*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*
*శ్రీ స్వామివారి సమాధానం..అహం నిర్మూలనం..*
*(యాభై ఏడవ రోజు)*
ప్రభావతి గారికి తేలుకుట్టి ఆవిడ బాధపడుతున్న విషయాన్ని విన్న స్వామివారు కొంత సేపు మౌనంగా వున్నారు..శ్రీ స్వామివారు ఏదైనా మంత్రం వేస్తారేమోనని ఎదురుచూస్తున్న వ్యక్తికి ఏమీ పాలుపోక.."స్వామీ..అక్కడ అమ్మగారు బాధపడుతున్నారు..మీరేదైనా మంత్రం వేస్తారేమోనని నేను ఇటు వచ్చాను.." అన్నాడు..
శ్రీ స్వామివారు అత్యంత చిరాగ్గా ముఖం పెట్టి.."నేను మంత్రాలు తంత్రాలు వేసేవాడిలాగా కనబడుతున్నానా?..ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి..నేను గారడీలు చేయను!..వెంటనే నువ్వెళ్ళి అమ్మను భగవన్నామాన్ని విడవకుండా చేసుకోమని చెప్పు.." అన్నారు..
ఆ వచ్చిన మనిషికి ఈ జవాబు రుచించలేదు..పైగా తానింతదూరం వస్తే..ఈరకంగా విసుక్కుంటాడా ఈయన..అని కోపం వచ్చి..వెనక్కు తిరిగి మొగలిచెర్ల వచ్చి శ్రీధరరావు గారితో శ్రీ స్వామివారు అన్న మాటలు పూసగుచ్చినట్టు చెప్పేసాడు.."వెళ్లొద్దంటే విన్నావు కాదు నాయనా!.." అన్నారు శ్రీధరరావు గారు..
ఆ రాత్రంతా ప్రభావతి గారు బాధపడ్డారు..మరుసటి రోజు సాయంత్రానికి పూర్తిగా నొప్పి తగ్గి..మామూలుగా మారారు..ఆ ప్రక్కరోజు శ్రీ స్వామివారి దగ్గరకు గూడు బండిలో వెళ్లారు..శ్రీ స్వామివారు ఉల్లాసంగా వున్నారు..వీళ్ళను చూడగానే..
"అమ్మా!..నొప్పి తగ్గిందా?.." అన్నారు..
"తగ్గింది నాయనా!..కానీ ..పాపం మీ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి ని నిరాశ పరచకుండా ఏదో ఒక మంత్రం చెప్పి పంపకపోయారా?..నా బాధ నేను ఓర్చుకుంటాను..కానీ..ఈలోకం ఏమనుకుంటుంది?..స్వామివారికి ఏ మహిమలూ లేవని అనుకుంటుంది.." అన్నారు ప్రభావతి గారు..
శ్రీ స్వామివారు పక పక మని నవ్వి.."అమ్మా..అంతమంది చేత పొగిడించుకునేసరికి నీకు అహం తన్నువచ్చిందమ్మా..అది తగ్గడానికి భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడు..నువ్వు ఒకరోజంతా కుయ్యో మొర్రో అని బాధపడ్డావు..అప్పటికి నీ అహం తాలూకు పాప ప్రక్షాళన జరిగింది..నేను భగవన్నామాన్ని చేసుకోమని చెప్పి పంపింది ఎందుకనుకున్నావు?..అదొక్కటే సర్వబాధలను నివారించేది!.. అని నీకు తెలియడం కోసం..ఇక ఆ వచ్చిన వాడు నిరాశపడ్డాడని అనుకున్నావా?..నిజమే..నిరాశపడ్డాడు.. కానీ ఒక్కటి గమనించు..ఈరోజు నీకు తేలు కుట్టింది..నేను నా మహిమతో దానిని తగ్గించాను..రేపు మరొకరికి..ఆప్రక్కరోజు..ఇంకొందరు..ఇలా వరుసపెడతారు.. నేను గారడీలు చేసుకుంటూ..మంత్రాలు వేసుకుంటూ దుకాణం పెట్టుకోవాలి..ఇక నాకు తపస్సు సాగినట్లే!..అమ్మా..ఈ చమక్కుల కోసం నేను ఇక్కడికి రాలేదు..నేను ఏ మహిమలూ చూపను..నన్ను విమర్శించినా..నా లక్ష్యం మాత్రం మోక్ష సాధనే!..మీకు పదే పదే చెపుతున్నాను..నేను వచ్చిన కార్యం పూర్తవబోతోంది..ఇంక ఎక్కువ సమయం లేదు..నన్ను సజీవ సమాధి చేయడానికి ఏర్పాట్లు చేయండి..ఈ శరీరం ఎక్కువకాలం ఉండదు.." అన్నారు..
ప్రభావతి శ్రీధరరావు గార్లు..మళ్లీ సజీవ సమాధి అని చెపుతున్నారు శ్రీ స్వామివారు అని మథన పడి.."నాయనా!..మేమూ చెపుతున్నాము..వినండి!..మా చేతులతో ఆ పని చేయలేము..పోనీ మీకు ఉపదేశం చేసిన మీ గురువుగారు "బాలబ్రహ్మం " గారిని ఇక్కడకు పిలుచుకుని వస్తాము..వారి ద్వారా మీకు చెప్పించే ఏర్పాటు చేస్తాము.." అన్నారు..
"వద్దు!..వద్దు!..గురువుగారిని పిలుచుకురావొద్దు..కానీ నా కాలపరిమితి పూర్తవుతున్నది.. ఎవరొచ్చినా సమయం పూర్తయ్యే నాటికి నేను వెళ్లిపోవాల్సిందే..ఆయనను ఇబ్బంది పెట్టడం మినహా మరో ప్రయోజనం లేదు!.."అన్నారు..
"మరొక్కసారి ఆలోచించండి!..మీలాటి వారి అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది.." అని చెప్పి ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసారు..
శరీర త్యాగానికి సన్నద్ధం..రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 9908973699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి