14, నవంబర్ 2020, శనివారం

అరణ్యపర్వము – 25

 అరణ్యపర్వము – 25

సరస్వతీ గీత


బ్రాహ్మణ క్షత్రియ స్వరూపములు


ఆ తరువాత మార్కండేయుడు ” ధర్మజా! నీకు బ్రాహణ క్షత్రియ స్వరూపాలను గురించి చెప్తాను విను అని చెప్ప సాగాడు. పూర్వం అత్రి మహర్షి తపస్సు చేసు కోవడానికి అడవికి పోతూ భార్యను పిలిచి ” నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను. నీవు నీ పుత్రుల వద్ద ఉంటావా? నాతో వస్తావా? ” అని అడిగాడు. అందుకు ఆమె ” నాధా! పుత్రుల పోషణకు తగిన ఏర్పాటు చేయకుండా మీరు వెళ్ళడం ధర్మం కారు. కనుక మీరు వైన్యమహారాజును అడిగి కొంత ధనం తీసుకు రండి ” అన్నది. అది విని అత్రి వైన్యమహారాజు దగ్గరికి వెళ్ళి దగ్గరకు వెళ్ళాడు. ఆసమయంలో వైన్యమహారాజు అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు. అత్రి ఆయన దగ్గరకు వెళ్ళి ” రాజా ! నీవు బ్రహ్మదేవునితో సమానుడవు. ఇంద్రునితో సమానుడవు. నీవు సమస్త జనులకు ఈశ్వరుడవు. నీకు అన్ని ధర్మములు తెలియును. నీతో సమానమైన రాజు ఈ భీమి మీద లేడు. అందరూ ఋషులు నిన్ను పొగుడుతారు ” అన్నాడు. అక్కడే ఉన్న గౌతమ మహర్షి ఇది విని ఆగ్రహించి ” కేవలం ధనం కోసం జంకు లేకుండా మానవమాతృడైన రాజును ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అని పొగడటం తగునా? ” అని అన్నాడు. అత్రి ” ఏది యుక్తము ఏది యుక్తము కాదు అని తెలియకుండా మాట్లాడ వద్దు. నీతివంతుడై, పరాక్రమ వంతుడై, నిర్మలుడై సమస్త లోకాన్ని పాలించే రాజు ధర్మానికి మూలం అటువంటి రాజును ప్రశంసించడం నాకు తగదా? ” అని బదులు చెప్పాడు. గౌతముడు ” కేశములు తెల్లబడినంత మాత్రాన నీవు జ్ఞానివి కాదు. సభలో జ్ఞానవృద్ధులకు మాత్రమే విలువ కదా ” అన్నాడు. అత్రి గౌతముల వాదన విన్న కశ్యపుడు అనే మహాముని విని ” అయ్యా ! ఈ వివాధం మనం తీర్చలేము. సనత్కుమారుడు అనే మహామునిని అడుగుదాము ” అన్నాడు.


సనత్కుమారుని తీర్పు


తరువాత అందరూ సనత్కుమారుని దగ్గరకు పోయి అత్రి గౌతముల వాదన వివరించారు. సనత్కుమారుడు ” అత్రి నిజమే చెప్పాడు. ఈ భూమి సమస్తము తన భుజస్కందాల మీద మోసే సుక్షత్రియుడు అందరిని కాపాడే ప్రభువు. కనుక శత్రువులను సంహరించి అందరిని కాపాడే రాజే ఈశ్వరుడు, బ్రహ్మ. రాజు జనులందరికి పూజ్యుడు. అతని రక్షణలో సజ్జనులు, మునులు తమ తమ విధులు చక్కగా నెరవేర్చగలరు. అందరూ అతని ఆజ్ఞాబద్ధులే. రాజే సామ్రాట్టు, విరాట్టు అదృష్టాన్ని జయించిన వాడు. సత్యసంధుడు, ధర్మాత్ముడు, సక్రమంగా పాలించేవాడు అని వేదాలలో వర్ణించారు. పూర్వం అధర్మమునకు భయపడి బ్రాహ్మణులు తమ తేజస్సును రాజులయందు నిక్షేపించారు. అప్పటి నుండి బ్రాహ్మణ్యం వలన క్షాత్రం ప్రవర్తిసుంటుంది. కనుక బ్రాహ్మణ్యము క్షాత్రము ఒక దానిని ఒకటి ఆశ్రయించుకుని ఉన్నాయి. సూర్యుడు చీకటిని తరిమినట్లు క్షత్రియుడు బ్రాహ్మణులను సేవించి తేజోవంతుడై అధర్మాన్ని అణచి ధర్మాన్ని నిలబెడతాడు కనుక క్షత్రియుడు అధికం అని చెప్పవచ్చు ” అన్నాడు. అప్పుడు వైన్యమహారాజు అత్రికి కావలసినంత ధనం ఇచ్చాడు.


సరస్వతీ గీత


ఆ తరువాత మార్కండేయ మహర్షి ” సరస్వతి గీత గురించి చెప్పడం ప్రారంభించాడు. పూర్వం తార్క్ష్యుడు అనే మహాముని సరస్వతీ దేవిని ఆరాధించాడు. సరస్వతీ దేవి ప్రత్యక్షంకాగానే తార్క్ష్యుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు ” అమ్మా! మానవుడు ఆచరించ వలసిన ధర్మం ఏది? మానవుడు ఏవిధంగా పుణ్యాత్ముడై పుణ్య లోకాలకు వెళతాడు? ” అని అడిగాడు. సరస్వతీదేవి ఈ విధంగా జవాబిచ్చింది. ” ఎన్నో వేదములు చదివిన బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞాలు చేసి పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళతాడు. మంచి పాలు ఇచ్చే ఆవును దానంగా ఇచ్చే బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి పోతాడు. ఆవు శరీరం పై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. మంచి కోడె ఎద్దును దానం చేసిన వాడికి పది ఆవులను దానము చేసిన పుణ్యం లభిస్తుంది. వస్త్రదానం చేసిన వాడు చంద్రలోకం పోతాడు. బంగారం దానం చేసిన వాడు స్వర్గలోకం చేరతాడు. ఏడు సంవత్సరాలు అగ్నిదేవుని నేతితో ప్రీతిగా హోమం చేసిన వాడు తన పదునాలుగు తరాల పితృ దేవతలతో స్వర్గానికి పోతాడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటూ నిరంతరం అగ్ని హోత్రం చేసిన వాడు గోలోకం చేరతాడు. ఎందుకంటే అగ్నిహోత్రం నా స్వరూపం. సకల యజ్ఞ సంభారాలు నాకు సంభందించినవే. నేను అగ్నిహోత్రం ముఖంనుండి పుట్టాను. నేను విద్వాంశులందరి సందేహం తీర్చగలను. ఎల్లప్పుడూ వేదం చదువుతూ దాన ధర్మములు చేయు తపోధనులు శోకము అనేది తెలియకుండా ఎక్కడ నివసిస్తారో నేను అక్కడ నివసిస్తాను. యగ్న యాగాదులు చేసిన పుణ్యాత్ములు మరణానంతరం నా లోకానికి చేరగలరు ” అని సరస్వతి చెప్పింది ” ధర్మరాజుకు చెప్పాడు.

కామెంట్‌లు లేవు: