14, నవంబర్ 2020, శనివారం

రామాయణమ్ 213

 రామాయణమ్ 213

................

రామ బాణము చేత కొట్టబడి నేలబడియున్న భర్తను చూడగానే దుఃఖము వెల్లువలా పొంగుకుంటూ వచ్చి ఆర్యపుత్రా అంటూ అరుస్తూ 

వాలి మీదబడి కౌగలించుకుంది తార .

.

ఆ స్పర్శకు మెల్లగా కళ్ళు విప్పాడు వాలి .

.

ఏల నన్ను పలుకరింపవు?

.

 తారా !అంటూ ఏల దగ్గరకు తీసుకొనవు?

.

 మెత్తటి పట్టుపరుపులమీద పవ్వళించు నా స్వామీ నీకు ఇట్టి కఠినశిలలె పానుపుగా అమరినవా ప్రభూ !

నాకన్నా నీకు భూమియే గొప్ప ప్రియురాలైనదా ? 

.

ఎంత కఠినమైనది నా హృదయము నేల మీద పడియున్న నిన్ను చూసికూడా వేయి వ్రక్కలు కాలేదు ! 

.

సుగ్రీవుని భార్యను అపహరించి అతనిని రాజ్యమునుండి వెడలగోట్టినావు. 

నేను చెప్పిన హిత వచనములు చేవికేక్కించుకొనకపోతివి కదా !

కడకు ఈ దురవస్థ నీకు ప్రాప్తించినది గదా !

.

నాయనా అంగదా! నీ తండ్రిని బాగుగా చూడుము ఇకపై ఆయన దర్శనము నీకు దొరకదు .

.

నాధా !

నీ కుమారుని ఓదార్చవయ్యా .

వాడి శిరస్సుమీద ఎప్పటివలెనే ముద్దుపెట్టుకోవయ్యా !

.

దీనముగా విలపిస్తున్న తారను సమీపించి హనుమంతుడు ఓదార్చసాగాడు.

.

బలహీనమైన ప్రాణముతో నెమ్మదిగా శ్వాస పీలుస్తున్న వాలి ,తన ఎదుట ఉన్న తమ్ముని చూసి .....

సుగ్రీవా ,నేను నీకు చేసిన దోషములను లెక్కచేయక ము ,

.

మనమిరువురము కలిసి సుఖపడటము విధాత రాయలేదు  కావుననే ఈ విధముగా జరిగినది .

.

నీవు ఇప్పుడే వానర రాజ్య పట్టాభిషిక్తుడవు కమ్ము ! 

ఒక్క మాట ! 

ఈ అంగదుడు సుకుమారుడు, వీడికి ఏ కష్టము కలుగ కుండా పెంచుకున్నాను. వీడికి ఏ లోపము రాకుండా చూసుకోగలవా?

 ,ఇది నా చివరి కోరిక ! 

.

సుగ్రీవా ! సుషేణుని కుమార్తె ఈమె ! చాలా సునిశితమైన ప్రజ్ఞకల ఈ తార అకస్మాత్తుగా వచ్చు ఉపద్రవముల విషయములలో ఎల్లప్పుడూ చేయవలసిన కర్తవ్యాన్ని గురించి చక్కగా బోధించగలదు.

గురి తప్పని బుద్ది కలది.

.

సుగ్రీవా ! రామ బాణము నీ ప్రాణము కూడా నిస్సందేహముగా హరించగలదు ,నీవుఆయన కిచ్చిన మాట నిలబెట్టుకోలేని పక్షములో !కావున ఆయన కార్యము నెరవేర్చుము.

.

ఇదుగో ఈ బంగరుమాలను తీసుకో ,ఇది సదా జయలక్ష్మినిచ్చే ప్రశస్తమైన మాల ,నేను మరణించకముందే తీసుకో ! 

.

అని సుగ్రీవునకు మాల ఇచ్చి అంగదునివైపునకు తిరిగి ,

నాయనా నీవు ఎట్లు ప్రవర్తించిననూ నేను నిన్ను సదాసర్వదా లాలించు చుంటిని .ఇప్పుడు నీవు మునుపటివలె ప్రవర్తించినచో చిన్నాన్న ఇష్టపడడు........


రామాయాణమ్ 214

................

నాయనా అంగదా !సుగ్రీవునితో స్నేహములేని వారితో గాని ,

అతని శత్రువులతోగానీ కలిసి 

తిరుగకుము,ప్రభువైన సుగ్రీవుని కార్యము నిర్వర్తించుటయందే 

నీ శక్తియుక్తులు ప్రదర్శించుము, అన్య విషయములలో వలదు. 

.

అతనికి ఎల్లప్పుడువశుడవైఉండుము .

.

నీవు ఎవరి విషయములలో ఎక్కువ ప్రేమ చూపవలదు ,అటులనే ఎక్కువ ద్వేషమూ వలదు రెండూ చెడ్డవే !అందుచేత నీవు మధ్యేమార్గ స్పష్ట దృష్టి అలవరుచుకొనుము.

.

ఈ మాటలు చెపుతూ చెపుతూ ఉన్నప్పుడు ఆయనకు బాణము గ్రుచ్చుకోనుటవలన కలిగిన వేదన అధికము కాజోచ్చెను.

.

 మాటలాడుచుండగనే కండ్లు తేలవేసి కోరలు వెళ్ళబెట్టి ప్రాణములు వదిలి వేశాడు మహాబలి వాలి.

.

ఒక్కసారిగా వానరలోకమంతా గొల్లుమన్నది.

.

వాలి శరీరమును కౌగలించుకోనుటకు తారకు బాణము  అడ్డము  వచ్చుట గమనించిన సుగ్రీవుడు నీలుని ఆ బాణము పెరికి వేయమనగా, నీలుడు రామబాణమును వాలి శరీరమునుండి బలముగా లాగి అవతల పారవైచెను .

.

బాణము తో పాటుగా వాలి శరీరమునుండి రుదధిరధారలు, 

అవి చూడగనే తార కంటి నుండి 

అశ్రుధారలు ఒకేసారి  పెల్లుబికి ప్రవహించాయి.

.

అన్న మరణానికి చింతిస్తూ సుగ్రీవుడు రామునితో ,రామా నా అన్న మరణించిన పిదప నాకు ఈ రాజ్య మెందులకు నేను కూడా అతనితోటే ఆ చితిలోనే ప్రవేశిచెదను .

.

ఓ రామా నాకు అనుమతి నీయవయ్యా!

.

 నేను లేక పోయిననూ నీ కార్యము మా వానర వీరులు నిర్వర్తించగలరు,

 రామా నాకు బ్రతుకు మీద ఆశ లేదు నేను  కూడా  చనిపోవుటకు అనుమతించుమా రాఘవా అని హృదయ విదారకముగా రోదిస్తున్న సుగ్రీవుని చూసి రాముని మనస్సులో క్షణకాలము విషాదము ఆవహించింది.

.

అంతట వానరులందరూ కలిసి భర్త శరీరము పై పడి ఏడుస్తున్న తారను బలవంతముగా అక్కడినుండి తొలగించగా ఆవిడ కాళ్ళూ చేతులూ విలవిలా కొట్టుకుంటూ ఆయననుండి దూరము కాలేక అక్కడనే యుండుటకు ప్రయత్నించసాగింది .

.

అప్పుడు అందరూ కలసి ఆవిడను అక్కడనుండి లేపినప్పుడు ఆవిడ ఒకసారి రాముని చూసింది ..

.

ఆ చూపులో ఎన్ని అర్ధాలొ!


రామాయణమ్ 215


పరుగు వంటి నడకతో రాముని సమీపించింది తార .

.

ఓ రామా ఊహించరాని రూపము నీది 

ఎదిరింపరాని వీరము నీది 

జితేన్ద్రియుడవీవు 

పరమ దార్మికుడవీవు 

ఓర్పున పృధివీ సముడవు 

నేర్పుగల వాడవు 

సామర్ధ్యమున్నవాడవు .

.

మహాబలశాలివై అందమైన రూపముతో గొప్ప ధనుస్సు ధరించి దివ్యదేహ వైశిష్ట్యముతో విరాజిల్లుతున్నవాడవు ! 

.

ఓ వీరుడా !

ఏది నా మగని చంపినా బాణము ? 

దానితోనే నన్ను కూడా చంపవయ్యా!  

నేను కూడా అతనునున్న చోటికే వేళ్ళగలదానను .

.

నేను లేక అతనక్కడ ఉండలేడయ్యా! 

స్వర్గములో ఇటుఅటుచూసి నేను కనబడక పోయినచో అప్సర స్త్రీలను కూడా దగ్గరకు రానీడయ్యా ఆయన !

.

సీత లేక నీవు ఎలా కృంగి కృశించి పోవుచున్నావో నేను కూడా వాలి లేక అంతే కృశించి పోయెదను !

.

విరహమన్న ఏమో నీకు బాగుగా తెలియును కదా!

.

 ఇంత సుందర ధరిత్రిలో ఈ పర్వత ప్రాంతమందు కూడా సీత పక్కన లేక నీవు బాధ పడుటలేదా?


 నాకెందుకయ్యా ఈ వియోగ వ్యధ !

నన్ను కూడాచంపివేయుమయ్యా ! 

.

భార్యా భర్తలిరువురూ ఒకటే శరీరము !

.

ఈ శరీరము కూడా వాలి శరీరములో భాగమేనయ్యా

 అందుకే నన్ను కూడా కడతేర్చుము !రామా

 నీకు స్త్రీ హత్యా దోషమంటదు రఘురామా !

.

రాముడు తార విలాపములన్నీ విన్నాడు . 

.

ఓ తారా నీవిటుల శోకించుట తగదు.

 ఇట్టి విపరీతపు ఆలోచనలు మానివేయుము 

ఈ లోకమునకు సృష్టి కర్త బ్రహ్మ!

సుఖదుఖములనూ ఆయనే ఏర్పరచినాడు ,

నీవు పూర్వపు ఆనందమునే మరల పొందగలవు ,

నీ కుమారుడు యౌవరాజ్య పట్టాభిషిక్తుడు కాగలడు.

శూరుల భార్యలు ఇట్లు విలపించరు. 

అని అనేక విధములుగా ఓదార్చినాడు శ్రీరామచంద్రుడు .

కామెంట్‌లు లేవు: