14, నవంబర్ 2020, శనివారం

ధార్మికగీత - 80*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 80*

                                     *****

     *శ్లో:-  సూపం వినా భోజన మప్రశస్తం ౹*

             *యూపం వినా యాజన మప్రశస్తం ౹*

             *ధూపం వినా పూజన మప్రశస్తం ౹*

             *దీపం వినా మైధున మప్రశస్తమ్ ౹౹*

                                      *****

*భా:- మానవ జీవనసరళిలో అను నిత్యం ముడివడి, విడదీయరాని  అంశాలు నాలుగున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం. 1. "సూపము":-  అంటే పప్పు. శతాబ్దకాలం క్రితం "పప్పన్నం" ఎప్పుడు పెడతారండీ! అని ఆడిగేవారట. అది ఎంత అలభ్యమో, అరుదైనదో నాటి స్థితిగతులకు  అద్దం పడుతోంది. కేవలం పెళ్లిసందడి; సంపన్నుల ఊరబంతి;  ఆలయ సహపంక్తి భోజనాలలో మాత్రమే అన్నంతో పప్పు వడ్డించేవారట.  కాన పప్పు లేని భోజనం ప్రశస్తమైనదికాదు. 2. "యూపము":- అనగా వధ్యశిల. యజ్ఞ యాగాదుల నిర్వహణలో జంతువులను బలి ఇచ్చే సంప్రదాయం ఉండేది. బలియైన జీవాలను దేవతకు నైవేద్యం పెట్టేవారు. యాగనియమాల ననుసరించి యూపం లేని  యాగం ప్రశస్తము కాదు. 3. "ధూపము":- అంటే పొగ.  ధూపదీపనైవేద్యాల నిమిత్తం ప్రతి గుడికి ప్రత్యేకించి మడులు, మాన్యాలు ఆనాటి ఉదారులు భూరి విరాళంగా ఇచ్చేవారు. ఇంటిలోగాని,గుడిలోగాని  ధూపము లేనిదే పూజాప్రారంభం సముచితం కాదు. 4. "దీపము":- భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మ వంటిది, విదేశీయులచేత  ప్రశంసాపా త్రమైనది మన కుటుంబ వ్యవస్థ. అట్టి కుటుంబానికి ప్రతీక దంపతులు. చిరుదీపము కూడా లేని, భార్యాభర్తల పవిత్ర అనురాగానికి సంకేతమైన దాంపత్యక్రీడ సంప్రదాయం కానే కాదు. తేజోవంతమైన సంతానానికి దీపం ఆలంబనము. సనాతన ధర్మాలను, సదాచారాలను తృణీకారభావంతో విడనాడడం ఆధునిక నాగరికత అనిపించుకోదని నేటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన పెద్దలదని గుర్తించి వర్తించాలి*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*   

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: