*తిరుప్పావై 19వ రోజు పాశురం*
🕉🌞🌏🌙🌟🔥
🔥🕉🌞🌏🌙🌟
*19.పాశురము*
*ॐॐॐॐॐॐॐॐ*
*కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్*
*మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి,*
*కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్*
*వైత్తుక్కి డన్దమలర్* *మార్ పా! వాయ్ తిఱవాయ్*
*మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై*
*ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్*
*ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్*
*తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్!!*
*భావం*
*ॐॐॐॐॐॐॐ*
గుత్తి దీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచముపై ఉన్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు - వెడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు .... తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీళాదేవి యొక్క, స్తనములపై తన శరీరమును ఆనుకొని పరుండి, విశాలమైన కన్నులుగల ఓ నీళాదేవీ ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు ? ఇంతమాత్రపు ఎడబాటుకూడా ఓర్వలేకుండుట నీ స్వరూపమునకు తగదు.
గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించి యుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా?
లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింప కున్నావు!
క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెము ఆవకాశమీయము తల్లీ!
అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.
*అవతారిక*
*ॐॐॐॐॐॐॐॐ*
గోపికలు క్రిందటి పాశురములో నీళాదేవిని మేలుకొలిపి, ఈ పాశురమున శ్రీకృష్ణుని, నీళాదేవిని కూడా మేలుకొన వలసిందిగా అర్థించుచున్నారు. పరమాత్మని ఆశ్రయించునపుడు అమ్మవారిని ఆశ్రయించి చేరవలెను.
ఆశ్రయించిన తరవాత లక్ష్మి - నారాయుణులను ఇద్దరినీ సమానంగా సేవించవలెను. అందుకే గోపికలు ముందు నీళాదేవిని ఒక్కరినే మేలుకొలిపి, ఈ పాశురమున లక్ష్మినారాయణులను మేలుకొలుపుచున్నారు.
తనని గోపికలు
అర్థించిరికదా అని .....నీళాదేవి తలుపులు తెరవబోయింది. ఆమెకు సంబంధించిన వారిపై పరమాత్మ అధికముగా ప్రేమ చూపించును.
కనుక తనే వచ్చి తలుపు తెరవవలెనని నీళాదేవిని వెనుకకు లాగి, మంచముపై పడవైచి, ఆమెపై తాను అదిమిపట్టి పరుండి యుండి, ఆమె స్పర్శ సుఖముచే ఒడలు మరచి తలుపు తెరవక ఊరకుండెను. స్వామిని మేలుకొలిపి, తలుపులు తెరవవలసిందిగా నీళాదేవిని అర్థిస్తున్నారు.
అంత ఆ ఆర్తనాదము విని తలుపు తెరచుటకు స్వామి వెళ్ళుచుండగా --- తలుపులు తెరచుటకు వీలులేదని నీళాదేవి తనకళ్ళతో ప్రతిబంధించినది. అది చూచి గోపికలు "అమ్మా ! ఇది న్యాయము కాదు" అని నీళాదేవిని అర్థించిరి.
స్వామిని కీర్తించటానికి వచ్చామని, తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది.
ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా, మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గరగా కౌగలించి పడకనుంచి లేవనీయక యుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాటాడక యుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.
*కాపిరాగము - ఆదితాళము*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
ప.. తగదిది నీకిది తరుణిరొ వినవే!
జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె!
అ..ప. తగునా? నీ స్వరూప స్వభావమ్ములకు
మగని విశ్లేషమును సహింపజాలవె!
దీప కాంతులెల్లెడళ విరియగా
ఆ పంచగుణముల పడకను శయనించి
సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత
శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె!
ఓ పద్మాక్షీ! విభుని లేపవే!
మనిషికి ఎన్ని శాస్త్రములు భోదించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై.
శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపచేసేది. కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి.
వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటీ అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది.
*"కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాయ మంగళమ్"*
అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం, అమ్మ తన వక్షస్తలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది.
ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు, ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు.
కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా! లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది, కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది.
అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించ దగినది కానీ అనుభవించ దగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది-ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది.
ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి, అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.
నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది, కాని అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని, నేనే తెరుస్తాలే అని ఒక్క సారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్థలం పై వాలిపోయింది. ఆమే స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు.
ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు బయటనుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలాపాడుతున్నారు.
*"కుత్తు విళక్కెరియ"* చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి.
అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరవడం లేదు సరికదా స్వామిని తలుపు తెరువనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు.
గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీళాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. *"కోట్టుక్కాల్"* ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల *"కట్టిల్మేల్"* కట్టె మంచం లో *"మెత్తెన్ఱ"* మెత్తటి అతి సుకుమారమైన, *"పంచ శయనత్తిన్"* పంచశయనంపై *"మేల్ ఏఱి"* పడుకొని ఉన్నారు. *"కొత్తలర్ పూంగురల్"* గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల *"నప్పిన్నై"* ఆ అందగత్తె *"కొంగైమేల్"* వక్షస్థలం *"వైత్తు క్కిడంద" స్పర్శచే మైకంలో పడి ఉన్న *"మలర్ మార్బా!"* వక్షస్థలం వికసించి ఉన్న స్వామీ *"వాయ్ తిఱవాయ్"* నోరైనా తెరువచ్చుకదా.
అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దూ నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు.
*"మైత్తడం కణ్ణినాయ్!"* కాటుకతో విశాలమైన కన్నులు కల *"నీ"* నీవు *"ఉన్-మణాళనై"* నీ స్వామిని *"ఎత్తనై పోదుం తుయిలెర"* ఇప్పటికైనా లేపి *"ఒట్టాయ్ కాణ్"* మాకు చూపించవా, *"ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్"* ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, *"తత్తువమన్ఱు తగవ్"* నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచం కఠినంగా పిలిచారు.
🕉️🌞🌏🌙🌟
*తిరుప్పావై 19వ పాశురము / తెలుగు పద్యానువాదము*
*రచన*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*సీ . పలుకైన పలుకవా బదులు మాటలు నీవు*
*నవ మోహనాకార నళిన నేత్ర*
*పవళించెదవు నీవు పలుకవు రవ్వంత*
*తలగడగా నీవు కలికి నుంచి*
*పంచ తల్పము పైన పాన్పు గా పవళించ*
*దంతపు కోళ్ళతో తళుకుమనగ*
*కర్పూర దీపాల కాంతుల యందున*
*కురులయందున చేరే విరుల తావి*
*ఆ.వె.ఘడియ కాలమైన యెడబాటు లేకుండా*
*నిద్ర యందు నుండు నీరజాక్షి*
*పొగయు కాటుకలును సొగసుతో నిండగా*
*సుగుణవతికి తగదు శోభనాంగి*
*శ్రద్ధ భక్తినిచ్చి బుద్ధిని కలిగించు*
*శ్రీధరుని మనసున స్థిరముకమ్ము!!*
🕉🌞🌎🌙🌟
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి