13, నవంబర్ 2020, శుక్రవారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


129 - ఉద్యోగపర్వం.


సంజయ రాయబారసమయంలో, ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు :.


' సంజయా ! కురుపాండవులు యిరువురూ,నాకు యిష్టులే. వారు కలిసిమెలిసి వుండాలని కోరుకునేవాళ్లలో నేను మొదటివాడిని. నాకే కాదు, యిరువర్గాలకూ సంధి అంటే సుముఖమే. కానీ, ధృతరాష్ట్రుడికి, రాజ్యం పంచే ఉద్దేశ్యం లేదు.  


' ధర్మరాజు ధర్మం తప్పడని నీవు ముందుగానే చెప్పావు కదా ! మరి, అకారణంగా ఆ అజాతశత్రువు యుద్ధానికి సిద్దపడుతున్నాడని, యెలా అభియోగం మోపుతున్నావు, ధర్మజునిపై. మోక్షానికి కర్మ చెయ్యడమే మార్గమని కొందరూ, జ్ఞానమే మార్గమని కొందరూ అంటుంటారు. దేహం నిలబడడానికి, కర్మలు అవసరమే. ఉదరపోషణ వుండాలి కదా ! సన్యాసిని గృహస్తు సమయానికి, పిలిచి భోజనం పెడితేనే కదా ఆయన ఆత్మ దేహంతో ఉండేది. జ్ఞానమార్గం బోధించడానికి.  


దేవతలు కూడా కర్మానుచరణ చేస్తూనే వున్నారు. వాయువు చలనము, సూర్యుని ఉదయాస్తమయాలు, భూభ్రమణము, చంద్రుని హెచ్చుతగ్గులు యివన్నీ వారి వారి కర్మలలో భాగాలేకదా ! భూమిని మోసే భూమాత, జలాలను తీసుకువెళ్లే నదీమతల్లులు, వర్షించే మేఘుడు, గతితప్పని నక్షత్రాలు, రుద్రులు, ఆదిత్యులు అందరూ వారి వారి పరిధిలో కర్మాచరణలో వున్నవారే ! '


' సంజయా ! నీవుకూడా ధర్మములు అన్నీ తెలిసినవాడివని అభిప్రాయంలో వుండగా, కేవలం కౌరవశ్రేయస్సుకోరి, వుచిచానుచితాలు మరచి, పాండవులను నిందించి అవమానిస్తున్నావు. పాండవులకు, యుద్ధం చెయ్యకుండా వారి రాజ్యభాగం వారికి పంచి యిస్తే, కౌరవులను, సంహరించే ప్రశ్నే వుత్పన్నము కాదుకదా ! మీ ధృతరాష్ట్రుడు పుత్రశోకం గురించి వ్యాకుల పడవలసిన అవసరం లేదుకదా ! శాంతి, క్షమా అనే విషయాలు నీవుచెప్పావు. రాజధర్మం గురించి చెప్పడం మరచిపోయావు. రాజ్యం వీరభోజ్యం. ఇప్పుడు యుద్ధంచేసి వీరి రాజ్యం పొందకుండా, వీరిని రాజధర్మాన్ని తప్పమని, ధృతరాష్ట్రుని మాటగా నీవు వీరిని నిరుత్సాహపరుస్తున్నావు.  


' సంజయా ! కౌరవులు దొంగబుద్ధి కలవారు. వారి తండ్రిగా ధృతరాష్ట్రుడు, అయన పంపిన నీవు, అదే ప్రోత్సహిస్తున్నారు. అంటే ఆచోరగుణంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు. యుద్ధం అనివార్యమే అని నాకు అనిపిస్తున్నది. ఈ విషయం నీవు కూడా కౌరవసభలో స్పష్టంగా చెప్పు. రాజ్యభాగం వదులుకునే వుద్దేశం లేకపోతె, యింకా విలువైనవి పోగొట్టుకునే అవకాశం వుంది అని కూడా చెప్పు. '


' సంజయా ! ద్రౌపదిని దుశ్శాసనుడు పరాభవించినపుడు, నిండుసభలో, ధృతరాష్ట్రుడు నోరు మెదపనప్పుడే, యీదుష్టబుద్ధికి వారిలో బీజంపడింది. ఒక్క విదురుడు తప్ప యెవరూ, ఆనాడు మాట్లాడలేదు. నీకు యివన్నీ తెలిసికూడా ధర్మరాజుకు నీతివాక్యాలు చెబుతున్నావు. కర్ణుడు, యేమన్నాడు ? ద్రౌపదిని దుర్యోధనుని దాసిగా వుండమన్నాడు. మరెవరినైనా భర్తగా, చూసుకోమన్నాడు. ఆనాటి కర్ణుని పలుకులు అర్జునుని గుండెలు వ్రక్కలు చేసినా, భిక్షాటనం చేసుకుంటూ, క్షత్రియ కుమారుడు జీవించాలా ? అదేకదా నీవు చెబుతున్నది ? 


' సంజయా ! వీరు అరణ్యవాసానికి వెళుతున్న వేళ, దుశ్శాసనుడు, వీరిని నపుంసకులు అని యెగతాళి చేయలేదా ? దాన్నే నిజం చేస్తూ,వీళ్ళు తిరిగి అరణ్యమార్గం పట్టాలా ? అదేనా ధృతరాష్ట్రుని మాటగా, నీవు చెబుతున్నది ? వేయిమాటలేల ? ఈ దుష్ట ఆలోచనను, కౌరవసభలోనే యెండగట్టాలి. నేనే ఆ పని చక్కబెట్టడానికి హస్తినకు వస్తున్నానని వారికిచెప్పు. పాండవుల రాజ్యభాగం వారిది వారికి యిచ్చారా, సంధి కుదురుతుంది. లేదా యుద్ధం అనివార్యం. సంధి కుదిరిందా, కౌరవులు బ్రతికిపోతారు. లేదా అర్జునుని గాండీవానికి బలవుతారు. భీముడి గదాఘాతాలకు అసువులు బాస్తారు. '


' దుర్యోధనుడు ఒక దుష్టకోపిష్టి వృక్షమైతే, ధృతరాష్ట్రుడు, దానికి వేరు వంటివాడు. కర్ణుడు బోదె, శకుని, దుశ్శాసనులు దాని కొమ్మలు, పూలు, పుష్పాల వంటివారు. ఇంకొక ప్రక్కధర్మరాజు ఒక ధర్మవృక్షం. అర్జునుడు బోదె, భీమ, నకుల సహదేవులు కొమ్మలు, ఫల పుష్పాలు, నేను, వేదములు, బ్రాహ్మణులూ దానికి వేళ్ళవంటివారం '


' కౌరవులు కీకారణ్యం వంటి వారైతే, పాండవులు పులులు సింహాల వంటివారు. పులులు, సింహాలు వుంటేనే అరణ్యానికి రక్షణ. అరణ్యంలోనే పులులు, సింహాలకు రక్షణ. కాబట్టి, ఒకరికిఒకరు, కురు పాండవులు అండగా వుంటేనే, యిరువురికీ క్షేమం. '.  


అని ఈ విధంగా అనేక దృష్టాంతరాలతో, శ్రీకృష్ణుడు, సంజయుడు పాండవులను యుద్ధం నుండి మనసు మరల్చడానికి చేసిన ప్రయత్నం నుండి త్రిప్పికొట్టాడు. అంతా సావధానంగావిన్న సంజయుడు, ' ధర్మజా ! శలవు. నేను హస్తినకువెళ్లి జరిగినదంతయు పూసగ్రుచ్చినట్లు చెబుతాను. నేను నాకర్తవ్య నిర్వహణలో, మీకు బాధకలిగించే మాటలు అన్నందుకు నన్ను క్షమించు. మీకు శుభం కలుగుగాక ! ' అన్నాడు. 


దానికి ధర్మరాజు, ' సంజయా ! నీవు ఉభయులకూ ఆప్తుడవు. నిన్ను చూస్తే, విదుర మహాశయుని చూసినట్లే వుంటుంది. నీపరిధులకు లోబడి నీవుచెప్పావు. దూతవాక్యాలు దూతకు ఆ క్షణకాలం ఆపాదిస్తాముకానీ, శాశ్వతంగా కాదు. అక్కడ అందరినీ అడిగానని చెప్పు. అక్కడ దుఃఖిస్తున్న పామరజనానికి చెప్పు, త్వరలో మేము మళ్ళీ మా రాజ్యం సంపాదించుకుని, వారిని క్షేమంగా చూసుకుంటామని. ' అని చెప్పాడు. 


' సంజయా ! చివరగా చెబుతున్నాను. మా రాజ్యం మాకు యివ్వడానికి వారికి యిష్టం లేకున్నా, కనీసం మా అయిదుగురకూ, ఆస్థలము, మాకంది, వారణావతము, వృకస్థలము, అయిదవదిగా, ఇంకొక నగరం కలిపి, ఇవ్వమని చెప్పు. లేదంటే, అయిదు గ్రామాలు యిచ్చినా చాలు. మేము మిత్రధర్మం తో వారితో వుంటాము. ' అని వీడ్కోలు చెప్పాడు. 


సంజయుడు శ్రీకృష్ణ, పాండవుల వద్ద శలవు తీసుకుని హస్తినకు చేరాడు. ,          


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: