13, నవంబర్ 2020, శుక్రవారం

పసి(డి) మనసులు

 పసి(డి) మనసులు


బాల్యం అమూల్యం. అది తెలి మీగడ తరకలా, వెండి వెన్నెలంత ఆహ్లాదకరమైనది. అది అందరూ అనుభవించే దేవుడిచ్చిన వరం. అభం, శుభం తెలియని పసి(డి) మనసుల పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వు లాంటిది. అమ్మ ఒడి బడిలో నిర్భీతిగా ఒదుగుతూ ఎదిగేది బాల్యం. అమ్మ ఒడిలోనే ప్రాథమిక విద్యాభ్యాసానికి శ్రీకారం. అమ్మ పాలతోపాటు ఆమెలోని సద్గుణాలు, ఉన్నత ఆదర్శాలు గ్రోలడమే పిల్లలకు అసలైన విద్యాభ్యాసం. తల్లి బిడ్డను పెంచే తీరులోనే వారి భవిష్యత్తు నిర్ణయమవుతుంది.

భారతీయ సంస్కృతిలోని దేవతలు, త్యాగమయ జీవితాలు, ఇతిహాసాల గురించి కథలు, పాటల ద్వారా భువనేశ్వరీ దేవి నరేంద్రుడికి చెప్పేది. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, భారత కథలు ఆ పసి హృదయంలో చెరగని ముద్ర వేశాయి. ‘జీవితంలో నేను సాధించిన వాటన్నింటికీ నా తల్లికి నేను రుణపడి ఉన్నాను’ అన్నారు వివేకానంద.

పూర్వకాలంలో ఇంట్లో పెద్దవారు పిల్లలకు మానవ సంబంధాలు, వావివరసలు, విలువలు, సాహసోపేత కథల గురించి చెప్పేవారు, అవి పిల్లల్లో  ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నింపేవి.

వీధి గాయకులు బుర్రకథ, హరికథ వంటి రూపాలలో చారిత్రక సత్యాలను, రామాయణ, భారత కథలను, వీరగాథలను సరళమైన పద్ధతిలో గానం చేస్తూ భిక్షాటన సాగించేవారు. చిన్న పిల్లలకు ఇవి ప్రాథమిక విద్యలో ఓ భాగంగా చోటు చేసుకునేవి. ఇంట్లో పిల్లలకు ప్రేమ, మానసికంగా ఊతమిచ్చే ఆనందభరితమైన వాతావరణం ఉండాలి.

పిల్లలకు ఇంట్లో దొరికే ప్రేమ, నాణ్యతలను బట్టి వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి.

పిల్లలు భగవంతుడు లోకానికి ఇచ్చిన కానుకలు. వాళ్లను పెంచి పెద్దచేయడం, ప్రేమగా చూసుకోవడం ఓ అందమైన బాధ్యత. వారిని కొంతకాలమే మన దగ్గర ఉండే అందమైన బహుమతులుగా భావించాలి. పొట్లపాదుకు కాసిన ప్రతి కాయా తిన్నగా పెరగదు. కొన్ని వంకరగా ఉంటాయి. వాటిని గుర్తించి చిన్న రాయి కడితే చాలు- అవి తిన్నగా పెరుగుతాయి.

‘పిల్లలకు ప్రేమ పంచండి... మీ ఆలోచనలు కాదు. వారి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి. వికసించనీయండి. పిల్లల శరీరాలకు ఆవాసం కల్పించండి... వారి ఆత్మలకు కాదు. వాళ్ల ఆత్మలు రేపటి ఇంట్లో ఉంటాయి. అక్కడికి మీరు కలలో కూడా వెళ్లలేరు. కానీ మీరు పిల్లల్లా ఉండటానికి ప్రయత్నించవచ్చు. జీవితం వెనక్కి నడవదని, నిన్నటితో నిలిచిపోదని గుర్తించండి. మీరు ఒక విల్లు అయితే- దాన్నుంచి దూసుకుపోయే బాణాలు మీ పిల్లలు’ అంటారు ఖలీల్‌ జిబ్రాన్‌. పిల్లలకు తల్లితో సమానమైన స్నేహితులు గానీ, తండ్రితో సమానమైన గురువు గానీ ఉండరు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో సత్సంబంధాలు ఉన్నప్పుడే అవి అనంతంగా అభేద్యంగా నిలుస్తాయి.

మనదేశంలో ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టిన రోజున జరుపుకొంటాం. నెహ్రూకు పిల్లలంటే అమితమైన ఇష్టం.

‘మట్టి ముద్ద లాంటి చిన్నారుల్ని బంగారు ముద్దల్లా మలచే బాధ్యతను తల్లిదండ్రులు, అధ్యాపకులు సక్రమంగా నిర్వర్తించినప్పుడే- దేశం గర్వించే భావి భారత పౌరులు తయారవుతారు’ అన్న నెహ్రూ వ్యాఖ్యలు అక్షరసత్యాలు.

ఈనాడు అంతర్యామి

✍ఎం.వెంకటేశ్వర రావు

కామెంట్‌లు లేవు: