రామాయణమ్ 216
....................
సుగ్రీవుడు ,తార ,అంగదుడు వీరు మువ్వురినీ ఓదార్చి ఇక చేయవలసిన కార్యము గురించి ఆలోచించమని రాముడు తెలుపగా లక్ష్మణుడు సుగ్రీవుని సమీపించి వాలి శరీరానికి దహన సంస్కారాలు జరిపించవలెనని తెలిపి అందుకు కావలసిన ప్రయత్నములు చేయమని సూచించినాడు .
.
వెంటనే సుగ్రీవుడు శ్రేష్టమైన గంధపుచెక్కలను బాగా ఎండిన అనేకములైన కాష్టములను తెచ్చుటకై వానరులను ఆజ్ఞాపించెను .
.
అన్ని ద్రవ్యములను తెచ్చుటకు అంగదుడు పంపబడెను .
.
తారుడు వాలి శరీరమును మోయుటకోరకు ఒక శ్రేష్టమైన పల్లకి తెచ్చెను .
.
వానరవీరులు వాలి శరీరాన్ని ఎత్తి ఆ పల్లకి లో ఉంచి పల్లకిని భుజములకేక్కించుకొని మోయసాగిరి .
.
తార మొదలైన స్త్రీలు అనుసరించి వెళ్లిరి
.
ఒక నదీతీరమున చుట్టూ జలమున్న నిర్జనమైన ఒక ఇసుక తిన్నెపై చితిని ఏర్పాటు చేసి ఆ చితిపై వాలిశరీరాన్ని ఉంచారు వానరులు.
.
అప్పుడు అంగదుడు చితికి నిప్పంటించి అప్రదక్షిణముగా తిరిగెను. వానరు లంతా నది వద్దకు వెళ్లి వాలి కి జల తర్పణములు చేశారు.
.
దహన సంస్కారమైన పిమ్మట సుగ్రీవుడు రాముని వద్దకు వెడలి అంజలి ఘటించి నిలిచెను .
.
అంత హనుమంతుడు రామునితో రామా ! ఈ సుగ్రీవునకు నీవు అనుమతినిచ్చిన ఎడల కిష్కింధకు వెళ్లి యధాశాస్త్రము రాజ్యాభిషిక్తుడై కార్యములను చక్కబెట్టగలడు అని తెలిపాడు .
.
అప్పుడు రాముడు హనుమంతునితో హనుమా !నేను ఈ పదునాలుగేండ్లు గ్రామములో గానీ పట్టణములలో గానీ ప్రవేశించను మీరే అతనిని తీసుకొని వెళ్లి రాజ్యాభిషిక్తునిగావించండి అంగదుని యువరాజుగావించండి అని పలికెను .
రామాయణమ్ 217
...............
రామాజ్ఞ ప్రకారము సుగ్రీవునకు పట్టాభిషేకము ,అంగదునకు యువరాజ పట్టము కట్టుటనిర్విఘ్నముగా జరిగిపోయినవి.
.
సుగ్రీవుడు రుమను మరల చేపట్టి నాడు .సంతోషముతో ఈ విషయములన్నీ రామచంద్రునకు నివేదించినాడు.
.
అది శ్రావణ మాసము !వర్షరుతువు ప్రారంభమైనది .
నదులన్నీ నిడుకుండలలాగా ఉన్నాయి ,
మేఘములు బారులు తీరి జలధారలు వర్షిస్తున్నాయి ,
.
ఆ సమయము సీతాన్వేషణకు అనుకూలము కాదు.
,కార్తీకమాసమువరకు ఆగవలసినదే ! అప్పటివరకు సుగ్రీవునకు అనుమతిచ్చి తానూ తమ్మునితో గూడి అందమైన ప్రస్రవణ పర్వత గుహనొకదానిని అనుకూలముగా ఉన్నటువంటిది చూసి అందు నివసింప నిశ్చయించినాడు రాఘవుడు,
.
రాఘవుడు ఒక రోజు ఆ గుహ సమీపమునందున్న ఒక నదిని చూశాడు. అది చాలా నిండుగా ప్రవహిస్తున్నది .
ఆ నదిని చూడగానే అందమైన వస్త్రములు ధరించిన కన్నెపిల్లలా తోచింది ఆయనకు.
.
ఆ నది ఒడ్డున ఉన్న వానీర ,తిమిర,వాకుల,కేతక,హింతాల,తినిస,నీప ,వేతస వృక్షాలు రకరకాల రంగుల పూవులతో నిండుగా ఉంది ఆ నదీ కన్య ధరించిన ఉత్తమ వస్త్రములుగా కనుపించినవి రాముని కంటికి !
.
ఆ నదికి దగ్గరగా కూతలు కూయుచూ నదిమీదుగా ఎగురుతున్న పక్షుల కిలకిలారావములు ఆ నదీమసుందరి నవ్వులా ఉన్నవట ఆ నదీ గమన శబ్దము ఆ సుందరి కాలి అందియల సవ్వడి వలే వినిపించినదట.
.
ఆ నదీ మధ్యభాగమున తెల్లని ఇసుకతిన్నెలు ఆ నదీ కన్య నవ్వుమోము వలే తళతళ మెరిసిపోతున్నవట..
.
అందమైన ఊహలతో అనుక్షణము ప్రక్కన సీత లేదే అనే విరహవేదనతో కాలము గడుపుతున్నాడు జానకీమనోహరుడు.
రామాయణమ్ 218
...............
లక్ష్మణా! నామనస్సులో దుఃఖభారము అధికముగా ఉన్నది ,
దానిని దాటే మార్గమేది ?
.
వర్షాకాలమా ప్రయాణమునకు అనుకూలము కాదె !
దీనిని దాటుటేట్లు ?
.
చూడబోతే రావణుడా బలవంతుడైన శత్రువు !
ఈ మూడింటినీ దాటుట ఎట్లు ?
.
వర్ష ఋతువులో అందమైన ప్రకృతిని ఆస్వాదించలేక అనుక్షణము సీతను గుర్తుకు తెచ్చుకుంటూ పిచ్చివాడవుతున్న అన్నను జాగ్రత్తగా ఓదారుస్తూ వస్తున్నాడు లక్ష్మణుడు!
.
వారి పరిస్థితి ఇలా ఉంది!
.
అక్కడ కిష్కింధలో !
.
సుగ్రీవుడు ఎంతోకాలానికి లభించిన సుఖాలవ్వటముచేత వాటిలో మునిగి తేలుతున్నాడు ,సమయము ఎలా గడిచిపోతున్నదో గమనించే స్పృహలో కూడా లేడు.
.
భార్య రుమ ,ఇష్టురాలైన తార ఇరువురూ లభించారు.
మగువ ,మదిర ఈ రెండూ అతనిని కట్టిపడవేసినవి.దర్శనము మంత్రులకు కూడా కరువయ్యింది.
.
ఆయనను ఎవరూ సమీపించే సాహసము చేయలేకపోతున్నారు.
.
ఈ పోకడలన్నీ ఒకరు గమనిస్తూనే వున్నారు !
.
ఆయనే బుద్దిమంతులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు ..
.
అప్పటికీ వర్షాకాలము గడచిపోవచ్చింది.
.
మేఘముల మెరుపులు తగ్గిపోయి నిర్మల మైన ఆకాశము
కనపడ జోచ్చింది .
రాత్రుళ్ళు అంబరాన తెల్లని వెన్నెల పూతలతో కడు రమణీయంగా కనపడుతున్నది . .
.
సుగ్రీవుని సమీపించాడు హనుమంతుడు ...
.
ఇలా పలికాడు!
.
నీవు నీ రాజ్యాన్నీ రుమనీ తిరిగి సంపాదించుకున్నావు .
గొప్ప యశస్సు నీ స్వంతమైనది .
.
ఇక నీవు నీ మిత్రుల కార్యములు సాధించుటమీద దృష్టి నిలపవలె !
.
తగు సమయమును గుర్తించుచూ మిత్రుల విషయములో ఎల్లప్పుడూ బాగుగా ప్రవర్తించువాని రాజ్యము ,కీర్తి, ధనము వృద్ది పొందును .
.
రాజా ! ఏ రాజుకైతే స్నేహితులు ,సైన్యము,ధనాగారము,
ప్రభుత్వ శక్తీ ఈ నాలుగూ సమముగా ఉండునో అతనే గొప్ప రాజ్యమును తన స్వంతము చేసుకోనగలడు.
.
ఎవడు తన మిత్రుని కార్యమును సాధించుటకు ఉత్సాహము చూపడో అతడు సకల అనర్ధములను ఎదుర్కొనవలసి ఉండును!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి