14, నవంబర్ 2020, శనివారం

17-17-గీతా మకరందము

 17-17-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇంతదనుక శారీరక, వాచిక, మానసిక తపస్సులనుగూర్చి చెప్పి, ఇక సాత్త్విక, రాజసిక, తామసిక తపస్సులను వివరించుచున్నారు -


శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః | 

అఫలాకాంక్షిభిర్యుక్తైః  

సాత్త్వికం పరిచక్షతే || 


తాత్పర్యము:- ఫలాపేక్షలేనివారును, నిశ్చలచిత్తులును (లేక, దైవభావనాయుక్తులును) అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ (పైనదెలిపిన శారీరక, వాచిక, మానసికములను) మూడు విధములైన తపస్సును సాత్త్వికమని (సాత్త్వికతపస్సని) (పెద్దలు) చెప్పుచున్నారు.


వ్యాఖ్య: - "శ్రద్ధయా” అను పదమునకు "పరయా” అను విశేషణమును చేర్చుట వలన సామాన్యశ్రద్ధ చాలదనియు, మిక్కుటమైన శ్రద్ధ, లేక ఉత్తమమైన శ్రద్ధ అవసరమని విదితమగుచున్నది. ఏలయనగా సాధకునకు మధ్యమధ్య ఏవైన అంతరాయములు గలిగినచో అల్పమగు శ్రద్ధ చలించిపోవచ్చును. అందుచే అపరిమితమగు శ్రద్ధతో, విశ్వాసముతో, పట్టుదలతో గూడుకొనియున్నప్పుడు మాత్రమే మాయను దాటవీలగును.


"నరైః” - ఇచట నరులు అని చెప్పబడినదే కాని జాతిమతకులాదు లెవ్వియు పేర్కొన బడలేదు. కావున మానవులందఱును పరమార్థలక్ష్యమును సాధించుటకు, భగవంతుని అన్వేషించుటకు అర్హులేయని గీతాచార్యులు తేల్చిచెప్పివైచిరి.


“యుక్తైః” - భగవంతునితో, ఆత్మతత్త్వముతో, పరమార్థసాధనతో కూడిక (యోగము) కలవారు, ప్రాపంచికదృశ్యజాలముతో కూడిక తగ్గించుకొని, భగవద్ధ్యానపరులై యుండువారు, నిశ్చలచిత్తులు యుక్తులనబడుదురు.


దీనినిబట్టి సాత్త్వికతపస్సు నాచరించువారు మూడు సద్గుణములు గలిగియుండవలెనని తేలుచున్నది. అవి యేవియనిన - (1) వారు పరమ శ్రద్ధతో గూడియండవలెను (2) ఫలమును గోరక కర్మలనుచేయవలెను (3) నిశ్చలచిత్తము, లేక భగవద్ధ్యానపరులై గలిగియుండవలెను - ఇట్టి ఉత్తమ స్వభావములు గలిగి పైనదెల్పిన త్రివిధ (శారీరక, వాచిక, మానసిక) తపస్సుల నాచరించుచో అది సాత్త్విక తపస్సనబడును.


పప్రశ్న:- సాత్త్వికతపస్సనగా నెట్టిది?

ఉత్తరము:- (1) అత్యంత శ్రద్ధతో (2) ఫలాభిలాషారహితముగ (3) నిశ్చలచిత్తుడై (లేక, దైవధ్యానపరుడై) పైన దెలిపిన త్రివిధతపస్సులను చేయుటయే సాత్త్వికతపస్సనబడును.

కామెంట్‌లు లేవు: