14, నవంబర్ 2020, శనివారం

సుభాషితాలు

-----   సుభాషితాలు --------------

 

భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మా శుక్రియన్,

హేమక్ష్మాధర దేహముం, జకితవన్యేభేంద్ర సందోహముం,

గామక్రోధన గేహమున్, గరటి రక్తస్రావ గాహంబు, ని

స్సీమోత్సాహము, వీత దాహము, జయశ్రీ మోహమున్, గ్రాహమున్.

 

భావము:- రివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.

 

అడిగినయట్టి యాచకుల ఆశ లెరుంగక లోభవర్తియై

కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె

య్యెడల; అదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్

కుడువగ నీనిచో కెరలి గోవులు తన్నును గాక భాస్కరా!

 

తాత్పర్యం: భాస్కరా! దూడలను తాగనియ్యక పాలు తీసుకోవాలని సిద్ధపడితే ఆవులు పాలియ్యవు సరి కదా తంతాయి. అలాగే ఏదో యిస్తారని ఆశతో వచ్చి చేయిచాచి అడిగే వారికి లోభితనముతో లేదు పొమ్మంటే ధర్మ దేవత ఆ లోభికి ధనం ఎప్పటికీ రాకుండా చేస్తుంది. అడిగిన వారికి ఎంత కొంత యిస్తూ ఉంటే ధనం ఏదో విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి యాచించే వారిని చులకనగా చూచి "లేదుపో" అని అనకూడదు.

 

 

భక్తుడిలా ఉండాలి- ధూర్జటి .

మ: నిను సేవించిన కష్టముల్ కలుగనీ , నిత్యోత్సవం బబ్బనీ ,

నను మాన్యుండననీ , మహాత్ము డననీ , సంసార మోహంబు పై

కొననీ , జ్ఙానము గలుగనీ ,గ్రహగతుల్ కుందింపనీ , మేలు వ

చ్చిన రానీ , యవి నాకు భూషణములే! శ్రీ కాళహస్తీశ్వరా !

కాళహస్తీశ్వర శతకము-- ధూర్జటి.

లోకంలో భక్తులు అనేక రకాలుగా కనిపిస్తారు. సుఖాలు వచ్చి నంతవరకూ ,తమకోరికలు తీరుతున్నంత వరకూ భగవంతుణ్ణి చాలా ఘనంగా పూజిస్తూ ఉంటారు.కాస్తంత కష్టంవచ్చిందా దేవుడు లేనేలేడనీ , ఉంటే యింత భక్తులమైన మమ్మల్ని

యిలా తిప్పలు పెడతాడా ?అనీ నిందిస్తూ ఉంటారు. అది భక్తికాదంటాడు ధూర్జటి. ఈపద్యంలో అదే వివరించాడు.

" ఓకాళహస్తీశ్వరా! నిన్ను ఆరాధించే సమయంలో నాకు కష్టాలు కలిగినా , సుఖాలే (భోగములు) భోగాలే కలిగినా, నన్ను గొప్పవాడని సంభావించినా , మహాత్ముడని మెచ్చుకొన్నా , సంసారమోహమే నన్ను ఆవరించినా , జ్ఙానము వరించినా , గ్రహగతులు వక్రించినా( గ్రహబాధలకు లోనయినా) మంచి జరిగినా , చెడుజరిగినా , అంతా నీయనుగ్రహముగానే భావిస్తాను. సుఖదుఃఖాదులను నీవొసగిన కానుకలు గానే , భూషణములుగానే స్వీకరిస్తాను. నన్ను అనుగ్రహించ వయ్యా!"- అంటున్నాడు.

ఇదిగో యిదీ పరిణతి చెందిన భక్తి. యెండకు రంగు వెలసిపోయే గుడ్డలా ,నీటికి కరగిపోయే సుద్ధలా, క్షణక్షణానికీ

రంగులు మార్చే ఊసర బిల్లిలా ఉంటే వాడేం భక్తుడూ? అదేంభక్తి ? అచంచల మైన విశ్వాసంతో పరమేశ్వరార్చన చేయండి.! కార్తీకమాస పవిత్రతను సొంతం చేసికోండి. పరమేశ్వరానుగ్రహం పొందండి! తథాస్తు!

 

 

ఛిన్నాపిరోహతి తరు: క్షీణోప్యుపచీయతే శ్చంద్ర:

ఇతి విమృశంతః  సంతః  సంతప్య౦తే న తే విపదా.

                  తా:-- చెట్లను కొట్టివేసిన మరల చిగురించు చున్నవి; క్షీణ చంద్రుడు మరల పరిపూర్ణుడగుచున్నాడు; ఇట్టి ఉదాహరణలు చూచిన  ఆపదలు కాపురముండవని తెలియుచున్నది కదా! కావున సత్పురుషులెన్నడూ ఆపత్సమయములో అధైర్యము నొందరు.

----------------------------------------

సంపత్తో కేవలం చిత్తం  సాధో రాపదికర్కశం 

సుకుమారం మధౌ పత్రం  తరో: స్యాత్ కఠినం శుచౌ 

              తా:--సాధుజనుల మనసు సంపదలతో కరుణతో బహు ఆర్ద్రములై యుండును, ఆపదలలో 

వజ్రమువలె కఠినముగా నుండును.  ఎలాగైతే వసంతకాలమునందు వృక్షములు మృదువైన చిగుళ్లు, ఆకులతో వుండి, గ్రీష్మము రాగానే మోడువారి ఉండడం చూస్తున్నాము గదా!

 

యస్మిన్ జీవతి జీవంతి బహవ స్సతు జీవతు

కాకోపి కిం న కురుతే చంచ్వా స్వోదర పూరణం

 

  తా:--  ఎవడు జీవించి వున్నచో పదిమందికి జీవిక కలుగుతూ వుంటుందో అట్టి వాని బ్రతుకే బ్రతుకు.కానీ కేవలం తన పొట్ట మాత్రమే నింపుకోను వానిది బ్రతుకు కాదు. కాకి మాత్రం

ఆ పని చేయడం లేదూ? కేవలం తనకోసమే కాకుండా యితరులకోసం బ్రతికే వాడే

ఉత్తముడు అని కవి యొక్క భావం

---------------------------------------

విప్రాణాం జ్ఞానతో జైష్ట్యం

క్షత్రియాణాం తు వీర్య:

వైశ్యానాం ధాన్య ధనదః

శూద్రాణా మేవ జన్మతః

                          తా:--    బ్రాహ్మణులలో పెద్దరికం వారి జ్ఞానము వల్లనే నిర్ణయించ బడుతుంది.క్షత్రియులలో

బలము, శౌర్యము చేతనే పెద్దరికం నిర్ణయించ బడుతుంది. వైశ్యు లలో ధనము,ధాన్యములతోనే తోనే పెద్దరికం నిర్ణయించ బడుతుంది. శూద్రులలో మాత్రమే వయస్సు చేత నే పెద్దరికం నిర్ణయించ బడుతుంది.

 

     ఏనాడైనను వినయము

   మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ 

   బూనకు మసమ్మతయు బహు

   మానమునను బొందు మిదియె మతము కుమారా!

 

ఓ కుమారా! ఎన్నడునూ వినయ స్వభావమును వీడరాదు. ఈర్ష్యా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు. పేదవారి కోపం పెదవికి చేటు అనే నానుడిని మనస్సునందుంచుకొని మెలగుము.అట్లు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలబ్బును. సన్మానాలు జరుగును.

 

 

ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా

రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ

కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా

త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.

 

భావం: పెద్దల కందఱికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశరథీ కరుణాపయోనిధీ.

కామెంట్‌లు లేవు: