13, నవంబర్ 2020, శుక్రవారం

భక్తి

 భక్తి


🍁🍁🍁🍁


భక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది.. ఐశ్వర్య భక్తి మరియు మాధుర్య భక్తి.


 ఐశ్వర్య భక్తిలో భక్తుడు భగవంతుని యొక్క సర్వశక్తి తత్వాన్ని ధ్యానం చేస్తూ భక్తి లో నిమగ్న మవుతాడు. ఐశ్వర్య భక్తిలో ప్రధానంగా ఉండే భావము గౌరవము 

మరియు భక్తిపూర్వక భయము. ఇటువంటి భక్తిలో, భగవంతుని నుండి దూరంగా ఉండే భావన మరియు ప్రవర్తనలో ఎలాంటి లోపాలు లేకుండా ఉంటటం అనేవి ముఖ్యముగా ఉంటాయి.


 ద్వారకా వాసులు మరియు అయోధ్య వాసులు ఈ యొక్క ఐశ్వర్య భక్తికి ఉదాహరణలు; వారు శ్రీ కృష్ణుడిని మరియు శ్రీ రాముడిని తమ మాహారాజులుగా కొలిచారు.


 సామాన్య ప్రజలు తమ రాజుగారి పట్ల చాలా మర్యాద మరియు అణకువ తో ఉంటారు, కానీ వారు రాజుగారి పట్ల సాన్నిహిత్య భావనలో ఉండలేరు.


మాధుర్య భక్తి లో భక్తుడు భగవంతునితో అన్యోన్యమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. 


దీనిలో ప్రధానంగా ఉండే భావన ఏమిటంటే, "శ్రీ కృష్ణుడు నా వాడు మరియు నేను ఆయనకే చెందిన వాడిని" అని. కృష్ణుడిని తమ తోటి స్నేహితునిగా ప్రేమించిన బృందావన గోప బాలురు, శ్రీకృష్ణుడిని తమ బిడ్డలా ప్రేమించిన యశోద మాత మరియు నందబాబా, తమ ప్రియుడిగా కృష్ణుడిని ప్రేమించిన గోపికలు, మాధుర్య భక్తికి ఉదాహరణలు. మాధుర్య భక్తి అనేది ఐశ్వర్య భక్తి కంటే అనంతమైన రెట్లు ఉన్నతమైనది. 


:

సబఇ సరస రస ద్వారికా, మథురా అరు బ్రజ మాహీఁ

మధుర, మధురతర, మధురతమ, రస బ్రజరస సమ నాహీఁ


(భక్తి శతకం, 70వ శ్లోకం)


"భగవంతుని యొక్క దివ్య ఆనందము అన్ని రూపాల్లో కూడా అత్యంత మధురమైనది. అయినా అందులోకూడా స్థాయిలు ఉన్నాయి - ఆయన యొక్క ద్వారకా లీలల ఆనందము మధురమైనది, ఆయన యొక్క మథురా లీలల ఆనందము ఇంకా మధురమైనది, మరియు, ఆయన యొక్క వ్రజ (బృందావన) లీలల ఆనందము అత్యంత మధురమైనది."


మాధుర్య భక్తిలో, భక్తులు భగవంతుని యొక్క పరమేశ్వర తత్వాన్ని మర్చిపోయి, శ్రీ కృష్ణుడి పట్ల నాలుగు రకాల అనుబంధాలను పెంచుకుంటారు:


దాస్య భావము — శ్రీ కృష్ణుడు నా స్వామి మరియు నేను ఆయన యొక్క సేవకుడిని, అని. శీ కృష్ణుడి వ్యక్తిగత సేవకులైన రక్తకుడు, పత్రకుడు వంటి వారి భక్తి ఈ దాస్య భావములో ఉంది.


 భగవంతుడు మన తండ్రి లేదా తల్లి అనేది ఈ యొక్క భావన యొక్క రూపాంతరామే, అది దీనిలో భాగమే.


సఖ్య భావము — శ్రీ కృష్ణుడు మన స్నేహితుడు (సఖుడు) మరియు నేను ఆయన యొక్క సన్నిహిత సఖుడను. శ్రీదాముడు, మధుమంగళుడు, దంసుఖుడు, మనుష్కుడు వంటి బృందావన గోప బాలుర యొక్క భక్తి ఈ సఖ్య భావ కోవకు చెందినది.


వాత్సల్య భావం — శ్రీ కృష్ణుడు మన బిడ్డ మరియు నేను ఆయన తల్లి/తండ్రిని. యశోద మరియు నంద బాబాల యొక్క భక్తి ఈ వాత్సల్య భావము లోనిది.


మాధుర్య భావము — శ్రీ కృష్ణుడు మాచే ప్రేమింపబడిన వాడు మరియు నేను అతని ప్రియురాలిని. బృందావన గోపికల యొక్క భక్తి ఈ మాధుర్య భావము లో ఉన్నది.


అర్జునుడు సఖ్య భావములో ఉన్న ఒక భక్తుడు మరియు భగవంతునితో సుహృద్భావంగల సంభంధాన్ని ఆస్వాదించేవాడు. భగవంతుని యొక్క విశ్వ రూపాన్ని చూసిన పిదప, అర్జునుడు మహోన్నతమైన ఆశ్చర్యానికి మరియు పూజ్య భావానికి లోనయ్యాడు, అయినా తను ఎప్పుడూ అనుభవించే సఖ్య భావము యొక్క మాధుర్యాన్నే కోరుకున్నాడు. కాబట్టి, ఆయన ఇప్పుడు చూస్తున్న విశ్వరూపమును ఉపసంహారించి మరలా మానవ స్వరూపాన్ని చూపించమని కృష్ణుడిని ప్రార్ధించాడు.


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: