3, జనవరి 2025, శుక్రవారం

భజగోవిందం (మోహముద్గరః)*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం - 8*


*కా తే కాంతా కస్తే పుత్రః*

*సంసారో యమతీవ విచిత్రః|*


*కస్య త్వం కః కుత ఆయాతః*

*తత్త్వం చింతయ తదిహ భ్రాంతః||*


*శ్లోకం అర్ధం : ~*


*ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.*


*వివరణ:~*


*ఓయి సుమతీ! కొంత ఆలోచించుము. ఆత్మ స్వరూపులమైన మనమందరమూ ఈ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము. నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులతో ఏమి నీకు సంబంధము? అలాగే నీకు పుట్టిన బిడ్డలతో వారి జన్మకు ముందు నీకేమిటి సంబంధము? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీవెవరు? ఈ భవ బంధములేవి పుట్టుక మునుపు లేవు, మరణము తరువాత ఉండవు. కనుక ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి వ్యామోహములో పడి చింతనొందకుము. ఈ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడునంత వరకు మన పాత్రల బాంధవ్యములు వేరు. అదే విధముగా ఈ జీవన్నాటకము కూడా. అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వరకూ నా భార్యాబిడ్డలని వ్యాకుల పడుతూ, వారి కొరకు నీ సమయము వృధా చేయకుము. ఉన్నదానితో తృప్తి పడి వారిని పోషించుము, మిగిలిన సమయము భగవన్నామస్మరణలో గడుపుము.*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

కామెంట్‌లు లేవు: