13, నవంబర్ 2020, శుక్రవారం

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 13  / Sri Devi Mahatyam - Durga Saptasati - 13 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 4*

*🌻. శక్రాదిస్తుతి - 1 🌻*


1-2. ఋషి పలికెను : 

అతి వీర్యసంపన్నుడు, దురాత్ముడు అయిన ఆ మహిషాసురుడూ, ఆ సురవైరి యొక్క సైన్యమూ దేవి చేత వధింపబడినప్పుడు ఇంద్రాది దేవగణాలు భక్తి వినమ్రములైన కంఠాలతో భుజాలతో, ఆనంద పులకాంకురరమ్యములైన శరీరాలతో దేవిని స్తుతించారు. 


3. "తన శక్తిచేత ఈ జగత్తునందంతటినీ వ్యాపించి ఉండేదీ, సర్వదేవగణాల శక్తి సమూహం యొక్క మూర్తరూపమైనట్టిదీ, సర్వదేవతలచేతా, మహర్షుల చేతా ఆరాధింప దగినదీ అయిన అంబికకు మేము సభక్తికంగా ప్రణమిల్లుతున్నాం. మాకు ఆమె శుభాలను ప్రసాదించుగాక!


4. "ఎవరి అసమాన బలప్రభావాలను బ్రహ్మవిష్ణుమహేశ్వరులు వర్ణింపజాలరో, ఆ చండిక సర్వజగత్తునూ పరిపాలించుటలోనూ, అమంగళం వల్ల కలిగే భయాన్ని నాశనం జేయడంలోనూ తన బుద్ధిని వినియోగించుగాక! 


5. "పుణ్యపురుషుల ఇళ్ళల్లో సంపదగానూ, పాపాత్ముల ఇళ్ళల్లో అశుభముగను, విద్వాంసుల హృదయములందు బుద్ధి జ్ఞానముగను, సత్పురుష హృదయములందు శ్రద్ధగను, సత్కుజుల హృదయములందు లజ్జగను ఏ దేవి స్వయముగా నిలిచి ఉండునో, ఆ దేవివగు నీకు ప్రణమిల్లుచున్నాము. నీవు జగత్తును పరిపాలింతువు గాక!


6. "దేవీ! తలచడానికి అలవికాని (మనస్సుకు అందని) ఈ నీ రూపాన్ని గాని, రాక్షసులను నశింపజేసే నీ వీర్యాతిశయం గాని, దేవాసుర యుద్ధాలన్నింటిలో నీవు చేసే అత్యద్భుత చర్యలు గాని వర్ణించడం మాకెలా సాధ్యం? 


7. "సర్వజగత్తులకు నీవు కారణమవు! నీవు త్రిగుణాత్మికవుడో అయినా వాటిలోని దోషాలు నీ యందు కానరావు! హరిహరాదులు కూడా నిన్ను ఊహించలేరు! అందరికీ నీవే ఆధారం! ఈ జగత్తంతా నీలో ఒక స్వల్పభాగం నుండి ఉత్పన్నమైంది. నిజంగా నీవు సర్వాధికయైన (వేఱుపఱుపబడని )* ఆద్య ప్రకృతివి* . 


8. "దేవి, యజ్ఞాలన్నింటిలో ఏ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల సమస్తదేవగణాలు తృప్తి పొందుతారో, ఆ స్వాహా మంత్రానివి నీవు. పితృదేవతా గణానికి తృప్తినిచ్చే స్వధాజీ మంత్రానివి నీవు. కాబట్టి జనులు నిన్ను (యజ్ఞాలలో స్వాహా, స్వధా అని) పలుకుతారు.


9. “దేవి! నీవు భగవతివి, మోక్షహేతువు, ఊహింప శక్యం కాని మహాతపస్సులకు హేతువైన పరావిద్యవు * నీవు. మోక్షార్థులు, ఇంద్రియాలను చక్కగా వశపరుచుకున్నవారూ, (పర) తత్త్వంలో (పరమ సత్యం) ఆసక్తులు, దోషాలన్నింటినీ పోగొట్టుకున్నవారూ అయిన మునులు (పరావిద్యవైన) నిన్ను అభ్యసిస్తారు. 


10. "నీవు శబ్దబ్రహ్మానికి ఆత్మవు. అతినిర్మలమైన ఋగ్యజుర్వేదశ మంత్రాలకు, పఠించేటప్పుడు వినడానికి ఉద్దేశించడం వల్ల రమ్యంగా ఉండే సామవేదమంత్రాలకు నీవు ఉనికిపట్టువు. నీవు వేదత్రయ స్వరూపిణవైన భగవతివి. సంసార జీవనోపాయమవు నీవు. సర్వలోక దుఃఖాలను పోగొట్టే మహాశ్రేష్ఠురాలవు నీవు.


11. “దేవీ, సర్వశాస్త్రాల సారమూ తెలుసుకునే 'మేధ' వు (ధారణాశక్తి గల బుద్ధివి) నీవు. దాటశక్యం కాని సంసారసాగరాన్ని దాటించే అసమానమైన 'నావ' వైన దుర్గవు నీవు. విష్ణుహృదయంలోనే నివాసమేర్పరుచుకున్న శ్రీ లక్ష్మి)వి నీవు. శివునిలో శాశ్వతంగా నిలిచిన గౌరివి కూడా నీవే.


12. “చిరునగవుతో కూడి, నిర్మలమూ, పరిపూర్ణ చంద్రబింబం వంటిదీ, అపరంజి వన్నెతో మనోజ్ఞంగా ఉండేటటువంటిది నీ ముఖము! కాని దానిని చూచి మహిషాసురుడు కోపోద్దీపితుడై వెంటనే దానిని కొట్టాడు; ఇది మిక్కిలి ఆశ్చర్యకరం.


13. "కోపయుక్తము, బొమముడితో భయంకరము, ఉదయిస్తున్న చంద్రబింబం వలె ఎఱ్ఱని కాంతి గలది అయిన నీ ముఖాన్ని చూడడంతోనే మహిషుడు ప్రాణాలు విడువకుండా ఉండడం ఇంకా చిత్రం! కోపంతో ఉన్న మృత్యువును దర్శంచి ఎవరు జీవించి ఉండగలరు!


14. "దేవీ! ప్రసన్నవు కమ్ము. నీవు సర్వాధికవు. కనుక పూనితివేని నీవు క్షణంలో (లోక) కల్యాణార్థం (అసుర) కులాలను నాశనం జేయగలవు. మహిషాసురుని అపార సైన్యాలు తుదముట్టింప బడినప్పుడే ఇది తెలిసింది.


15. “సర్వాదా శుభకారిణివైన నీవు ఎవరిపై ప్రీతి పూనుతావో, వారు దేశసమ్మానమును పొందుతారు; వారిదే ధనం; వారిదే కీర్తి; వారి ధర్మకార్యాలు నశించవు; వారే కృతార్థులు; వారికి అనుకూలురైన ఆలుబిడ్డలు, భృత్యులు ఉం టారు 🌹 🌹 🌹🌹

కామెంట్‌లు లేవు: