14, నవంబర్ 2020, శనివారం

17-18-గీతా మకరందము

 17-18-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రాజసిక తపస్సును గూర్చి చెప్పుచున్నారు -


సత్కారమానపూజార్థం 

తపో దమ్భేన చైవ యత్ | 

క్రియతే తదిహ ప్రోక్తం 

రాజసం చలమ ధ్రువమ్ ||


తాత్పర్యము:- ఇతరులచే తాను సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని డంబముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై, అనిశ్చితమైనట్టి ఫలముగలది (లేక చపలమైనట్టి రూపముగలది) ఈ ప్రపంచమున రాజసిక తపస్సు అని చెప్పబడినది.


వ్యాఖ్య:- కొందఱు తమ తపస్సునుజూచి ఇతరులు తమ్ము సత్కరించెదరను భావముతో తపస్సుచేయ నారంభింతురు. అది సదుద్దేశ్యముతోను, హృదయపూర్వకముగను స్థిరమైయుండదు. దాని ఫలితమున్ను అట్లే చపలముగ, అనిశ్చితముగ నుండును. కావున విజ్ఞులిద్దాని ననుసరించరాదు.


ఒరసబ్5:- రాజసతపస్సు ఎట్టిది?

ఉత్తరము:- సత్కారమానపూజాదులకొఱకై డంబముతో చేయబడునది రాజసతపస్సనబడును. 

ప్రశ్న:- అది యెట్టి ఫలితము గలిగియుండును? ఎట్టి స్వరూపము గలిగియుండును?

ఉత్తరము:- అస్థిరమై అనిశ్చితమైనట్టి ఫలము గలిగియుండును. చంచల, అనిశ్చితస్వరూపము గలిగియుండును.

కామెంట్‌లు లేవు: