*కాలమే దైవం*
నిన్న, నేడు, రేపు మనకోసమే ఏర్పడ్డాయి. శుద్ధ చైతన్య స్వరూపుడైన భగవంతునికి ఈ కాలభేదాలు వర్తించవు. ఆయనకు చరిత్ర, భవిష్యత్తు వేరుగా లేవు. నిత్యవర్తమానంలో ఆయన కంటున్న సుదీర్ఘ స్వప్నమే ఈ సృష్టి. కాలమే లేని స్థితినుంచి మార్పుభావనను కలిగించే కాలస్వరూపాన్ని ధరించేవాడు భగవంతుడే. జీవులందరి లోపల ఆత్మరూపంలోనూ, బయట కాలరూపంలోనూ ఉంటాడు. క్షణం నుంచి క్షణం మారేలోపుగా ఆలోచనలో మార్పుండదు. నిశ్శబ్దస్థితి మాత్రమే ఉంటుంది. ఆ స్థితినే మరికొన్ని క్షణాలు కొనసాగించడం సాధన చేసిన మానవుడు చైతన్యుడవుతాడు. కాలస్వరూప భగవానుని దర్శిస్తాడు.
ఒక నదీ మూలానికి వెళ్లి చూస్తే, అక్కడ చుక్కలు చుక్కలుగానే నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ చుక్కలన్నీ కలిసి అక్కణ్ణించి కొద్దిదూరం వెళ్లాక పెద్ద ప్రవాహమైపోతుంది. అలాంటిదే కాలనది కూడా. మూలానికి పోయి చూస్తే అసలు కాలమే ఉండదు. రెప్పపాటూ క్షణాలూ సెకనూ నిముషాలూ గంటలూ అనే చిన్నా పెద్దా కాలపు చుక్కలు కలిసి రోజులవుతాయి. రోజులు కలిసి ఏళ్లు అవుతాయి. సంవత్సరాలన్నీ ఒకేలా ఉంటాయి. నిరుడూ ఈ ఏడాదీ రాబోయే ఏడాదీ అని మనం చెప్పుకోడానికే గానీ నిజానికి వాటిలో ఏ మార్పూ లేదు. అలాగే రోజులన్నీ ఒకేలా ఉంటాయి. నిన్నా ఇవాళా రేపూ అని వింగడించి చెప్పుకోవడమే గానీ వాటిలో ఏ తేడా లేదు.
ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు. క్రమంగా ఆకాశ మధ్యానికి ఎక్కుతాడు. చివరికి అస్తమిస్తాడు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా భూమి మీదున్న మనకు సూర్యుడే కదులుతూన్నట్టనిపిస్తాడు. దీనికి కారణం సాపేక్షకత. రైల్లో కూర్చొని వెళ్తూంటే, అవతల కదలకుండా ఉన్న చెట్లూ చేమలూ ఎలక్ట్రిక్ స్తంభాలూ మనం వెళ్లే దిశతో పోలిస్తే వెనక్కు వెళ్తూన్నట్టు అవుపిస్తాయి.
భూమి తనచుటూ తాను తిరుగుతూ ఉండడం వల్ల రాత్రీ పగలూ అనే తేడాలు వస్తున్నాయి. నిజానికి ఎప్పుడూ వెలిగే సూర్యుడిలో రాత్రింబగళ్లు ఎలా ఉంటాయి? ఉండనే ఉండవు. అంటే ఏ మార్పూలేని సూర్యుడిలో సృష్టికి మారుపేరైన గమనం కారణంగా రాత్రింబవళ్లనే మార్పుభావాన్ని మనం చూస్తున్నామన్న మాట.
మార్పులేని ఏకైక చైతన్యంలో 'సృష్టికి ముందూ, సృష్టిలో, సృష్టికి తరవాతా అని విడదీస్తూ మార్పుభావనను తెచ్చే దాన్నే కాలం అంటాం. ఎప్పుడూ మార్పులేని ఏకైక చైతన్యమనే మూలంలో ఈ మార్పుభావమనే కాలమే లేదు. దీన్ని మరోలాగ కూడా చెబుతారు. కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి కాలమంటే ఏమిటో వివరిస్తూ ఇలా అంటాడు:
ప్రకృతేర్గుణ సామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టా యతః స భగవాన్ కాల ఇత్యుపలక్షితః అంతః పురుషరూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేత్యేష సత్త్వానాం భగవానాత్మ మాయయా
(భాగవతం 3-26-17,18 శ్లోకాలు)
ప్రకృతిలో సత్త్వమూ రజస్సు తమస్సు అనే మూడుగుణాలూ సృష్టికి మొదట్లో సరిసమానంగా ఉంటాయి. ఆ సామాన్యమైన ప్రకృతిలో చేష్టను అంటే, జీవాన్ని సూచించే కదలికనూ, గుణాల మిశ్రమాన్నీ పుట్టించే దాన్నే కాలశక్తి అంటారు. అంటే లేనప్పుడు కాలమే లేదన్న మాట.
భగవంతుడే తన మాయ అంటే, ప్రజ్ఞద్వారా జీవరూపంలో లోపలా, కాలరూపంలో బయటా ఉన్నాడు. చైతన్యరూపుడైన భగవంతుడు లోపల ఆత్మరూపేణా స్థిరంగా ఉంటాడు. బయట కాలరూపేణా కదలికగా ఉంటాడు. మార్పు భావమే కాలం. ఆ మార్పుకు పర్యవసానం వేరుతనానికి అవకాశాన్ని కలిగించటం. అలా వేరుతనానికి అవకాశాన్నిచ్చేదాన్నే ఆకాశమని అంటాం. దేశమూ వేరువేరు
నిజానికి కాలమూ భావాలేమీ కావు. మనిషి పుట్టించుకొన్న దిక్కూ కాలమూ అనే ఈ భేదాలు మాయ పుట్టించే సాపేక్షకత వల్లనే వచ్చాయి. మార్పూ ఖండితత్వమూ లేని చైతన్య మనే నిత్య వర్తమానంలో సృష్టి అనే కదలిక వల్ల జరుగుతున్న మార్పుల వరసకే మనం కాలమూ (అప్పుడూ, ఇప్పుడూ). దిశా (అక్కడా, ఇక్కడా) అని పేర్లు పెట్టుకొన్నాం.
*🚩 ┈┉┅━❀꧁ॐ 🙏 ॐ꧂❀━┅┉┈ 🚩*
_ఆధ్యాత్మికం ఆనందం_
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి