28, సెప్టెంబర్ 2020, సోమవారం

పోత‌న త‌ల‌పులో ...66

 

కృష్ణ ప‌ర‌మాత్మ‌తో ర‌మ‌ణులు సంతోష స‌ర‌స స‌ల్లాపాలాడుతున్నారు.

**


యతు లీశ్వరుని మహత్త్వము

మిత మెఱుఁగని భంగిఁ నప్రమేయుఁడగు హరి

స్థితి నెఱుఁగక కాముకుఁ డని

రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ!


**

ఓ శౌనకా! 

తపోనియతులైన యతులు పరమేశ్వరుని ప్రభావం ఇదమిత్థమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్వాన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమణునితో క్రీడించారు.

**

ఎల్లప్పుడు మా యిండ్లను

వల్లభుఁడు వసించు; నేమ వల్లభలము శ్రీ

వల్లభున" కనుచు గోపీ

వల్లభుచే సతులు మమతవలఁ బడి రనఘా!"

          ***

పుణ్యవంతుడైన శౌనక! మా వల్లభుడు మా గృహాలను ఎప్పుడు వదలిపెట్టడు, రమావల్లభు డైన యదువల్లభునకు మేమే ప్రియమైన వారమని భావిస్తు ఆ భామ లందరు యశోదానందనుని వలపుల వలలో చిక్కుకొన్నారు.

   ***

"గురునందనుండు సక్రోధుఁడై యేసిన-

  బ్రహ్మశిరోనామబాణవహ్నిఁ

గంపించు నుత్తరగర్భంబు గ్రమ్మఱఁ-

  బద్మలోచనుచేతఁ బ్రతికె నండ్రు;

గర్భస్తుఁ డగు బాలుఁ గంసారి యే రీతి-

  బ్రతికించె? మృత్యువు భయము వాపి

జనియించి యతఁడెన్ని సంవత్సరములుండె?$-

  నెబ్భంగి వర్తించె? నేమిసేసె?


వినుము, శుకుఁడు వచ్చి విజ్ఞానపద్ధతి

నతని కెట్లు సూపె నతఁడు పిదపఁ

దన శరీర మే విధంబున వర్జించె

విప్రముఖ్య! నాకు విస్తరింపు."


 బ్రహ్మణ్యులలో అగ్రగణ్యుడవైన సూతమహర్షీ! 

అశ్వత్థామ ఆగ్రహావేశంతో ప్రయోగించిన బ్రహ్మశిరోనామకమైన మహాస్త్రం మంటలకు, తపించిపోతున్న ఉత్తర గర్భంలోని పసికందును దేవకీ నందనుడు తిరిగి బ్రతికించాడని విన్నాను. తల్లి గర్భంలో ఉన్న అర్భకుణ్ణి కమలాక్షుడు మృత్యువు బారిపడకుండా ఎలా రక్షించాడు? అలా రక్షింపబడి జన్మించిన ఆ బాలుడు భూమ్మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఏ విధంగా ప్రవర్తించాడు? ఏయే ఘనకార్యాలు చేసాడు? చివరకి తన తనువును ఏ విధంగా త్యజించాడు? ఈ విషయాలన్నీ నాకు వివరించు....


🏵️పోత‌న ప‌ద్యం🏵️

🏵️ప‌ర‌మ‌ప‌విత్రం🏵️

కామెంట్‌లు లేవు: