**దశిక రాము**
తృతీయ స్కంధం -32
కర్దముని విమానయానంబు
ఈ విధంగా స్వాయంభువుడు దేవహూతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేసి వెళ్ళిపోగా, ఆ తర్వాత దేవహూతి పతిభక్తి కలిగి శివునికి పార్వతి సేవ చేసిన విధంగా భర్తయే ఏడుగడగా భావించి, ఆ మునీశ్వరుని మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా దినదినం భక్తి, ప్రేమ రెట్టింపుకాగా సేవలు చేస్తూ, మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ, కామం, క్రోధం, కపటం, లోభం మొదలైన దుర్గుణాలకు దూరంగా ఉండి, తన సౌందర్యాన్ని పోషించుకుంటూ, చాతుర్యంతో, చనువుతో, ప్రేమతో పతినే దైవంగా భావించి మృదుమధురంగా అతనితో మాట్లాడుతూ పతివ్రతయై ప్రకాశించింది. దైవయోగాన్ని సైతం తప్పింప సమర్థుడైన కర్దమ ప్రజాపతి తన సేవలో మిక్కిలి కృశించిన దేవహూతిని దయతో చూసి ముద్దుగా ఇలా అన్నాడు.
“దేవీ! మాననీయమైన ధర్మమార్గం వల్ల మహిమ ప్రాప్తిస్తుంది. ఆ మహిమ వల్ల గొప్ప తపస్సూ దానివల్ల ఏకాగ్రత సిద్ధిస్తాయి. వాటివల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఆత్మయోగం లభిస్తుంది. ఆ ఆత్మయోగం విష్ణువుయొక్క కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ కటాక్షం కారణంగా అవ్యయమైన దివ్యభోగాలు, అనంత సుఖాలు సమకూరుతాయి. ఈ విధంగా నాకు సమకూడిన సమస్త సంపదలూ నిరంతరం నన్ను సేవిస్తున్న నీకూ సంప్రాప్తిస్తాయి. నీకు నేను తిరుగులేని దివ్యదృష్టిని కూడా ఇస్తాను. ఓ తరుణీ! ఆ దివ్యదృష్టివల్ల అన్నింటినీ నీవు చూడవచ్చు. చూడు. ఇక భగవద్దత్తాలు కాని ఇతర తుచ్ఛభోగాల విషయం వేరే చెప్పటం దేనికి? అవి ఆ విష్ణువు కనుబొమలు చిట్లించినంతమాత్రాన నశిస్తాయి. సాటిలేని రాజ్యవైభవాలతో గర్వాంధులైన రాజులు కనులు గానక పాపమార్గంలో ప్రవర్తిస్తారు. అటువంటి వారికి అందరాని ఈ దివ్యభోగాలు నీ పాతివ్రత్య మహిమ వల్ల నీకు లభించాయి. ఈ సుఖాలను నీవు సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది” అని కర్దముడు పలుకగా దేవహూతి కడకన్నులలో సిగ్గు చిందులు త్రొక్కగా, మనోవ్యథ మాయం కాగా, మోము వంచుకొని వినయంతో చనువుతో పారవశ్యంతో యోగమాయావిశారదుడైన తన భర్తవంక చూస్తూ ముద్దుముద్దుగా ఇలా అన్నది. "ఓ పుణ్యాత్మా! నీవు అమోఘమైన యోగమాయకు అధిపతివి. అత్యంత సమర్థుడవు. అటువంటి నీయందు సాటిలేని దివ్యభోగాలు ఉన్నాయని తెలుసు. నీ సాంగత్యం వల్ల అవన్నీ నాకు లభిస్తాయి. అయినప్పటికీ నీవు సంతానం కలిగేవరకు మాత్రమే శరీరసంగమం కలిగి ఉంటానని ఒక నియమం ఆనాడు సెలవిచ్చావు. ఆ మాట మనస్సులో పెట్టుకొని నీ సాంగత్యాన్ని నాకు దయతో అనుగ్రహించు. నన్ను మన్నించు. నీ సంయోగాన్ని అభిలషిస్తూ కృశించిన ఈ శరీరం స్నానపాన భోజనాదులవల్ల ఎలా తృప్తి పడుతుంది? అటువంటి నా కోరికను తీర్చటానికి రతిరహస్యాలను ప్రకాశితం చేసే కామశాస్త్రాన్ని నాకు నేర్పు. అందుకు తగిన నానావిధాలైన వస్త్రాలు, అలంకారాలు, పూదండలు, మైపూతలు, శయనమందిరాలు, ఉద్యానవనాలు మొదలైన సమస్త వస్తువులనూ సమకూర్చి నన్ను కనికరించు” అని దేవహూతి చెప్పగా విని మహాత్ముడైన కర్దముడు తన యోగమాయాబలంతో ఆ క్షణంలోనే (ఒక దివ్యవిమానాన్ని సృష్టించాడు). ఆ విమానంలో అందమైన మందిరాలు కనువిందు చేస్తున్నాయి. ఆ మందిరాలన్నీ మణిమయ స్తంభాలతో, గరుడపచ్చలు పరచిన నడవలతో, వజ్రాల తలుపులు గల గోడలతో, పగడాల గడపలతో, ఇంద్రనీల మణిఖండాలతో నిండి తళతళ మెరిసే బంగారు కలశాలతో, అంచులలో పద్మరాగాల మొగ్గలు చెక్కిన చక్కని వైడూర్యపు చూరులతో, గాలికి రెపరెపలాడుతున్న జెండా గుడ్డలతో, మధుర మధురంగా ఝంకారం చేసే తుమ్మెదలతో కూడి వ్రేలాడుతున్న పూలదండల తోరణాలతో అత్యంత మనోహరంగా అలరారుతున్నాయి. ఇంకా అందలి గదులలో జిలుగు దువ్వలువలు, చీనాంబరాలు, పట్టుచీరలు మొదలైన పలువిధాలైన వస్త్రాలు శోభిల్లుతున్నాయి. అపురూపమైన రంగురంగుల పట్టెమంచాలు అమర్పబడి ఉన్నాయి. అందలి అందమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాలు, చక్రవాకాలు, చిలుకలు, నెమళ్ళు మొదలైన పక్షులు మందిరాల గోడలమీద చెక్కబడిన కృత్రిమ పక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడి చెట్లకొమ్మలపై కేరింతలు కొడుతూ ఆడుతుంటాయి.అందలి అందమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాలు, చక్రవాకాలు, చిలుకలు, నెమళ్ళు మొదలైన పక్షులు మందిరాల గోడలమీద చెక్కబడిన కృత్రిమ పక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడి చెట్లకొమ్మలపై కేరింతలు కొడుతూ ఆడుతుంటాయి. ఇంకా...ఆ విమానం మెత్తని శయ్యలతో, మేలైన గద్దెలతో, కేళీగృహాలతో, క్రీడాపర్వతాలతో, పాలరాతి భవనాలతో, పండ్లచెట్లతో నిండిన వనాలతో కూడి ఉన్నది. ఆ విమానం సమస్త ఋతుశోభలతో, సకల శుభాలతో, సర్వసంపదలతో పెంపొందుతూ అన్ని సుఖాలను అనుభవించటానికి యోగ్యమై, అన్ని కోరికలను అందించగలదై, అందమైన అలంకారాలతో ఒప్పుతున్నది. అటువంటి దివ్యమైన విమానాన్ని సృష్టించి, అందలి శోభావిశేషాలను నిర్మాణం చేసిన తాను కూడా తెలుసుకొనంతటి అద్భుత నిర్మాణాలు కలదానిని దేవహూతికి చూపి, ఆమె సంతోషించడం లేదని తెలిసికొని సమస్త ప్రాణుల అంతరంగాలలో గల అభిప్రాయాలను గ్రహించేవాడూ, తృప్తిపడిన మనస్సు కలవాడూ అయిన కర్దముడు ఇలా అన్నాడు. “ఓ సుందరీ! భగవంతునిచే నిర్మింపబడినదీ, సమస్త శుభాలను కలిగించేదీ అయిన ఈ బిందుసరోవరంలో స్నానం చేసిన ప్రాణులన్నింటికీ కోరికలు తీరుతాయి. కావున నీవు…ఓ లజ్జాశీలీ! ఈ సరోవర జలాలలో భక్తితో స్నానం చేసి సంతోషంగా ఈ విమానాన్ని ఎక్కు” అని కర్దముడు బుజ్జగిస్తూ పలికాడు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి