28, సెప్టెంబర్ 2020, సోమవారం

తిలోత్తమ

 **


ఎంతటి అన్నదమ్ములైనా, ఒకే తల్లిదండ్రులకి పుట్టినా జీవితంలో ఎప్పుడైనా ఒక సమయంలో మనస్పర్ధలూ, ఈర్ష్యాద్వేషాలూ రావచ్చు. అలా రాకుండా ఉండాలంటే తగిన విధంగా ధర్మ మార్గంలో ప్రవర్తించాలి అని సందేశం ఇచ్చే కధ మనకు మహాభారతంలో కనిపిస్తుంది.


ద్రౌపది స్వయంవరం తరువాత పాండవులు కుంతితో కలిసి హస్తినకు వచ్చారు. దృతరాష్టుడిచ్చిన అర్ధ రాజ్యంలో ఖాండవ వనంలో ఇంద్రప్రస్థపురాన్ని ఏర్పర్చుకొని పాండవులు రాజ్యమేలుతుండగా ఒక సారి అక్కడికి నారదుడు వచ్చాడు. ధర్మరాజు చేసిన అతిధి పూజలను అందుకొన్నాకా ద్రౌపది లేని సమయం చూసి పాండవులకి ఒక కధను చెప్పాడు.


పూర్వం నికుంభుడనే రాక్షసుడికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు. రాక్షసులైనా బ్రహ్మను గురించి కఠోర తపస్సు చేయతలపెట్టి వింధ్యపర్వతాలకు వెళ్ళారు. ఆ సోదరుల తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. కామరూపం, కామగమనం, అమరత్వం, సకలమాయలూ మొదలైన వరాలని వారు కోరుకొన్నారు. పుట్టిన ప్రాణి గిట్టక మానదు కావున అమరత్వం ఇవ్వడం కుదరదని చతుర్ముఖుడు చెప్పాడు. వారిరువురకీ ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమాభిమానాలున్నాయి కనుక ఇద్దరూ ఒక వరం అడిగారు. ఇతరులెవ్వరి వలనా మరణం లేకుండే స్థితి కోరుకొన్నారు.. వారికి బ్రహ్మ ఇచ్చిన శక్తుల వల్ల పులులూ, ఏనుగుల రూపాలు ధరించి మునుల ఆశ్రమాలను దాడి చేసి చిందరవందర చేయసాగారు. వరగర్వంతో సాధుజనులకి కంటకంగా మారి చెలరేగసాగారు. ఋషులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తమ బాధలు మొరపెట్టుకొన్నారు. ఇతరులెవ్వరి వలనా మరణం లేకుండా వరం కోరుకొన్నారు కానీ వారిలో ఒకరి వలన ఇంకొకరికి మరణం కలుగకుండ వరం కోరుకోలేదన్న సూక్ష్మాన్ని గ్రహించి వెంటనే విశ్వకర్మను పిలిపించి సృష్టిలోకెల్ల అత్యంత సౌందర్య రాశి ఐన కన్యను సృష్టించమని ఆఙ్ఞాపించాడు. అందుకుగాను సృష్టిలో అన్ని వస్తువులలోంచీ నువ్వు గింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఆ సౌందర్యరాశిలో పొందుపరచాలని సూచించాడు. అలా విశ్వజనితమైన సౌందర్యపు 'రాశి' జీవంపొందింది. ఆమెకు బ్రహ్మ తిలోత్తమ (తిల ప్రమాణంలో అన్నిటి అందం పొందింది కనుక) అని పేరుపెట్టాడు. తిలోత్తమ వెంటనే బ్రహ్మకూ విశ్వకర్మకూ నమస్కరించి కర్త్వ్యోన్ముఖురాలయ్యింది. మద్యం మత్తులో మదిరాక్షులనడుమ భోగాలనుభవిస్తున్న సుందోపసుందుల ముందు నిలచి వయ్యారాలను ఒలకబోసింది. ఆ ఇద్దరినీ అమితంగా ఆకట్టుకొంది. వారిద్దరూ ఆమెకోసం పోటీ పడసాగారు. అప్పుడు తిలోత్తమ ఆ ఇద్దరిలో ఎవరు బలాఢ్యుడో అతనికే తను సొంతమౌతానని చెప్పింది. ఆత్మీయానుబధంతో ఉన్న సోదరులు కాస్తా ఒకరి మీదకు ఒకరు కాలు దువ్వుకొన్నారు. భీకరమైన పోరు సలిపి ఇద్దరూ మరణించారు.


ఆత్మీయులైన సోదరులే ఐనా స్త్రీ విషయంలో ఇలా తగవులు రావచ్చు కనుక పాండవులు ద్రౌపది విషయంలో అలా ప్రవర్తించకూడదని హితవు పలికాడు నారదుడు. అప్పుడు నారదుడి సమక్షంలోనే ధర్మరాజు తన సోదరులతో కలిసి ద్రౌపది తో ఒక్కొక్కరూ ఒక సంవత్సరం భర్తగా ఉండేలా ఆ సమయంలో వేరెవరైనా ఈ కట్టుబాటు దాటితే ఒక సంవత్సరం తీర్ధయాత్రలకు వెళ్ళి లా ఏర్పాటు చేసాడు.

కామెంట్‌లు లేవు: