించాడు. మూక్తిమార్గాన్నే కాదు, ఆత్మస్వరూపాన్ని తెలియజేసి, పిండోత్పత్తిక్రమం, జీవికి కలిగే ప్రకృతి బంధాలులాంటి పరమ రహస్యాలెన్నో తెలియజేశాడు. భక్తిమార్గాన్ని కూడా ఉపదేశించించాడు. మహాయోగులకు కూడా అందని అద్భుత జ్ఞానాన్ని తల్లికి బోధించి, ఈశాన్యదిశగా ప్రయాణించాడు కపిలుడు. ప్రయాణించి ప్రయాణించి, అందరూ పరమపవిత్రంగా భావించే సముద్రుడిచ్చిన స్థలంలో నివాసం ఏర్పరుచుకుని, అక్కడే యోగం అవలంబించాడు. సాంఖ్యతత్త్వాన్ని ప్రతిపాదించాడు.*


*కపిలుడు ఉపదేశాన్ని అనుసరించి తపోయోగంతో భగవంతుణ్ణి చేరుకుంది దేవహూతి. కొడుకు కపిలుని జ్ఞానోపదేశం పొంది, దేవహూతి సిద్ధి చెందిన ప్రదేశానికి ‘సిద్ధాశ్రమం’ అని పేరు. పుణ్యస్థలి అని ముల్లోకాలూ ఈ ఆశ్రమాన్ని పేర్కొంటున్నాయి. కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యతత్త్వాన్ని ఆసురి, పంచశిఖుడూ మొదలయిన వారంతా తర్వాతి కాలంలో ప్రచారం చేస్తూ వచ్చారు.*


*దక్షయజ్ఞం:~*


*పరమేష్ఠి సృష్ఠించిన ప్రజాపతులంతా సంతానాన్ని వృద్ధి చేస్తూ వచ్చారు. వీరిలో దక్షుడు ముఖ్యుడు.*


*స్వాయంభువ మనువుకీ, శతరూపకీ ముగ్గురు కుమార్తెలు. వారిలో దేవహూతి, కర్దముని భార్య. ఇక ఆకూతి, రుచి భార్య. ఆకూతికీ రుచికీ విష్ణుమూర్తి యజ్ఞుడు పేరిట కుమారుడిగా జన్మిస్తే, లక్ష్మి దక్షిణ పేరిట కుమార్తెగా జన్మించింది. స్వాయంభువ మనుమడు క్రతువు, దక్షిణను పెళ్ళాడాడు. వారికి లెక్కకు మిక్కిలిగా సంతానం కలిగింది. వారంతా భగవద్భక్తులై లోకధర్మానికి అనుగుణంగా రాజ్యాలు ఏలారు. స్వాయంభువ మనువు మూడవ కుమార్తె ప్రసూతి దక్షప్రజాపతికి భార్య. వారికి కలిగిన సంతానంతో మూడులోకాలూ నిండిపోయాయి.*


*అనసూయను పెళ్ళాడిన అత్రి మహాముని బ్రహ్మదేవుని ఆదేశానుసారం ఋక్షమనేకుల పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ వాయుభక్షణ చేస్తూ నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు ముగ్గురూ ప్రత్యక్షమయ్యారు. తమ అంశలతో ముగ్గురు పుత్రులు జన్మిస్తారని వరాన్ని ప్రసాదించారు. ఆ వరప్రసాదంతో అత్రి అనసూయలకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రుని అంశతో దుర్వాసుడు జన్మించారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: