14, నవంబర్ 2020, శనివారం

అరణ్యపర్వము – 26

 అరణ్యపర్వము – 26


వైవస్వత మనువు వృత్తాంతం


ధర్మరాజు మార్కండేయుని ” వైవసత్వ మనువు ఏ విధంగా ప్రభావితుడైయ్యాడు ” అని అడిగాడు. మార్కండేయుడు ” ధర్మజా! చాక్షుస మన్వంతరంలో వైవసత్వుడు పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. ఒకరోజు వైవసత్వుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప తీరానికి దగ్గరగా వచ్చి ” అయ్యా ! ఈ జలాశయంలో నా కంటే బలవత్తరమైన జలచరములు ఉన్నాయి. నన్ను వేరే చోటికి తీసుకు పో. నీకు నేను ఉపకారం చేస్తాను ” అని అడిగింది. వైవసత్వుడు ఆ చేపను తీసుకు వెళ్ళి ఒక బావిలో విడిచిపెట్టాడు. ఆ చేప పెద్దది అయింది ” అయ్యా! నాకు ఈ బావి చాలడం లేదు వేరే ప్రదేశానికి తీసుకు వెళ్ళు అని అడిగింది.


అది విని వైవసత్వుడు ఆచేపను మరింత పెద్ద బావిలో విడిచిపెట్టాడు. కొన్నాళ్ళకు ఆ బావి కూడా చాలలేదు. ఆ చేప కోరిక మేరకు దానిని ఒక మడుగులో వదిలి వేసాడు. కొద్ది రోజులకు ఆ మడుగు కూడా చాలకపోవడంతో దానిని సముద్రంలో వదిలి వేసాడు. ఆ చేప వైవసత్వుని చూసి ” అయ్యా! కొద్ది రోజులలో ప్రళయం రాబోతుంది. అన్ని సముద్రాలు కలవబోతున్నాయి . దీనిని మన్వంతర సంధి అంటారు. నీవు ఒక ఓడను నిర్మించు అందులో అన్ని రకాల ధాన్యాలు, ఔషధాలు నింపు. సప్తఋషులతో కలసి ఆ ఓడ ఎక్కి నన్ను తలచుకో. నేను నీకు మేలు చేస్తాను ” అని చెప్పింది.


వైవసత్వుడు అలాగే ఒక ఓడను నిర్మించి ధాన్యాలతోను, విత్తనాలతోనూ నింపి సప్తఋషులతో సముద్రాన్ని చేరాడు. ఆ చేపను మనసులో తలిచాడు. ఇంతలో ఆ చేప వచ్చింది. ఆచేప తలపై ఒక కొమ్ము ఉంది. ఆ ఓడ తాటిని తన కొమ్ముకు తగిలించుకుని సముద్ర మధ్యానికి తీసుకు వెళ్ళింది. ఆ తరువాత కుంభవృష్టి కురవడం మొదలై సముద్రాలన్నీ ఏకం అయ్యాయి. భూమి జలమయం అయ్యింది. ఆ చేప అనేక వేల సంవత్సరాలు ఆ ఓడను లాగుతూ ఉంది. ప్రళయం అంతరించింది. ఆ చేప వైవసత్వుని సప్తఋషులను చూసి “అయ్యా! ప్రళయ కాలంలో నేను మిమ్మల్ని కాపాడాను. ఈ వైవసత్వుడు మరలా సృష్టి కొనసాగించగలడు ” అని చెప్పింది ” అని ధర్మరాజుతో చెప్పాడు.


కల్పాంతం

ధర్మరాజు మార్కండేయుని ” మహర్షీ ! నీవు చిరంజీవివి ఎన్నో ప్రళయాలు చూసావు. ఈ చరాచర జీవరాశుల సృష్టి స్థితి లయలను ఎన్నో సార్లు చూసావు. ఈ లోకాలు ప్రళయకాలంలో ఎలా ఉంటాయి? ” అని అడిగాడు. మార్కండేయుడు ” ధర్మజా! నూవు అడిగిన ఈ ప్రశ్నకు సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపమని చెప్ప బడుతున్న శ్రీకృష్ణుని అనుమతితో సమాధానం చెబుతున్నాను. సావధానంగా వినుము ” అని చెప్పసాగాడు. ” కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగములు. ఇవి పన్నెండు వేల దివ్య సంవత్సరములు. ఈ నాలుగు యుగములు కలసి ఒక మహా యుగం అని పిలువబడతాయి. ఇలాంటి మహా యుగాలు వెయ్యి కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు ఔతుంది.


అలాంటి బ్రహ్మదివసము ఆఖరున నూరు సంవత్సరాల వరకు తీవ్ర అనావృష్టి ఏర్పడుతుంది. సూర్యుడు తీవ్రంగా ఉంటాడు. విపరీతమైన గాలులు వీస్తాయి. అంతలోనే మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది. నదులు సముద్రాలు నిండి పోతాయి. అనావృష్టి అంతరించి అతి వృష్టి వస్తుంది. భూభాగమంతా జలమయం ఔతుంది. గాఢాంధకారం భూమండల మంతా వ్యాపిస్తుంది. ఇంతలో బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఆ మేఘాలను విపరీతమైన గాలి వీచే చెదరగొడతాయి. బ్రహ్మదేవుడు అప్పుడు ఆ ఘోరమైన నీటి మధ్య పద్మంపై నిద్రిస్తాడు. ఈ విధంగా కల్పాంతం ఔతుంది. ఇలాంటి కల్పాలు ఎన్నో గడిచాయి. ఇక ముందు ఎన్నో రానున్నాయి.

కామెంట్‌లు లేవు: