28, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆదిపర్వము – 33

 

కురు, పాండవుల యుద్ధవిద్యా నైపుణ్యం


ఒకరోజు, ద్రోణుడు తన శిష్యులకు విలువిద్య పరీక్ష పెట్టాడు. ఒక బొమ్మ పక్షిని తయారు చేసి, ఒక చెట్టు పై భాగాన ఉన్న కొమ్మకు కట్టాడు. తన శిష్యులందరికి దానిని చూపించి , “మీరు అందరూ మీ ధనుస్సులు ఎక్కుపెట్టి, నేను చెప్పినప్పుడు ఆ పక్షిని కొట్టండి” అని చెప్పాడు.

ధర్మరాజును పిలిచాడు, “ధర్మరాజా, చెట్టు కొసన ఉన్న పక్షి తలను చూసావా?” అని అడిగాడు.

“చూసాను గురువర్యా” బదులు చెప్పాడు ధర్మరాజు.

“ఆ చెట్టును, నన్ను, నీ తమ్ముళ్ళను చూసావా?” అని అడిగాడు.

“చూసాను గురువర్యా” అన్నాడు ధర్మరాజు.

“ నీ దృష్టి చెదిరింది, నువ్వు దీనిని కొట్టలేవు” అన్నాడు.

ఆ మాదిరి మిగిలిన వారినందరినీ అడిగాడు. వారందరూ తమకు చెట్టు కొసన ఉన్న పక్షి తలతో పాటు, మిగిలినవి అన్నీ కనపడుతున్నాయి. అని చెప్పారు.

ఆఖరున ఆర్జునుడిని విల్లు ఎక్కుపెట్టమన్నాడు. మిగిలిన వాళ్ళను అడిగినట్లుగానే అర్జునుని కూడా అడిగాడు.

అర్జునుడు మాత్రం “గురుదేవా,నాకు పక్షితల తప్ప వేరే ఏది కనిపించటం లేదు” అని బదులు చెప్పాడు.

“కొట్టు”అన్నాడు ద్రోణుడు.

అర్జునుడు బాణం విడిచాడు, పక్షితల తెగిపడింది. అర్జునిని ఏకాగ్రతకు, లక్ష్యభేదనకు ద్రోణుడు సంతోషించాడు.

ఒకరోజు రాకుమారులందరూ కలిసి గంగానదికి స్నానం చెయ్యడానికి వెళ్లారు. గురువుగారైన ద్రోణుడు నదిలో స్నానం చేస్తునాడు. నదిలో ఉన్న ఒక మొసలి ద్రోణుడి తొడ పట్టుకొని నీటిలోకి లగాసాగింది.

వెంటనే ద్రోణుడు “రాకుమారులారా, నన్ను ఈ మొసలి బారి నుండి కాపాడండి” అని పెద్దగా అరిచాడు. రాకుమరులంతా దిక్కుతోచక అటూ, ఇటూ పరుగెడుతున్నారు. అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్న ఆ మొసలిని తన బాణాలతో కొట్టి గురువు గారైన ద్రోనుడిని కాపాడాడు. అతని విలువిద్యా నైపుణ్యానికి సంతోషించాడు. ఎప్పటికైనా ద్రుపదుని మీదున్న తన పగను తీర్చేవాడు అర్జునుడే అని నమ్మకం కుదిరింది. అందుకని అర్జునుడికి అనేక దివ్యమైన అస్త్రాలను ఇచ్చాడు.

ఆ ప్రకారం పాండవులు, కౌరవలు ద్రోణుడి వద్ద అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకుంటున్నారు. ఒకరోజు ద్రోణుడు, రాకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనను ఏర్పాటు చేయవలిసిందిగా ధృతరాష్ట్రుడిని కోరాడు. ధృతరాష్ట్రుడు సమ్మతించి, విదురుని తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. ఆ ప్రదర్శనకు గాంధారి, ధృతరాష్ట్రుడు వచ్చారు. ఇంకా వ్యాస మహర్షి, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన ప్రముఖులు తమ తమ ఆసనాలలో ఆసీనులయ్యారు.

ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు ధరించి అక్కడకు వచ్చాడు. ఆయన వెనుక పాండు కుమారులు, ధృతరాష్ట్ర కుమారులు వయసుని బట్టి వరుస క్రమంలో నిల్చున్నారు. ముందు కొంచెంసేపు రాకుమారుల అస్త్ర శస్త్ర ప్రదర్శన అయిన తరువాత, భీముడు, దుర్యోధనుడు గదలు తీసుకొని తమ గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారు ఇరువురు కొదమ సింగాల వలె పోరాడుతున్నారు.

ఈ ప్రదర్శనా విశేషాలన్నీ విదురుడు గాంధారి, ద్రుతరాష్ట్రులకు వివరంగా చెపుతున్నాడు. భీమ దుర్యోధన గదా యుద్ధాన్ని చూస్తున్న పౌరులు తమలో తాము ఆవేశకావేషాలు పెంచుకుంటున్నారు. పరిస్తితి చెయ్యి దాటుతోందని అనుకున్న ద్రోణాచార్యుడు, తన కుమారుడు అశ్వత్థామను పంపి ఆ ప్రదర్శన ఆపించాడు. తరువాత అర్జునుని విలువిద్యా ప్రదర్శన ఉంటుంది అని ప్రకటించాడు.

అర్జునుడు విల్లు, అమ్ములు ధరించి రంగంలోకి ప్రవేశించాడు. అర్జునుని చూడగానే జనంలో కలకలం రేగింది. అదుగో పాండురాజు పుత్రుడు మేటి విలుకాడు అర్జునుడు అని ప్రజలు జయ జయ ధ్వానాలు చేసారు.

అర్జునుని చూసి కుంతీదేవి, తన కుమారుడు ప్రయోజకుడైనందుకు ఎంతో ఆనందించింది. ఆ కలకలం, జనుల హర్షధ్వానాలు విని “అదేమిటి” అని అడిగాడు ధృతరాష్ట్రుడు. దానికి విదురుడు “అర్జునిని విలువిద్యా కౌశలాన్ని చూసి ప్రజలు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు” అని చెపాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా ఎంతో సంతోషించాడు.

అర్జునుడు గురువు గారి అనుమతితో ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వయవ్యాస్త్రము, మేఘాస్త్రము మొదలైన అస్త్రాలు ప్రదర్శించాడు. ప్రజలందరూ అర్జునుడి అస్త్ర విద్యను చూసి ఆశ్చర్యపోయారు.

ఇంతలో కర్ణుడు ప్రవేశించాడు, సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుడిని చూసి జనం విస్మయంతో చుస్తునారు. కర్ణుడు సభా మధ్యలో నిలబడి, గురువులకు నమస్కరించి, అర్జునునితో ఇలా అన్నాడు.

“అర్జునా, ఈ విద్యలు ప్రదర్శించడానికి పెద్ద నేర్పు అవసరం లేదు. ఈ జనం మెచ్చేటట్టి ఈ విద్యలన్నీ నేను కూడా ప్రదర్శించగలను” అని అన్నాడు.

దుర్యోధనుడు కర్ణుని చూసి సంతోషించాడు. అర్జునునికి కోపం వచ్చింది. ద్రోణుని అనుమతితో కర్ణుడు, అర్జునుడు చూపిన ఆఅస్త్ర విద్యలన్నీ తనూ చేసి చూపాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్లి తనతో చెలిమి చెయ్యమని కోరాడు. అప్పుడు కర్ణుడు, అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి కోరాడు. పిలవకుండానే సభకు వచ్చినందుకు అర్జునుడు కర్ణుని ఆక్షేపించాడు.

దానికి కర్ణుడు “ఈ అస్త్ర విద్యా ప్రదర్శన వీరులు అందరికి చెందినది. దీనికి ఎవరూ పిలవనవసరంలేదు” అని అన్నాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణునికి అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి ఇచ్చాడు.

అర్జునుడు,కర్ణుడు ద్వంద్వ యుద్ధం చెయ్యడానికి సమకట్టారు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఒక సమయంలో కర్ణుడు వేసిన పర్జన్యాస్త్రానికి అర్జునుడు కనిపించకుండా పోయాడు. అది చూసి కుంతీదేవి మూర్చపోయింది. మరల అర్జునుడు వాయవ్యాస్త్రంతో ఆ మేఘాలను పారదోలాడు.

వ్యవహారం శృతిమించుతుందని తెలుసుకొని కృపాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచాడు. “కర్ణా, ఇతను పాండురాజు పుత్రుడు, కుంతీ కుమారుడు. జన్మతహ క్షత్రియుడు. నీవు అర్జునునితో యుద్ధం చెయ్యాలంటే నీ వంశం, తలితండ్రుల గురించి చెప్పాలి” అని అన్నాడు. దానికి కర్ణుడు సిగ్గుతో తల వంచుకున్నాడు.

అప్పుడు దుర్యోధనుడు క్రుపచార్యుని చూసి, “గురువర్యా, కులము, శౌర్యము, అధిక సేన కలవరాలు రాజుగా పిలవబడతారు. మీ అభ్యంతరం అంతా కర్ణుడు రాజు కాడు అనేగా. ఇప్పుడే కర్ణుని నా అంగ రాజ్యానికి రాజును చేస్తాను” అంటూ భీష్ముడు, ధృతరాష్ట్రుల అనుమతితో అక్కడికక్కడే కర్ణుడిని అంగ రాజ్యానికి రాజును చేసాడు.

కర్ణుడు ఆనందంతో పొంగిపోయాడు. దుర్యోధనా, నన్ను గౌరవించి, రాజును చేసి నా పరువు నిలిపావు. నేను నీకు ఏమి చెయ్యగలను” అని అడిగాడు.

“కర్ణా, నేను నీ స్నేహాన్ని అభిలషిస్తున్నాను. నాతో స్నేహం చెయ్యి” అని అన్నాడు. కర్ణుడు తన జీవితాంతం దుర్యోధనుడికి మిత్రుడిగా ఉండటానికి అంగీకరించాడు.

ఇది అంతా చూసి కర్ణుడి తండ్రి అక్కడకు వచ్చాడు. కర్ణుడు తండ్రికి నమస్కరించాడు. ఇది చూసిన భీమునికి, కర్ణుడు సూత పుత్రుడు అని అర్థం అయింది.

“కర్ణా, సూత పుత్రుడవైన నీవు, రథం నడుపుకోక, నీకు అర్జునునితో యుద్ధము ఏలానయ్యా?” అని ఆక్షేపించాడు.

వెంటనే దుర్యోధనుడు “వాయు పుత్రా, భీమా, ఇంతటి తేజశ్శాలి సూత కులంలో పుడతాడా. వీరుల పుట్టుక, దేవతల పుట్టుక, యేరుల పుట్టుక ఎవరికి తెలియవు?

దేవేంద్రుని వజ్రాయుధం దధీచి వెన్నెముక నుండి పుట్టలేదా?

పరమశివుని కుమారుడు, కుమారస్వామి రెల్లు పొదలో జన్మించాలేదా?

మా గురువైన మీరు ఎలా జన్మించారో తెలియదా?

ద్రోణాచార్యులు కుండలో పుట్టలేదా?

ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణుల వలన జన్మించాలేదా?

అంతదాకా ఎందుకు, మీ ఐదుగురు అన్నదమ్ముల పుట్టుకలు ఎట్టివి?

కాబట్టి ఇక్కడ జన్మలతో పనిలేదు. కర్ణుడు అంగ దేశానికి రాజు. సహజ కుండలములు కలవాడు” అంటూ ఉండగానే సూర్యాస్తమయం అయింది. ఆ రోజుకు ప్రదర్శన ముగిసింది.

దుర్యోధనుడు కర్ణుడిని వెంటపెట్టుకుని రాజసౌదానికి వెళ్ళాడు. అప్పటిదాకా ఇది అంతా చూస్తున్న కుటిదేవి కర్ణుడిని తన పెద్ద కుమారుడిగా గుర్తుపట్టింది. కానీ అర్జునుని మీద ప్రేమతో అది బయట పడనీయలేదు.

రాకుమరులందరికి విలువిద్య పూర్తి అయింది. గురు దక్షిణ ఇచ్చే సమయం వచ్చింది.

“తమరికి ఏమి ఇవ్వాలో చెప్పండి” అని రాకుమారులు ద్రోనుడిని అడిగారు.

పాత పగ గుర్తుకు వచ్చింది ద్రోణుడికి. “నాకు గర్వాంధుడైన ద్రుపదుని పట్టి తెచ్చి ఇవ్వండి’ అని అడిగాడు.

వెంటనే దుర్యోధనాదులు రథాలెక్కి పాంచాల దేశం వైపు వెళ్లారు. పాండవులు కూడా ద్రోణాచార్యుడిని రథమ్మీద ఎక్కించుకుని పాంచాల దేశం వెళ్లారు. దుర్యోధనాదులు ద్రుపదుడితో యుద్ధం చెయ్యడం మొదలు పెట్టారు.

ద్రుపదుడు సామాన్యుడు కాడు. కౌరవులనందరినీ ఓడించాడు. అది చూసి అర్జునుడు, ధర్మరాజును, ద్రోణుడిని అక్కడే ఉండమని, ద్రుపదుని మీదికి యుద్ధానికి వెళ్ళాడు.

భీమార్జునులు ద్రుపదుడి సేనను చీల్చి చెండాడారు. అర్జునుడు ద్రుపదునితో ద్వంద్వ యుద్ధం చేసాడు. ద్రుపదుడిని ఓడించి, తన రథ చక్రానికి కత్తి తీసుకొని వచ్చి ద్రోణుడి ముందు పడవేసాడు.

ద్రోణాచార్యుడు, ద్రుపదుని చూసి హేళనగా నవ్వి “ఏమేమి ద్రుపద మహారాజులు ఇలా దీనంగా పది ఉన్నారేమి? మహారాజు అనే మదం తొలగిపోయిందా? ఇక ముందైనా మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారా” అని అడిగాడు. వెంటనే ద్రుపదుడిని విదడిచిపెట్టమన్నాడు.

ద్రుపదుడు ఆ పరాభవాన్ని తట్టుకోలేక పోయాడు. తగిన ప్రతీకారం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు

కామెంట్‌లు లేవు: