*తిరుమల సర్వస్వం -107*
*ఆనందనిలయ విమానం 1*
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బంగారుమేడపై ప్రతిష్ఠితమైన *"ఆనందనిలయ విమానం"* లేదా *"గోపురం"* ప్రదక్షిణమార్గంలో ఏ మూలనుంచైనా, చాలా దగ్గరగా, చక్కగా దర్శనమిస్తుంది. సరిగ్గా దీని క్రిందనే ఉన్న గర్భాలయంలో మూలమూర్తి కొలువై వుంటారు. ఆనందనిలయం ఉపరితలభాగంలో ఉండటంవల్ల దీనిని *"ఆనందనిలయ విమానం"* అని కూడా పిలుస్తారు.
పురాణకాలంలో దీన్ని వాహనంగా చేసుకుని శ్రీహరి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చినట్లు, మొట్టమొదటగా, శ్రీమహావిష్ణువు ఆదేశం మేరకు గరుత్మంతుడు విష్ణుమూర్తితో సహా ఈ విమానాన్ని వైకుంఠం నుంచి తెచ్చి వేంకటాచలక్షేత్రంలో ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో చెప్పబడింది. అయితే, అత్యుత్తమ భక్తులకు మాత్రమే దివ్యవిమాన దర్శనభాగ్యం కలుగుతుంది. మనలాంటి సామాన్యు లందరికీ, ఆ దివ్యవిమానం స్థానంలో, ఈ బంగారుగోపురం యొక్క భౌతిక స్వరూపమే గోచరిస్తుంది. ఈ గోపురాన్ని శ్రీనివాసుని ఆనతిపై తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు. దర్శనమాత్రం తోనే కోరిన కోర్కెలు సిద్ధించే ఈ గోపురాన్ని ఉద్దేశ్యించే అన్నమయ్య, తిరుమలను *"బంగారు శిఖరాలు బహు బ్రహ్మమయము"* అని వర్ణించాడు.
మూడంతస్తుల గోపురంలో, కింది రెండంతస్తులు దీర్ఘ చతురస్రాకారంలోను, మూడవ అంతస్తు వర్తులాకారం లోనూ నిర్మింపబడ్డాయి. పది అడుగుల ఎత్తైన మొదటి అంతస్తులో లతలు, తీగలు, చిన్నచిన్న శిఖరాలు, మకర తోరణాలు చెక్కబడి ఉన్నాయి. పదకొండు అడుగుల ఎత్తున్న రెండవ అంతస్తులో మకరతోరణాలతో పాటుగా - విష్ణుమూర్తి, వరాహస్వామి, నరశింహస్వామి, జయవిజయులు, గరుడుడు, అనంతుడు, విష్వక్సేనుడు, సప్తఋషులు, ఆంజనేయుడు, విమాన వేంకటేశ్వరుడు - లాంటి 40 శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. పదహారు అడుగుల మూడవ అంతస్తులో - మహాపద్మం, నాలుగు మూలలలో సింహాలు, చిలుకలు, లతలు, హంసలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ అద్భుతమైన ప్రతిమలన్నీ బంగారు తాపడంతో పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల, ఎంతో శ్రద్ధగా, నిశితంగా పరిశీలిస్తే గానీ వీటి అందచందాలను ఆస్వాదించలేము. దర్శనానంతరం ఏ విధమైన ఆంక్షలూ లేకుండా ఈ గోపురాన్ని తనివితీరా కాంచవచ్చు. ఈసారి తిరుమల యాత్రలో ఆనందనిలయ వీక్షణానికి తగినంత సమయం కేటాయించండి.
బయట నుండి లోనికి వచ్చే ఉత్సవాలు, లేదా బయటకు వెళ్ళే ఉత్సవాలు, ఆనందనిలయ విమాన ప్రదక్షిణ చేసిన తర్వాతనే లోనికి రావడం గాని, బయటకు వెళ్ళడం గానీ జరుగుతుంది. తిరుమలకొండ మీద ఈ ఒక్క విమానమే ఉండాలనే కట్టడి ఉంది. సప్తగిరులపై మరే మానవనిర్మిత విమానం కానీ, హెలికాప్టర్ గాని అనుమతించ బడదు. దేశాధినేతలైనా సరే, తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల ద్వారా లేదా రోడ్డు మార్గంలో రావాల్సిందే!
ఆధారాలు లభించినంత వరకు, మొట్టమొదటగా 839వ సంవత్సరంలో పల్లవరాజైన విజయ దంతి విక్రమవవర్మ, తరువాత 1262 లో జాతవర్మ సుందరపాండ్యుడు, 1518 లో శ్రీకృష్ణదేవరాయలు, 1630 లో కంచి వాస్తవ్యుడైన 'కోటికన్యాదానం తాతాచార్యులు' అనబడే వైష్ణవభక్తుడు, 1908లో బావాజీమఠం వారు, 1958 లో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఈ గోపుర బంగారుకవచాన్ని తిరిగి నిర్మించారు. 1359వ సంవత్సరంలో సాళువ మంగిదేవ మహారాజు పాత బంగారు కలశం స్థానంలో కొత్త దానిని ప్రతిష్ఠించారు.
1958వ సంవత్సరంలో జరిగిన ఆనందనిలయవిమాన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో, విమానం మీదున్నటువంటి పాతరేకులపై ఉన్న బంగారాన్ని, హుండీ ద్వారా భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని, రసాయన ప్రక్రియ ద్వారా శుద్ధి చేసే కార్యక్రమాన్ని మహారాష్ట్రకు చెందిన శ్రీరామ్ నాథ్ షిండే గారు చేపట్టి, మేలిమి బంగారాన్ని వెలికి తీశారు. తమిళనాడుకు చెందిన చొక్కలింగాచారి అనే స్థపతి, విమానానికి కావలసిన రాగిరేకులను తయారు చేశారు. ఈ రేకులకు తమిళనాడులోని మరో భక్తుడు రాజగోపాలస్వామి రాజు గారు బంగారు తాపడం చేశారు. దీని తయారీకి పన్నెండు టన్నుల రాగి, పన్నెండువేల తులాల బంగారం వినియోగించబడింది.
మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు కాగా, అందులో పాతబంగారం విలువ ఎనిమిది లక్షలు. మిగిలిన బంగారం అంతా హుండీ ద్వారా సేకరించబడింది. మొత్తం ఐదు సంవత్సరాలు పట్టిన ఈ కార్యక్రమంలో, మూడు సంవత్సరాలు రాగిరేకుల తయారీకి, మరో రెండు సంవత్సరాలు బంగారు తాపడానికి పట్టింది.
[ రేపటి భాగంలో.. *విమాన వేంకటేశ్వరుడు, సంకీర్తనాభండారం, శ్రీవారిహుండీ* ఇత్యాదుల గురించి తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి