14, నవంబర్ 2020, శనివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వంట..వడ్డన!*


"మాకు అంటు వచ్చింది..ఇంకొక పదిహేను రోజుల పాటు మేము రాలేము.." 


ఒకానొక శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత, శ్రీ స్వామివారి మందిరం వద్ద శని, ఆదివారాల్లో జరిగే అన్నదానానికి వంటచేసే మనిషి ఫోన్ చేసి చెప్పిన మాట అది..


సోమవారం నుండీ శుక్రవారం దాకా శ్రీ స్వామివారికి నైవేద్యాలూ..మందిరం వద్ద అన్నదానానికి కావాల్సిన వంటా వార్పూ చేయడానికి విడిగా ఒక బ్రాహ్మణ వంటమనిషి వున్నాడు..ఆయనే శని, ఆదివారాల్లో శ్రీ స్వామివారికి నైవేద్యాలు కూడా చేసి పంపుతారు..శ్రీ స్వామివారి నైవేద్యాలకు ఏ ఇబ్బందీ లేదు..ఎటొచ్చీ..శని ఆదివారాల్లో జరగాల్సిన అన్నదాన కార్యక్రమమే సందేహం లో పడింది..అప్పటికప్పుడు సుమారు వేయిమందికి వంట తయారు చేసే మనిషి, అతనికి సహాయకులూ కావాలి..ఎలా?..తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసాము..ఎవ్వరూ అందుబాటులోకి రాలేదు..


శనివారం మధ్యాహ్నం సుమారు మూడువందల మందికి చేయాలి..దానికి నైవేద్యాలు తయారుచేస్తున్న వంట బ్రాహ్మణుడే ముందుకొచ్చి..చేసి పెట్టారు..అంతవరకూ జరిగిపోయింది..ఇక అసలు సమస్య..శనివారం సాయంత్రం..ఆదివారం మధ్యాహ్నం.. ఈ రెండుపూటలూ వంట చేసే మనిషి కావాలి..మా ప్రయత్నాలన్నీ కొరగాకుండా పోయాయి..అప్పటికి మధ్యాహ్నం మూడు గంటలవుతున్నది..కనీసం మరో అరగంట లోపల వంట ప్రయత్నం మొదలైతే తప్ప..రాత్రికి వచ్చే వేయిమంది పైచిలుకు భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయలేము..


శ్రీ స్వామివారి సమాధి ముందు మౌనంగా నిలబడ్డాను..మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని.."స్వామీ..నీదే భారం..పరీక్షా నీదే..పరిష్కారమూ నీదే..ఏమీ చేయలేని ఆశక్తత తో వున్నాను..ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండకూడదు అనే సంకల్పాన్ని నెరవేర్చు..ఇంతకు మించి ఈ సమయం లో కోరేది ఏమీ లేదు తండ్రీ!!.." అని ప్రార్ధించాను..ఎందుకో నాలో ఒక్కసారిగా ధైర్యం వచ్చింది..ఇక ఫర్వాలేదు..శ్రీ స్వామివారే ఏదో ఒక రూపంలో పరిష్కారం చూపుతారనే గట్టి విశ్వాసం కలిగింది..


శ్రీ స్వామివారి సమాధి ముందు నుంచి నేను ఇవతలికి వచ్చాను..మా సిబ్బంది దగ్గర ముగ్గురు నలుగురు గుమికూడి వున్నారు..నన్ను చూసి.."అయ్యా..వీళ్ళు మాలకొండకు వచ్చి దర్శనం చేసుకొని..ఈరాత్రికి ఇక్కడ నిద్ర చేస్తారట..ట్రాక్టర్ లో సుమారు ముప్పై మంది వచ్చారు..అన్నదానానికి బియ్యం, ఇతర సరుకులు, కూరగాయలు తెచ్చారట..వీలైతే వాళ్ళు తెచ్చిన సరుకులు ఈరోజు రేపు వాడమన్నారు.." అన్నారు.


"సరుకుల గురించి సమస్య కాదు కదా?..వంటచేసేవాళ్ళు లేక కదా మనం ఇబ్బంది పడుతున్నది.." అన్నాను కాస్త అసహనంగా..


మా వాళ్ళు ఆ మాటే వాళ్ళతో చెప్పారు..వాళ్ళు గబ గబా మా దగ్గరకు వచ్చి.."అయ్యా..మాలో ముగ్గురు వంట చేసే వాళ్ళున్నారు..వాళ్లకు సహాయకరంగా ఉండటానికి..అంటే కూరగాయలు తరిగిపెట్టడానికి, గిన్నెలు శుభ్రం చేసి పెట్టడానికి..మేమూ..మా లోని ఆడవాళ్ళూ ఉన్నాము..మీరొప్పుకుంటే..స్వామివారికి మేము తెచ్చిన సరుకులతో అన్నదానానికి పదార్ధాలను తయారుచేసి వడ్డిస్తాము..మాకూ తృప్తిగా ఉంటుంది.." అన్నారు..


ఒక్కక్షణం నా చెవులను నేనే నమ్మలేకపోయాను..సమాధి లో కూర్చున్న స్వామివారు అభయం ఇచ్చినట్లుగా అనిపించింది..అన్నదానానికి వంట చేసిపెడతాము అనే మాటే అమృతం లాగా వినిపించింది..సంతోషంగా ఒప్పుకున్నాను..వాళ్లకు కావాల్సిన పాత్రలు అన్నీ మా వాళ్ళు క్షణాల్లో ఇచ్చేసారు..ఆ శనివారం రాత్రి కి ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్నదాన కార్యక్రమం జరిగిపోయింది..అంతేకాకుండా..ఆదివారం మధ్యాహ్నం కూడా వాళ్లే వండి వడ్డించారు..ఏ ఒక్క భక్తుడూ ఇబ్బంది పడలేదు..తన దగ్గరకు వచ్చే భక్తుల ఆకలిని శ్రీ స్వామివారు సమాధిలో కూర్చునే గమనించి తీరుస్తున్నారు..ఆపద తీరిపోయిందని మేము ఎంత ఆనందపడ్డామో..తమకు అన్నదానం చేసే అవకాశం వచ్చిందని వాళ్ళూ అలానే ఆనందపడ్డారు..ఇంకొకసారి ఇలాటి అవకాశం కల్పించమని నాకూ..మా సిబ్బందికి మరీ మరీ చెప్పి వెళ్లారు..


శ్రీ స్వామివారి మందిరం వద్ద ఇటువంటి అనుభవాలు కోకొల్లలుగా చూసాము మేము..భక్తులకు ఇబ్బంది ఏర్పడబోయే ప్రతిసారీ శ్రీ స్వామివారు మమ్మల్ని ఆదుకుంటూనే వున్నారు..శ్రీ స్వామివారు మన దగ్గర నుంచి ఆశించేది కేవలం శరణాగతి తో కూడిన భక్తి విశ్వాసాలే..మరేదీ కోరుకోరు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: