శ్రీ దత్త ప్రసాదం - 20 – సమాజ హితానికి సంపూర్ణ సహకారం అందించే శ్రీ దత్తాత్రేయ స్వామి
శ్రీ స్వామివారి మందిర నిర్వహణా బాధ్యత అంత సులభమైనది కాదని నాకు అతి కొద్దిరోజుల్లోనే తెలిసి వచ్చింది..ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది..శ్రీ స్వామివారి మందిరం దర్శించే భక్తులకు సౌకర్యాలు అసలు లేవు..ప్రతి శనివారం నాడు సుమారు మూడు నాలుగు వందల మంది శ్రీ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలని ..అలా చేస్తే తమకు మంచి జరుగుతుందనే విశ్వాసం తో వస్తున్నారు..వృద్ధులూ.. పసిబిడ్డల తల్లులూ..ఇలా అన్ని రకాల వ్యక్తులూ ఆ వచ్చిన వారిలో వుంటున్నారు..వాళ్లకు వాళ్లే అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు..ప్రాంగణం బైట వీధి దీపాల లాటివి కూడా లేవు..ఆ చీకట్లోనే బావుల వద్దకు వెళ్లి స్నానాలు చేయడం..ఇతరత్రా కాలకృత్యాలు తీర్చుకోవడం జరుగుతోంది..
ఈ పరిస్థితులు చూసిన నాకు తపన మొదలైంది..ముందుగా మందిరం చుట్టూరా వీధి దీపాలు లాంటివి ఏర్పాటు చేయాలి ..చీకట్లో ఆ భక్తుల అవస్థ వర్ణనాతీతంగా ఉంది..ఏదో ఒక రకంగా భక్తులు పడుతున్న ఇబ్బందిలో కొద్దిపాటి దానినైనా తొలగించే ప్రయత్నం చేయాలని సంకల్పించాను..ఏ పని తలపెట్టాలన్నా ఆర్ధికంగా అండ కావాలి..ఎలా?..దాతల సహకారం కోరాలంటే..నేను బిడియం తగ్గించుకొని..వాళ్ళను అడగాలి..ఏదో ఒక రకంగా ముందుకు సాగాలంటే..తప్పనిసరిగా దాతలను వెతకిపట్టుకొని..పనులు మొదలుపెట్టాలి..మానసికంగా నేను అందుకు సిద్ధం అవ్వాలని నిర్ణయించుకున్నాను..
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం లో పనిచేసే అందరితో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని.."ఇక్కడికి దర్శనార్థం వచ్చే భక్తులకు మనం సౌకర్యాలు కల్పిస్తే..మరింత ఎక్కువ మంది వస్తారు..మీరూ మీవంతుగా సహకరించండి..మనమందరమూ సమిష్టిగా పని చేద్దాం.." అన్నాను..సంతోషంగా ఒప్పుకున్నారు..
"అయ్యా!..ఇక్కడికి తరచూ వచ్చి వెళ్లే భక్తుల గురించి మాకు తెలుసు..దేవాలయానికి అభివృద్ధికి సహకరించమని వాళ్ళను మేము అడుగుతాము..కొద్దిమంది స్పందించినా మనం పనులు మొదలు పెట్టవచ్చు....మా వంతు కృషి చేస్తామని" అందరూ ముక్త కంఠంతో అన్నారు..వాళ్ళు అలా చెప్పడం తో కొంత బరువు తగ్గినట్లు అనిపించింది..
ఆ ప్రక్కరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారి ప్రభాత హారతులు పూర్తికాగానే..నేనూ నా భార్యా ఇద్దరమూ శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని.."స్వామీ..సౌకర్యాల గురించి తపన పడుతున్నాము..మా వంతు ప్రయత్నం మేము త్రికరణ శుద్ధిగా చేస్తాము..నీ ఆశీర్వాదం కూడా అందజేయి తండ్రీ!..నీ సహకారం లేకుండా ఈ క్షేత్ర అభివృద్ధి మా వల్ల కాదు..చేయలేము కూడా..సర్వం నీదే భారం నాయనా.." అని శరణాగతి చెందాము..
శ్రీ స్వామివారి సమాధి వద్ద ఆ విధంగా ప్రార్ధన చేసుకొని..ఇవతలికి వచ్చి మంటపంలో కూర్చున్నాము..మొగలిచెర్ల గ్రామ సర్పంచ్ గారు గుడిలోకి వచ్చారు..మర్యాదపూర్వకంగా ఆహ్వానించాను..నేరుగా శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..విగ్రహం వద్ద హారతి తీసుకొని..నాదగ్గరకు వచ్చి.."నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను ప్రసాదూ.." అన్నారు..ఏమిటో చెప్పమని అడిగాను.."మన పంచాయితీకి సోలార్ వీధి లైట్లు సాంక్షన్ అయ్యాయి..మొదటి విడతగా ఇరవై లైట్లు కేటాయించారు..అధికారులు నాకు చెప్పగానే..నువ్వు గుర్తుకొచ్చావు..శ్రీ స్వామివారి మందిరం దగ్గర పది లైట్లు ఏర్పాటు చేస్తే..శనివారం నాడు వచ్చే భక్తులకు చీకట్లో ఉండాల్సిన బాధ తప్పుతుంది గదా..అని అనిపించింది..నువ్వు ఒప్పుకుంటే..దేవస్థానం దగ్గర పది లైట్లు పెట్టించే ఏర్పాటు చేస్తాను..ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తున్నది..బాగా తక్కువ ధరకే వస్తున్నాయి..పంచాయితీ తరఫున పెట్టిస్తాను.." అన్నారు..నావరకూ నాకు సాక్షాత్తూ ఆ స్వామివారే..నేను మనసులో అనుకున్న కోరికకు సమాధానం ఇస్తున్నట్లు అనిపించింది..
స్వార్ధానికి కాకుండా సమాజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని కోరిక కోరుకుంటే..దైవం కూడా క్షణాల్లో స్పందిస్తాడని నాకా నిమిషంలో తెలిసి వచ్చింది..ప్రస్తుతం శ్రీ స్వామివారి మందిరం వద్ద భక్తులు చీకట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం తప్పింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్
(
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి