14, నవంబర్ 2020, శనివారం

దీపావళీ పండగ గురించి

 దీపావళీ పండగ గురించి 

శ్రీ బ్రహ్మ శ్రీ చాగంటి కోటశ్వరరావు గారు వ్యాసం. 



 దీపావళి పండగ ప్రత్యేకముగా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకటి అలక్ష్మీ పరిహారము, రెండు జీవోన్నతి. 


దరిద్రముతో బాధపడుతున్నవాళ్ళు, కలిసిరాని వాళ్ళు, దుఃఖిస్తున్నవాళ్ళు  దీపావళి పండగనాడు చెయ్యవలసిన విధిని సక్రమముగా పాటిస్తే  లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లోనుండి అలక్ష్మి వెళ్ళిపోతుంది. దరిద్రముతో బాధపడుతున్నవాళ్ళని వాళ్ల పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం దీపావళి తిధి వచ్చింది.


జీవోన్నతి అంటే మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతీరోజూ చాలా చేస్తుంటాము. ఈశ్వరుడు  ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు చాలా తక్కువ చేస్తాము అప్పుడు అవి పాపములు.  ఉదాహరణకి సూర్యోదయమునకు ముందు నిద్రలేవాలి,  లేవట్లేదు,అసుర సంధ్య వేళ పడుకోకూడదు. పడుకుంటున్నాము. ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేసి ఎక్కడకీ వెళ్ళకూడదు.  తాళం పెట్టి ఊళ్ళు వెళ్ళడము వలన  ఇంట్లో ఈశ్వరుడికి  నైవేద్యం  లేదు. ఇవన్నీ దోషములు.  మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి?పాపాలు  పోగొట్టుకుని నరకభయాన్ని దూరం చేసుకోవడానికి ఉపయోగపడేది దీపావళి నాటి అమావాస్య తిధి.


 పాపం నుండి విముక్తి చేస్తుంది అంటే ప్రతీ ఏడాదీ తప్పులు చేసేసి దీపావళి చెయ్యమని కాదు. సాధ్యమయినంత తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి పరిహారం కోసం కనీసములో కనీసం దీపావళి పండగ జాగ్రత్తగా చేసుకోవాలి.

దీపావళి పండగనాడు అలక్ష్మి పోవాలి, జీవోన్నతి జరగాలి అంటే ఏమి చెయ్యాలి? 


దీపావళి స్నాన విధి:


తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిధౌ వశేత్. అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే 


అని శ్లోకం చెప్తూ దీపావళి అమావాస్య రోజు తెల్లవారుఝామున స్నానం చెయ్యాలి.


తైలే లక్ష్మీ ఆ ఒక్కరోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నూనెలో లక్ష్మి ఉండదసలు కానీ ఆ ఒక్క తిధినాడు  నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.

ఇంతకీ స్నానం అసలు ఎప్పుడు చెయ్యాలి?

ఇంకా ఒక ఝాము తెల్లవారడానికి ఉందనగా అంటే తెల్లవారుఝామున నాలుగూ, నాలుగున్నర మధ్యలో లేచి ఒంటికి, తల మీద నువ్వుల  నూనె రాసుకుని పైన చెప్పిన శ్లోకం చెప్తూ స్నానం చెయ్యాలి. స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అలక్ష్మి పోతుంది. మరి పాపం ఎలా పోతుంది?పాపము గంగా స్నానము చేత పోతుంది


 అందరము ప్రతిరోజు గంగాస్నానం చెయ్యలేము కానీ పరమేశ్వరుడు మినహాయింపుని ఇచ్చాడు. దీపావళి అమావాస్య తెల్లవారడానికి ఇంకా ఒక్క ఝాము ఉన్నదనగా ఎక్కడ తటాకము కానీ, నుయ్యి కానీ ఉన్నచోట,  ఇంకా చెప్పాలంటే నీరు ఉంటే అక్కడ ఆ ఒక్క రోజు ఒక్క తెల్లవారు ఝామునందు మాత్రమే,  ఒక్కసారే  గంగ ప్రవేశిస్తుంది.


ఒకవేళ  దరిద్రముతో బాధపడుతు అనుకున్నది ఏదీ కలిసిరావట్లేదు చాలా బాధలో ఉన్నామని అనుకుని నివారణకు ఒక మార్గం దొరకాలి అంటే ఇలా స్నానం చెయ్యాలి.


దక్షిణాయణ పుణ్య కాలములో కాశీ వెళ్ళకుండా గంగా స్నానం సంకల్ప సహితముగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిధి ఒక్క దీపావళి అమావాస్య మాత్రమే. 


గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు 


అని ఏమీ మంత్రం చెప్పకపోయినా దీపావళి అమావాస్య రోజు తెల్లవారుఝామున స్నానం చేస్తే గంగా స్నానం చేసిన  ఫలితం  ఖాతాలో వేస్తారు. గంగా స్నానం చేస్తే ఏమి అవుతుంది?  


పరమేశ్వరుడి  శరీరాన్ని తగిలి భూమి మీదకి వచ్చినటువంటి గంగలో మునక వేసినా, నాలుక మీద వేసుకున్నా, స్నానం చేసినా లేదా  "గంగ,గంగ,గంగ" అని మూడు మాట్లు అన్నా కానీ ఆఖరికి కాశీలో చాలా కాలం ఉండి గంగా స్నానం చేసి చనిపోయే వేళకి కాశీలో లేకుండా చనిపోయినా కాశీలో చనిపోయారన్న  ఫలితం వేస్తారు.


దీపావళి అమావాస్య నాడు జీవుడు అభ్యున్నతిని ఎలా పొందాలి?


జీవుడికి అభ్యున్నతి అంటే? మనలో ఉన్న జీవుడు వచ్చే జన్మలోకూడా వేరొక శరీరములోకి వెడతాడు ఆ జీవుడు. అక్కడ పాపం లేని కారణం చేత చక్కగా సంతోషముగా హాయిగా బ్రతకగలగాలి అంటే గంగా స్నానం చెయ్యాలి. ఆ గంగా స్నానాన్ని  గుమ్మం కదలకుండా చెయ్యగలిగిన అవకాశం ఒక్క దీపావళి అమవాస్య నాడే. 


  యధార్ధముగా చెప్పాలంటే  నరకద్వారము చూస్తామేమో అన్న భయం లేనివారు  ఎవరూ  ఉండరు. అందరికీ ఉంటుంది.ఆ భయం పోగొట్టడానికీ, ప్రశాంతమైన స్థితిలో ఈశ్వరసేవకులు వచ్చి అంత్యకాలములో  తీసుకెళ్ళేటట్లు అనుగ్రహం పొందాలి అంటే దానికి ఒక్క దీపావళి అమావాస్య నాడే అవకాశం. అందుకే అమావాస్య నైమిత్తిక తిధి, అమావాస్య పితృ తిధి, అమావాస్య అటు దైవ శక్తితో ఇటు పితృ దేవతా తిధితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక అమావాస్య దీపావళి అమావాస్య.


ఇన్ని లక్షణాలు ఉంటాయి  దీపావళి అమావాస్యలో.


"నేను దేహం విడిచిపెట్టేసినప్పుడు నాకు యమ భటులు కనపడకూడదు. ఈశ్వర భటులు   కనపడాలి" అనే కోరిక ఉన్నవాళ్ళు దీపావళి అమావాస్య రోజున స్నానం చేసినప్పుడు ఏమి చెయ్యాలి?. 


ఒంటికి నూనె రాసుకోవడం ఒకటే కాకుండా చెయ్యవలసినది ఇంకొక విధి, ఉత్తరేణి చెట్టు తెచ్చుకుని చుట్టూ త్రిప్పుకుని స్నానం చెయ్యడం. ఆ చెట్టుని ఏదో  అలా వేళ్ళతో ఉన్నదానిని తీసుకొచ్చి కడిగేసి ఓ కొమ్మ తెచ్చుకుని స్నానం చెయ్యకూడదు.


ఉత్తరేణి చెట్టుని పైకి తీసినప్పుడు మట్టి పెళ్ళలతో సహా ఆ చెట్టు పైకి లేవాలి. అంటే  మొక్కని పైకి పీకితే మట్టి బెడ్డలతో ఉండేటట్లుగ పైకి తీయాలి. అంటే బాగా నీళ్ళు పోసి పైకి తీస్తే అది మట్టితోటి పైకి వస్తుంది. అలా మట్టితోటే తెచ్చుకోవాలి. మట్టితోటే తెచ్చుకుని, స్నానం చేసేటప్పుడు ఆ ఉత్తరేణి చెట్టుని తనకు తానే త్రిప్పుకోవాలి. ఎవరో త్రిప్పరు దృష్టి దోష పరిహారార్ధం తనకి తానే త్రిప్పుకోవాలి. ఆ త్రిప్పుకునేటప్పుడు మాత్రం ఒక శ్లోకం చెప్పాలి


శీతలోష్ఠ  సమాయుక్తా సకంటక దళాన్వితా

హరపాపం అపామార్గ భ్రామ్యమానః పునః పునః 

అని చెప్పాలి.


ఒక్కమారు త్రిప్పుకోకూడదు. కనీసములో కనీసం మూడు మార్లు త్రిప్పాలి. ఆ చెట్టుని పట్టుకుని తలచుట్టూ త్రిప్పుకుని ఈ శ్లోకం చెప్పాలి


ఈశ్వరా! ఇదిగో ఉత్తరేణి చెట్టుని తెచ్చాను. శీతలోష్ఠ సమాయుక్తా అంటే మట్టిపెళ్ళలతో ఉన్నటువంటి ఈ ఉత్తరేణి చెట్టుని తెచ్చాను. ఇది  

సకంటక దళాన్వితా ఇది చిన్న చిన్న ముళ్ళతోటీ ఆకులతోటీ ఉన్నది. అటువంటి ఈ చెట్టు  


హరపాపం ఇది నా పాపములను అన్నింటినీ కూడా పోగొడుతుంది

అపామార్గ-ఓ ఉత్తరేణి చెట్టు

భ్రామ్యమానః పునః పునః-నేను మళ్ళీ మళ్ళీ త్రిప్పుకుంటున్నాను ఈ చెట్టుని అని  ఉత్తరేణి చెట్టు నాలుగైదు మార్లు తల చుట్టూ త్రిప్పుకుని ప్రక్కకి పారేసి ఆరోజు నిర్భయముగా దక్షిణ దిక్కుకి తిరగాలి.


దక్షిణ దిక్కుకి తిరిగి యగ్నోపవీతం ఉన్నవాళ్లయితే యమధర్మరాజు గారికి తర్పణ ఇస్తారు ఆరోజున -యమాం తర్పయామి-యమాం తర్పయామి-యమాం తర్పయామి- అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి. కనీసములో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉన్నది అది ఒక్క దీపావళి  అమావాస్య రోజే చదవాలి. పోనీ ఆ నామాలు అవీ రాసుకోవడం,  చదవడం భయం అంటే కనీసములో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి "ఓ యమ ధర్మరాజా! నీకు నమస్కారం" అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరిగి స్నానం చెయ్యాలి.


స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టలు మీదనే స్నాన చెయ్యాలి. దిగంబరముగా చేస్తే ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అందుకని దిగంబరముగా చెయ్యకూడదు. చిన్న తువ్వాలో ఏదో కట్టుకుని చెయ్యాలి.


ఇలా దీపావళి అమావాస్యని ఎవరు చేస్తారో వాళ్ళకి జీవోన్నతి, లక్ష్మీ కటాక్షము కలిగి, అంత్యకాలములో  ఈశ్వర భటులు  తీసుకెళ్ళేటట్లుగా, మరణించాక నరకద్వార దర్శనము లేకుండా  భగవంతుడు అనుగ్రహిస్తాడు.

స్వస్తి🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: