సావడి కబుర్లు - 3
వారం పది రోజులుగా వాతావరణం దోబూచులాడుతోంది. మార్గశిరం వెళ్లి పుష్యమి వచ్చినా చలి అంతగా వణికించట్లేదు. ఏదో సముద్రంలో అలజడలు ఉంటే తప్ప చల్లగాలులు కూడా పెద్దగా తగలట్లేదు. ఋతువులలో జరగవలసిన మార్పులు సమయంలో జరగట్లేదు. ఏంటో ఈ ప్రకృతి అంతా కాలుష్యం అయిపోయింది. ఇలా మా కబుర్లు సాగుతుంటే అవును అంటూనే మిత్రుడు సంజయ్ మనసబ్దార్ గారు విచారంగా నిట్టూర్చారు. ప్రకృతిలోనే కాదు అన్నిటిలోనూ కాలుష్యమే ముఖ్యంగా మనిషి ఆహార వ్యవస్థ పూర్తిగా మారిపోయింది, కోరికలకు అంతే ఉండట్లేదు అన్నారు.
అవును నిజమే కదా, పురాణాల్లో చెప్పినట్లు కలి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మనిషి ఆహారపు అలవాట్లు, కోరికలు పూర్తిగా మారిపోయాయి. జిహ్వచాపల్యం, కామ చాపల్యం బాగా పెరిగిపోయాయి. ఇక్కడ కామము అంటే రకరకాల కోరికలు అని అర్థం చేసుకోవాలి. నేటి సమాజంలో అనుకున్నది వెంటనే జరగకపోతే క్రోధం పెరిగిపోతోంది. ఆధునిక జీవన సంస్కృతి అనే ఒక బ్రాంతిలో జీవితం అంటే ఎంజాయ్ మరియు ఎంటర్టైన్మెంట్ అనే నేడు ప్రజలు బ్రతికేస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అంటే ఈ నిమిషంలో జీవించడంలో ఉన్న కష్టాన్ని అంగీకరించలేక ప్రతి నిమిషం మరు (తరువాత) నిమిషంలో బతికేస్తున్నారు. దాని వలన కలిగే ఆందోళన నిస్పృహల వలన వారి జీవిత నాణ్యతను కోల్పోతున్నామని గ్రహించలేకపోతున్నారు. అంతేకాదు వారు
ఇంద్రియ నిగ్రహణంపై కూడా పట్టుకోల్పోతున్నారు.
ఆహార విషయానికొస్తే ఏది తిన్నా పర్వాలేదు బ్రతికున్నంత కాలం శుభ్రంగా తినాలి దాచుకుంటామా?, అనుభవించే వయసులోనే అనుభవించాలి అనే వింత వాదన ప్రస్తుతం సమాజంలో చాలా బలంగా ఉంది. పైగా వేదాంతం అడ్డం పెట్టుకుని అన్నమయితే నేమి?, సున్నమైతేనేమి? అంతా ఒకటే అనే మాటలు వింటూనే ఉన్నాం.
ముఖ్యంగా నేటి యువతకి కష్టం విలువ తెలియట్లేదు. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. పిల్లల్ని కష్టం లేకుండా పెంచవచ్చు కానీ కష్టం విలువ తెలియకుండా పెంచుతున్నారు. దానితో స్వయంకృషితో గ్రుడ్డు పగలగొట్టుకుని బయటకు రావలసిన పక్షిపిల్లని ఆ కష్టంపై జాలిగా మనమే గుడ్డు పగలగొట్టి బయటకు తీసి వదిలి దానిని స్వయంకృషికి దూరం చేస్తున్న చందంగా పిల్లల్ని పెంచుతున్నాం. దాని వలన పిల్లలకి తల్లిదండ్రులు కష్టార్జితం యొక్క విలువ తెలియట్లేదు. తమ కోరికలను అనుభవించడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని పిల్లలు గుర్తించేందుకు కూడా అవకాశం ఉండట్లేదు. తల్లిదండ్రులు కూడా కొత్తని ఆస్వాదించాలి అనే భావంతో సమాజంలో జరుగుతున్న ప్రతి మార్పుని పిల్లలకి అందించడంలో పోటీపడి వారికి కోరికలపై నిగ్రహణ లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్చుమీరిన ఆర్థిక స్వాతంత్రం జిహ్వచాపల్యానికి కామచాపల్యానికి కారణం అవుతోంది. వీటి వలన ధర్మాన్ని అతిక్రమించి కూడనివి తీసుకుంటూ అనేక పాపాలు చేస్తున్నారు. ఆ పాపాలు మోక్షానికి ప్రతిబంధకాలు అనే ముందు చక్కని జీవితానికి కూడా ప్రతిబంధకాలే అని గుర్తించాలి.
నిగ్రహణ యోగం అయితే నిగ్రహణ లేకపోవడం భోగం అవుతుంది. యోగం మోక్షానికి తీసుకెళ్తే మితిమీరిన భోగం రోగాన్ని తీసుకొస్తుంది.
ప్రతి మనిషికి విధి, నిషేధాల పైన అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా *జిహ్యోవస్థ నియమాలు* చాలా అవసరం. ఎందుకంటే జిహ్వకి, కోరికలకు తృప్తి అనేది ఉండదు. అవి మనిషి నియమరహితంగా ప్రవర్తించడానికి ప్రేరణ కలగ చేస్తుంటాయి. అవి ఎప్పుడూ సుఖాలను వాంఛిస్తూనే ఉంటాయి. జిహ్వోవస్థని సుఖభ్రమం అంటారు. అంటే అవి మనిషిని వీటిలోనే సుఖముంది అనే బ్రాంతిలోకి నెట్టేస్తాయి. అవి బ్రాంతి మాత్రమే అని తెలుసుకునే లోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది.
నేటి సమాజంలో *జిహ్వగత దోషాలు* అంటే తినరానికి తినడానికి, తాగరానికి తాగడానికి కావలసినవి చాలా కనిపిస్తూ ఉంటాయి. అవి అందించే వారు లాభాపేక్ష చూస్తున్నారే తప్ప వాటి చెడు ప్రభావాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వీటి వలన కలిగే పరిణామం యువతకు తెలియజేయవలసిన పెద్దలు కూడా అంతా మామూలేగా అని ఉపేక్షించి సర్దుకుపోతూ వాటి వలన ఇంద్రియాలు బలహీనపడి అనేక రుగ్మతలకు కారణమవుతాయి అని తెలియజేయలేకపోవడమూ ఒక ముఖ్య కారణం.
*పర్యన్తదుఃఖేక్షణాత్* అంటారు. అంటే పరిణామంలో ఏ దుఃఖం ఉందో ఆలోచిస్తే దానిని అధిగమించవచ్చు అని. *పూర్వాపర దుఃఖాలు* అంటే కోరిక తీరకపోతే కలిగే దుఃఖం, కోరిక తీరిన తర్వాత కలిగే దుఃఖం పైన అవగాహన ఉంటే చక్కని జీవితం అనుభవించవచ్చు. అటువంటి అవగాహన కలుగజేసేది మనస్సు మాత్రమే. మనసు నిగ్రహణం అన్నిటిని జయించగలదు. అదే మన సనాతన ధర్మంలో సాధన చేయడం. అంటే మనస్సును నియంత్రించడమే. త్యాగరాజు వారు కూడా *మనసా! ఎటులోర్తునే* అన్నారు.
ఇక్కడ ఉపలక్షల న్యాయంగా జిహ్వోవస్థల గురించే మాట్లాడుతున్నాము అంటే మిగిలిన ఇంద్రియాలు మంచివేనని బ్రాంతి పడకూడదు. అవి పంచేంద్రియాలు, ఒకదాని గురించి చెప్తే అన్నిటి గురించి చెప్పినట్లే.
ఇప్పటికే కాలాతీతం అయింది, చివరిగా గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విషయాన్ని గ్రహిద్దాం.
*ఏహి సంస్పర్శయా భోగాః దుఃఖయోనయ ఏవ చ* *ఆద్యంతవంత కౌంతేయ! న తేషు రమతే బుధః*
ఇంద్రియాలు, ఇంద్రియార్థాల కలయికతో ఆనందపడతాయనే భ్రాంతే దుఃఖాలకు కారణాలు. వీటికి ప్రారంభము, నాశనము ఉంటాయి. నశించే లక్షణాలున్న భోగాల కోసం శాశ్వతమైన జ్ఞానాన్ని కోల్పోతున్నాం. తెలివైనవాడు ఆ తత్కాల సుఖ భోగాల కోసం ఆరాటపడడు.
ఉంటా
✍️ మృశి
(_దశిక ప్రభాకర శాస్త్రి_)
9849795167
03.01.2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి