13, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -24


పూర్వ సఖుని ఉవాచ 


వైదర్భి తాను భర్తతో సహగమనం చేయటానికి పూనుకున్నది. అంతలో పురంజనునకు పూర్వసఖుడు, జ్ఞాని అయిన అవిజ్ఞాతుడు అనే బ్రాహ్మణుడు ఆమెను కలవడానికి…వచ్చి ఆమెను మంచిమాటలతో ఓదారుస్తూ ఇలా అన్నాడు “వనితా! నీ వెవరు? ఎవరి దానవు? ఇత డెవరు? ఇతని కోసం ఎందుకు దుఃఖిస్తున్నావు?” అని ప్రశ్నించి ఇంకా ఇలా అన్నాడు “నేను నీ మిత్రుడను. ఈ సృష్టికి పూర్వం నీవు ఎవరి స్నేహంతో ఎడతెగని సౌఖ్యములను అనుభవించావో ఆ స్నేహితుడను నేను. నీవు నన్ను ఎరిగినా, ఎరుగక పోయినా నన్ను పూర్వమిత్రునిగా తెలుసుకో.

నీవు, నేను పూర్వం మానస సరస్సులో నివసించే హంసలం. మనం మిత్రులమై మన నివాసాన్ని విడిచి వేయి సంవత్సరాలు సంచరించాము. నీవు నన్ను వదలిపెట్టి క్షుద్రసుఖాలను, అధికారాన్ని కోరి భూమండలంలో తిరిగావు. అప్పుడు కామినీ నిర్మితం, పంచారామం, నవద్వారం, ఏకపాలకం, త్రికోష్ఠకం, షట్కులం, పంచవిపణం, పంచప్రకృతి, స్త్రీనాయకం అయిన ఒక పురాన్ని చూశావు. అది ఎలాంటిదో వివరిస్తాను విను. పంచారామాలంటే పంచేంద్రియార్థాలైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి ఐదు. నవద్వారాలంటే ముక్కు మొదలైన తొమ్మిది రంధ్రాలు. ఏకపాలకం అంటే ప్రాణం. త్రికోష్ఠాలు అంటే భూమి, జలం, అగ్ని అనేవి. షట్కులం అంటే నాలుక, కన్ను, చెవి, ముక్కు, చర్మం, మనస్సు అనే జ్ఞానేంద్రియాలు. పంచవిపణాలు అంటే వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు. పంచప్రకృతి అంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు. కామిని అంటే బుద్ధి. ఇటువంటి పురం(దేహం)లో స్త్రీకాముకుడవు, అజ్ఞుడవు అయి నీవు ప్రవేశించావు. నీవు ఆ కామినికి చిక్కి ఆమెతో క్రీడిస్తూ, ఆమె సంగమం చేత స్మృతిని కోల్పోయి ఈ మహాపాపదశను పొందావు. కాబట్టి…నీవు విదర్భరాజు పుత్రికవు కావు. ఈ మలయధ్వజుడు నీకు మగడు కాడు. పూర్వజన్మలో పురంలో నివసించిన ఆ పురంజనుడవు కావు. నీవు ఈ జన్మలో ఇతని భార్యను అని, పూర్వజన్మలో పురుషుడను అని అనుకోవటం కూడా అసత్యమే. ఇదంతా నేను నా మాయచేత సృష్టించాను. మనం ఇద్దరం పూర్వం హంసలం (పరమ పరిశుద్ధులం) అని చెప్పాను కదా! మన స్వరూపాన్ని చూడు. నేనే నీవు. నీవే నేను. అంతేకాని వేరుకాదు. పండితులు మనలో తేడాను చూడరు. ఒక్కటే అయినా అద్దంలో ప్రతిబింబించే రూపమూ, బింబరూపమూ వేరుగా తోచినట్లు మన ఇద్దరికీ భేదం లేకున్నా భేదం ఉన్నట్లు కనిపిస్తుంది” ఈ విధంగా అవిజ్ఞాతుడు చేసిన బోధవల్ల తేరుకొని అతని ఎడబాటువల్ల తాను కోల్పోయిన జ్ఞానాన్ని వైదర్భి రూపంలో ఉన్న పురంజనుడు పొందాడు” అని చెప్పి నారదుడు ప్రాచీనబర్హిని చూచి “ఈ ఆధ్యాత్మతత్త్వాన్ని రాజుకథ నెపంతో నీకు చెప్పాను” అని చెప్పగా…ప్రాచీనబర్హి నారదమహర్షితో ఇలా అన్నాడు “నీ మాటలు పండితులు తప్ప కర్మబద్ధులమై దుఃఖించే మేము ఎలా తెలుసుకోగలం? కాబట్టి నాకు వివరించి చెప్పు” అనిన ప్రాచీనబర్హితో నారదుడు ఇలా అన్నాడు “రాజేంద్రా! ఏ కారణం చేత ఒక పాదం కలది (చెట్టు), రెండు పాదాలు కలది (మానవుడు, పక్షి), మూడు పాదాలు కలది, నాలుగు పాదాలు కలది (జంతువు), పెక్కు పాదాలు కలది (కీటకం), పాదాలు లేనిది (పాము) అయి పెక్కురకాలుగా చేతనతో కూడిన జీవునివల్ల దేహం వ్యక్తమవుతుందో ఆ కారణంచేత పురంజనుడు పురుషు డయ్యాడు. ఆ పురుషునికి నామ క్రియాగుణాలచే తెలియబడ్డ అవిజ్ఞాతుడు అనే మిత్రుడే ఈశ్వరుడు. పురుషుడు తొమ్మిది ద్వారాలతోను, రెండు చేతులతోను, పాదాలతోను కూడిన దోషరహితమైన దేహంలో ప్రవేశించాలని కోరుకుంటాడు. కాబట్టి పురం అంటే దేహం. పురుషుడు బుద్ధిని ఆశ్రయించి ఇంద్రియాలచేత విషయసుఖాలను అనుభవిస్తాడు. అహంకార మమకారాలను పొందుతాడు. కాబట్టి ఉత్తమ స్త్రీ అంటే బుద్ధి. ఆ బుద్ధికి స్నేహితులు అంటే జ్ఞాన, కర్మ కారణాలైన ఇంద్రియ గుణాలు. చెలికత్తెలంటే ఇంద్రియ వ్యాపారాలు. అయిదు తలల పాము అంటే పంచవృత్తి అయిన ప్రాణం. పదకొండుమంది మహాభటులు అంటే జ్ఞాన కర్మేంద్రియాలు పది, వాటిని ప్రేరేపించే మనస్సు (బృహద్బలుడు). తొమ్మిది ద్వారాలతో కూడిన ఆ పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశాలు అంటే శబ్దం మొదలైన పంచ విషయాలు. నవద్వారాలు అంటే రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు, రెండు చెవులు, గుదం, మగగురి. అందులో రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు ఈ ఐదు తూర్పున ఉండే ద్వారాలు. కుడి చెవి దక్షిణ ద్వారం. ఎడమచెవి ఉత్తర ద్వారం. గుదం, శిశ్నం అనేవి రెండు పడమటి ద్వారాలు. అందులో ఒకేచోట నిర్మింపబడిన ఖద్యోత, ఆవిర్ముఖి అంటే కన్నులు. విభ్రాజితం అంటే రూపం. ద్యుమంతుడు అంటే నేత్రేంద్రియం. నళిని, నాళిని అంటే ముక్కు రంధ్రాలు. సౌరభం అంటే గంధం. అవధూత అంటే ఘ్రాణేంద్రియం. ముఖ్య అంటే నోరు. విపణం అంటే వాగింద్రియం. రసజ్ఞుడు అంటే రసనేంద్రియం. ఆపణం అంటే సంభాషణం. బహూదనం అంటే పలురకాలైన అన్నం. పితృహువు అంటే కుడిచెవి. దేవహువు అంటే ఎడమ చెవి. చంద్రవేగుడు అంటే కాలాన్ని సూచించే సంవత్సరం. గంధర్వులు అంటే పగళ్ళు. గంధర్వీజనులు అంటే రాత్రులు. పరీవర్తనం అంటే ఆయుఃక్షయం. కాలకన్యక అంటే ముసలితనం. యవనేశ్వరుడు అంటే మృత్యువు. అతని సైనికులు ఆధివ్యాధులు. ప్రజ్వారుడు అంటే వేగంగా చావును కలిగించే జ్వరం. శీతం, ఉష్ణం అనే ఈ జ్వరం రెండు రకాలు. దక్షిణ పాంచాలం అంటే పితృలోకాన్ని పొందించేదీ, ప్రవృత్తి రూపకమూ అయిన శాస్త్రం. ఉత్తర పాంచాలం అంటే దేవలోకాన్ని పొందించేదీ, నివృత్తి రూపకమూ అయిన శాస్త్రం. శ్రుతధరుడు అంటే చెవి. ఆసురి అనే పేరు కలిగిన పడమటి ద్వారం శిశ్నం. గ్రామకం అంటే రతి. దుర్మదుడు అంటే యోని. నిరృతి అనే పేరు కలిగిన పడమటి ద్వారం గుదం. వైశసం అంటే నరకం. లుబ్ధకుడు అంటే మలద్వారం. సంధులు అంటే చేతులు కాళ్ళు. అంతఃపురం అంటే హృదయం. విషూచి అంటే మనస్సు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

పుణ్యాత్మా! విను. భార్యాపుత్రులు అనే గుణలిప్తమైన బుద్ధితత్త్వం ఏయే విధంగా వికారాన్ని పొందుతుందో, ఏయే విధాలుగా ఇంద్రియాలు వికారాన్ని పొందుతాయో ఆ గుణాలు కలిగి ఆ వృత్తులను అనగా తమస్సత్త్వరజోధర్మలైన మోహ, ప్రసాద, హర్షాలను బలవంతంగా పురంజనుడు అనుకరించేవాడు” అని చెప్పి యోగివర్యుడైన నారదుడు రాజశ్రేష్ఠుడైన ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు

ఇంకా రథం అంటే శరీరం. గుఱ్ఱాలు అంటే ఇంద్రియాలు. రెండు యుగాలు అంటే సంవత్సరం, దాని చేత ఏర్పడిన వయస్సు. రెండు చక్రాలు అంటే పుణ్యపాప కర్మలు. మూడు జెండాలు అంటే త్రిగుణాలు. పంచబంధనాలు అంటే పంచప్రాణాలు. పగ్గం అంటే మనస్సు. సారథి అంటే బుద్ధి. గూడు అంటే హృదయం. రెండు నొగలు అంటే శోకమోహాలు. పంచప్రహరణాలు అంటే ఐదు ఇంద్రియార్థాలు. పంచవిక్రమాలు అంటే కర్మేంద్రియాలు. సప్త వరూధాలు అంటే రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు ధాతువులు. స్వర్ణాభరణం అంటే రజోగుణం. అక్షయ తూణీరం అంటే అనంత వాసనాహంకార ఉపాధి. ఏకాదశ సేనాపతి అంటే పది ఇంద్రియాలు, మనస్సు. ఆసురీవృత్తి అంటే బాహ్య విక్రమం. పంచేంద్రియాల చేత హింసాదులను చేసి విషయాలను అనుభవించడమే వేట. పురుషుడు దేహంతో స్వప్న సుషుప్తి జాగ్రదవస్థలతో ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలైన బహువిధ దుఃఖాలచేత కష్టాలను అనుభవిస్తాడు. అజ్ఞానం చేత కప్పబడి నిర్గుణుడు ఐనా ప్రాణేంద్రియ మనోధర్మాలను తనలో ఆరోపించి కామలేశాలను ధ్యానిస్తూ, అహంకార మమకారాలతో కూడ వందయేండ్లు కర్మలను ఆచరిస్తాడు. పురుషుడు తాను స్వయంప్రకాశుడనీ, ప్రకృతికి పరుడైన పరమాత్ముడనీ, గురుడనీ తెలుసుకోలేక ప్రకృతి గుణాలలో…ఎప్పుడైతే అలా ప్రకృతి గుణాలలో ఆసక్తుడు ఔతాడో, అప్పుడు మానవుడు గుణాభిమాని అయి, త్రిగుణాలకు సంబంధించిన కర్మలలో మునిగి తేలుతూ, కర్మవశుడు అయి ఉంటాడు. …సాత్త్విక కర్మల వల్ల ప్రకాశ భూయిష్ఠాలైన లోకాలను, రాజస కర్మల వల్ల దుఃఖ భూయిష్ఠాలైన లోకాలను, తామస కర్మల వల్ల తమశ్శోకమోహ భూయిష్ఠాలైన లోకాలను పొందుతాడు. ఒకప్పుడు పురుషుడై, ఒకప్పుడు స్త్రీయై, ఒకప్పుడు నపుంసకుడై ఆయా కర్మలకు తగినట్లు దేవ, మనుష్య, తిర్యక్ రూపాలతో జన్మిస్తాడు. ఈ విధంగా కామాసక్తుడైన పురుషుడు పుడుతూ, చస్తూ, మళ్ళీ పుడుతూ ఉన్నత స్థానాలను, నీచ స్థానాలను పొందుతూ ఉంటాడు.అని ఇంకా ఇలా అన్నాడు. ఆకలి బాధతో కుక్క ఇంటింటికీ తిరిగి దైవికంగా కఱ్ఱ దెబ్బలనో, దొంగకూడునో తిన్నట్లు జీవుడు దైవికంగా ప్రాప్తించిన ప్రియాప్రియాలను మూడు లోకాలలోను అనుభవిస్తాడు.

ఇటువంటి దుఃఖాలకు ప్రతిక్రియ లేదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. బరువు మోసే నిరుపేద తన తలమీది బరువును భుజం మీదికి మార్చుకున్నా దాన్ని మోయటం వల్ల కలిగే దుఃఖాన్ని తప్పించుకోలేడు. అలాగే జీవుడు మూడు రకాలైన దుఃఖాన్ని తప్పించుకోలేడు.

కలలో మళ్ళీ కల వచ్చినట్లు పురుషుడు దుఃఖాన్ని కలిగించే కర్మం, ప్రతీకార కర్మం అవిద్యచేత కలిగి….సహవాసం వల్ల నాశనం చెందేవి కావు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. రాజా! విను. దేహం స్వప్నం వలె అజ్ఞానంవల్ల ప్రాప్తిస్తుంది కాబట్టి అసత్యమైనదే కదా! దానిని ప్రయాసపడి తొలగించుకోవటం ఎందుకు అని అనరాదు. ప్రయోజనం లేకపోయినా కలలో ఉపాధితో కూడిన మనస్సు పురుషుని ఆశ్రయించి మెలకువ వచ్చిన తరువాత కూడా స్వప్న సంసారాన్ని విడిచిపెట్టదు. అలాగే వైరాగ్య చేత అజ్ఞానాన్ని తొలగించుకోలేక పోయినా, భార్యను శరీరాన్ని విడిచిపెట్ట లేకపోయినా సంసారం నుండి విడుదల లేదు. పరమ పురుషార్థం అనదగిన ఆత్మకు ఏ కారణం వల్లనైనా అనర్థాలను కలిగించే సంసారం కలుగుతుందో, ఆ కారణాన్ని జగద్గురుడైన వాసుదేవుని పాదపద్మాలమీది భక్తి నశింపజేస్తుంది. పుణ్యాత్మా! వాసుదేవుని మీది పరిశుద్ధమైన భక్తి, శాశ్వతము లైన వైరాగ్య జ్ఞాములను కలిగిస్తుంది. ఆ భక్తికి నెలవు గోవిందుని గొప్ప కథలను ఆశ్రయించి ఉంటుంది. కావున ఆ భక్తి ఎల్లప్పుడు వాసుదేవుని కథలను వినడం వలన, గానం చేయడం వలన కలుగుతుంది. ఇంకా…సాధుశీలురు, విమల మనస్కులు భగవంతుని గుణాలను కీర్తించటం చేత, వినటం చేస్త పరిశుద్ధమైన మనస్సు కలిగిన భక్తుల సభలలో మహాత్ముల నోట వెలువడిన రసవంతాలైన, గొప్పవైన విష్ణుకథలు అనే ప్రవాహాన్ని ఎంతో ఇష్టంతో…

చెవులు అనే దోసిళ్ళతో తనివి తీరా త్రాగే పుణ్యులకు ఆకలి, దాహం, భయం, శోకం, విమోహం సోకవు.

కావున ఇటువంటి సత్సంగం లేకుండా స్వయంగా భగవంతుని గుణాలను వర్ణించడం, కథలని వినడం వలన భక్తి కలుగదు. సహజాలైన ఆకలి దప్పుల చేత బాధపడే జీవులకు సోమరితనం వల్ల, రసావేశం లేనందువల్ల హరికథామృత పానంలో ఆసక్తి కలుగదు. ఇది నిశ్చయం” అని చెప్పి నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు. పుణ్యాత్మా! బ్రహ్మ, మహేశ్వరుడు, మనువులు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సనకాది మునులు, పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, అంగిరసుడు, వసిష్ఠుడు, నేను వేదాంతులం, వాచస్పతులం, తపోయోగవిద్యా సమాధులు అనే ఉపాయాలతో ఆలోచించేవారం. అయినా సర్వసాక్షి అయిన పరమాత్ముని చూడలేము.

అది ఎలా అంటే…మిక్కిలి విస్తారమైనదీ, అంతు లేనిదీ, అద్వితీయమైనదీ అయిన వేదాన్ని అనుసరించి మంత్రాలచేత పెక్కు దేవతలను ఆరాధిస్తూ ఇంద్రాది దేవతలను ఇష్టదైవతాలుగా భజించేవారు సర్వేశ్వరుడైన పరమాత్మను దర్శింపగలరా? రాజా! విను. మనస్సులో భావింపదగిన భగవంతుడు ఎప్పుడు, ఎవరిని అనుగ్రహిస్తాడో వాడు మహితాత్ముడై…లోక వ్యవహారంలోను, వైదిక కర్మాచరణంలోను నెలకొన్న బుద్ధిని త్యజిస్తాడు. కాబట్టి రాజేంద్రా! పరమార్థాల వలె కనిపిస్తూ, ఆసక్తి కల్పిస్తూ, వినటానికి ఇంపై, అవాస్తవాలైన ఈ వివిధ కర్మలను పరమార్థాలు అని అనుకోకు. మలిన బుద్ధులు జనార్దనుని ప్రతిపాదించే వేదాన్ని కర్మపరమని వాదిస్తారు. వారు వేదతత్త్వం తెలిసినవారు కారు. తూర్పువైపు కొనలు గల దర్భలను భూమండలమంతా పరచి అహంకారంతో, అవినయంతో అనేక పశువులను బలి చేశావు. కర్మ స్వరూపాన్ని విద్యాస్వరూపాన్ని తెలిసికోలేక పోయావు. ఆ కర్మ విద్యాస్వరూపాలను గురించి చెపుతాను విను. హరికి సంతోషాన్ని కలిగించేదే కర్మ. భగవంతునిపై మతిని నెలకొల్పేదే విద్య. హరియే దేహులకు ఆత్మ. హరియే పరమాత్మ. భద్రతను కోరేవారికి హరిపాద మూలమే శరణం. హరిని పరమ ప్రియునిగా భావించి కొలిచే వారికి ఆవంత ఐనా దుఃఖం కలుగదు. భగవత్సరూపాన్ని తెలిసికొన్నవాడే విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరి” అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు. రాజా! నీ ప్రశ్నకు పూర్తిగా సమాధానం చెప్పాు. ఇక ఒక రహస్యం వివరిస్తాను. సావధానంగా విను.అందమైన పూలతోటలో హాయిగా విహరిస్తూ చిన్నారి పూలతేనెలకు, కమ్మని సువాసనలకు, జుమ్మనే తుమ్మెద పాటలకు ప్రీతి చెందుతూ ఒక మగలేడి ఆడులేడితో కలిసి నెమ్మదిగా సంచరిస్తున్నది. దాని మనస్సు ఆడలేడి మీదనే నిమగ్నమై ఉంది. ఆ మగలేడికి ముందుభాగంలో ప్రాణాలకు హాని కలిగించే తోడేళ్ళ గుంపు తిరుగుతున్నది. ఇంతలో వెనుకనుండి ఒక బోయవాడు విడిచిన వాణి బాణం లేడి పృష్ఠభాగాన్ని చీల్చి వేసింది. తప్పించుకొనే దారిలేక ఆ మగలేడి అడవిలో మృత్యువు పాలయింది. రాజేంద్రా! విను. పురుషుడు ఆ మగలేడి వంటివాడే. పురుషుడు స్త్రీల యిండ్లను ఆశ్రయించి క్షుద్రమై, కామ్యపరిపాకం నుండి పుట్టిన జిహ్వ, ఉపస్థ మొదలైన కామ జనిత సుఖలేశాన్ని అన్వేషిస్తాడు. స్త్రీయందే మనస్సు నిల్పి మనస్సును కొల్లగొట్టే స్త్రీల మాటలను వినగోరుతాడు. కళ్ళముందే తోడేళ్ళ గుంపులాగా ఆయుస్సును హరించే రాత్రింబవళ్ళను లెక్కచేయడు. వెనుకనుండి బోయవాని వంటి యముడు శరీరాన్ని చీల్చివేస్తుండగా జీవుడు విహరిస్తాడు. కాబట్టి నీవు ఈ జీవుని లేడివంటి చేష్టలు కలవానిగా భావించు. బాహ్యవ్యాపారా లైన శ్రౌతస్మార్తాది రూపకర్మలను హృదయంలో నిగ్రహించు. అతి కాముకుల గాథలతో కూడిన సంసారాన్ని విడిచిపెట్టి, సర్వజీవులకు దిక్కైన భగవంతుని సేవించు. సంపూర్ణ విరక్తిని పొందు” అని నారదుడు చెప్పగా ప్రాచీనబర్హి ఇలా అన్నాడు.మునీంద్రా! భగవంతుడవు, మేటి జ్ఞానివి అయిన నీవు చెప్పిన ఆత్మ తత్త్వాన్ని… విని బాగా ఆలోచించాను. నాకు కర్మను బోధించిన ఆచార్యులకు ఈ ఆత్మతత్త్వం తెలియదు. తెలిస్తే కర్మని ఉపదేశింపరు కదా! ఆ ఆచార్యుల ఉపదేశం చేత నాకు ఆత్మతత్త్వం విషయంలో కలిగిన మహాసంశయం నీ వల్ల పటాపంచలయింది” అని ఇంకా ఇలా అన్నాడు. పుణ్యాత్మా! ఇంద్రియ వృత్తులలో అప్రవృత్తులై ఋషులు మోహించే అర్థం గురించి నాకు సంశయం కలుగుతున్నది. పురుషుడు ఏ దేహం చేత కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి తాను మరొక దేహాన్ని ధరించి మరొక లోకాన్ని చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెపుతారు. ఇది ఎలా పొసగుతుంది? 

అంతేకాదు. చేసిన వేదోక్తమైన కర్మ ఆ క్షణంలోనే నశిస్తుంది కదా! ఇంక జీవుడు మరొక దేహం పొంది లోకాంతరంలో ఎలా అనుభవించగలడు?” అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు “రాజా! లింగశరీరాన్ని ఆశ్రయించి ఉండే జీవుడు కలలో జాగ్రద్దేహాభిమానాన్ని విడిచి, అటువంటిదో లేక అటువంటిది కానిదో అయిన మరొక శరీరం పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో ఆ హితమైన కర్మని ఆచరిస్తాడు. అలాగే జీవుడు ఏ లింగ శరీరం చేత కర్మని చేస్తాడో ఆ లింగశరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భిన్న దేహాన్ని పొందడు. ఇవ్వటం, పుచ్చుకొనడం మొదలైన వానిలో స్థూల దేహానికి కర్తృత్వం ఉన్నదని భ్రమించకూడదు. జీవుడు అహంకారంతోను మమకారంతోను కూడినవాడు. ఆ జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో, ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మని అనుభవిస్తాడు. అలా కాకుంటే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు. కాబట్టి మనః ప్రధానమైన లింగశరీరానికే కర్తృత్వం పొసగుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. జ్ఞానరూపాలు, కర్మరూపాలు అయిన ఇంద్రియాల కర్మ ప్రపంచంచేత చిత్తాన్ని ఊహింపవచ్చు. అలాగే చిత్త వృత్తులను బట్టి పూర్వదేహం చేత చేయబడిన కర్మలను 

ఊహించవచ్చు. అది ఎలాగంటే దేహం చేత అనుభవింపబడనిది, చూడబడనిది, వినబడనిది అయినట్టిది, వాసనాశ్రయుడైన జీవునికి పూర్వ దేహంలో అనుభవింపబడినది, చూడబడినది, వినబడినది అవుతుంది. అనుభవింపబడిన విషయం మనస్సులో స్ఫురించదు. ఈ మనస్సే జీవులకు శుభాశుభాలకు కారణమైన పూర్వపర దేహాలను తెలుపుతుంది. ఈ మనస్సులో చూడబడనిది, వినబడనిది అయిన విషయం కలలో కనిపించే మాట నిజమే. కాని ఆ కల దేశకాల క్రియలను ఆశ్రయించి ఉంటుంది. సమస్త విషయాలు క్రమాన్ని అనుసరించి మనస్సుచేత అనుభవింపబడతాయి. శుద్ధ సత్త్వగుణం కలిగి వాసుదేవుని ఉత్తమ గుణాలను ధ్యానించటంలో నిమగ్నమైన మనస్సులో, గ్రహణం నాడు చంద్రమండలంలో రాహువు కనిపించినట్లు ప్రపంచం సర్వం కనిపిస్తుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “స్థూలదేహం ద్వారానే లింగదేహం కర్తృత్వ భోక్తృత్వాలు పొందటం చేత స్థూలదేహం నశించగానే జీవునికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. కాబట్టి ముక్తి కలుగుతుంది అని చెప్పటం సరికాదు. లింగశరీరం ఎందాక ఉంటుందో అందాక స్థూలదేహంతో జీవునికి సంబంధం ఉంటుంది. గాఢనిద్ర, మూర్ఛ మొదలైన వానిలో అహంకారం ఉన్నప్పటికీ ప్రకాశించదు. అమావాస్యనాడు చంద్రునిలాగా బాల్యంలో అహంకారం స్పష్టపడదు. స్థూలదేహంతో ఎడబాటు ఉండదు. కాబట్టి అర్థం లేకపోయినా విషయాసక్తుడైన వానికి కలలో అనర్థ దర్శనం కలిగినట్లు సంసారం (జన్మ) ఉడుగదు. ఈ విధంగా లింగ శరీరాన్ని ఆశ్రయించి చైతన్యాన్ని కలిగించే పురుషుడే జీవుడు అని చెప్పబడతాడు. ఇంకా…పురుషుడు ఈ లింగశరీరం చేత ఒక స్థూలదేహాన్ని విడిచి, మరొక దేహాన్ని పొందుతూ, తిరిగి దానిని విడిచిపెడుతూ సుఖ దుఃఖ భయ మోహ శోకాలను ఈ లింగదేహం చేతనే అనుభవిస్తాడు. జలగ తన ముందున్న తృణాన్ని పట్టుకొని ఆ తరువాతనే వెనుకటి తృణాన్ని విడిచిపెడుతుంది. అలాగే జీవుడు కొంతకాలం బ్రతికి చనిపోతూ మరొక దేహం పొందిన తరువాతనే పూర్వదేహాన్ని విడిచిపెడతాడు. కాబట్టి మనస్సే జన్మకు హేతువు. రాజా! కాబట్టి మనస్సే జీవులందరికీ జన్మకారణం. కర్మ వశాన అవిద్య కలుగుతుంది. అవిద్య చేత దేహానికి కర్మబంధం కలుగుతుంది. కర్మబంధం వల్ల బహు జన్మలను పొందక తప్పదు సుమా! రాజా! విను. కనుక అటువంటి అవిద్యను నాశనం చేయడానికి లక్ష్మీపతి, సృష్టి స్థితి లయ కారకుడు, కమలలోచనుడు, పరమేశ్వరుడు అయిన వాసుదేవుని ఈ జగత్తుకంతటికీ ఆత్మరూపంగా భావించి సేవిస్తూ ఉండు”.అని ఈ విధంగా భక్త శ్రేష్ఠుడైన నారదుడు ప్రాచీనబర్హికి జీవేశ్వరుల తత్త్వాన్ని తెలిపి సిద్ధలోకానికి వెళ్ళాడు.రాజర్షి అయిన ప్రాచీనబర్హి ప్రజారక్షణకు కొడుకులని నియోగించి, తప్పస్సు చేయటానికి కపిలాశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ముక్తసంగుడై, ఏకాగ్రచిత్తంతో, సద్భక్తియోగంతో గోవిందుని పాదపద్మాలను ఆరాధించాడు. బ్రహ్మ రుద్రాదులకు పొంద శక్యంకాని అవ్యయానందమయమైన పదాన్ని పొందాడు” అని మైత్రేయుడు విదురునితో చెప్పి…

(మైత్రేయుడు విదురునితో) ఇంకా ఇలా అన్నాడు. “నారదముని బోధించిన హరికీర్తిని కొనియాడే ఈ ఆధ్యాత్మ పారోక్ష్యం లోకాన్ని పవిత్రం చేస్తుంది. మనశ్శుద్ధిని కలిగిస్తుంది. అన్నిటికంటే గొప్పదైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి దీనిని చదివేవాడు, విన్నవాడు లింగశరీరాన్ని విడిచి సమస్త బంధాలను త్రెంచుకొని విదేహ కైవల్యాన్ని పొందుతాడు. సంసారంలో భ్రమించడు” అని చెప్పిన మైత్రేయునితో విదురుడు ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: