28, సెప్టెంబర్ 2020, సోమవారం

ముక్తేశ్వర క్షేత్ర

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

తూర్పుగోదావరి జిల్లా

అయినవిల్లి మండలం

కోనసీమ డెల్టా లో

పవిత్ర గోదావరి-గౌతమి సమీపంలో

కొలువైఉన్న

క్షణ ముక్తేశ్వర క్షేత్ర

'ముక్తికాంతా సమేత క్షణముక్తేశ్వరస్వామి వారి'

దర్శనం శివసంకల్పం లో ఈరోజు...

  

*ప్రసిద్ధ గణపతి క్షేత్రాలలో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా 'అయినవిల్లి' కి ఒక కిలోమీటరు దూరం లో ఉందీ క్షేత్రం

   *స్వామి ముక్తేశ్వరుడు గా భక్తుల నుండి పూజలు అందుకుంటారు ఈ క్షేత్రంలో

  *పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న క్షేత్రాల్లో ముక్తేశ్వరం కూడా ఒకటి

*సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్టించిన శివలింగం

  *ఒక్క క్షణ దర్శనం తోనే ముక్తిని అనుగ్రహించే క్షేత్రం కావున ఈ పుణ్యస్థలి క్షణ ముక్తేశ్వరం గా పిలవబడుతోంది.

*త్రేతాయుగం నాటి పరమేశ్వర స్వరూపం

*సప్తఋషులు అర్చించిన దివ్యతేజోమూర్తి స్వామి వారు

*ఇక్కడ ఎదురు ఎదురుగా రెండు శివాలయాలు ఉంటాయి

*ఇక్కడి శివలింగం రుద్రాక్షను పోలి ఉంటుంది.

మరింత విస్తృతంగా సమాచారం మనకోసం:-

    *లోక కల్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ముక్తేశ్వరం' ఒకటి. ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతోన్న 'అయినవిల్లి'కి ఒక కిలోమీటరు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ స్వామి 'ముక్తేశ్వరుడు' పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడు.అమ్మవారు ముక్తికాంత గా భక్తులను అనుగ్రహిస్తున్నారు.

    *ఈ ముక్తేశ్వర ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం రెవెన్యూ విభాగంలో అయినవిల్లి మండలం, కోనసీమ డెల్టాలో ఉంది. ఇది గోదావరి నదికి దగ్గరలో ఉన్న గౌతమి-గొదావరి నదికి సమీపంలో ఉంది. కోనసీమకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. పచ్చటి ప్రకృతి, పంటకాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు గోదావరి నది ఒడ్డు, ఇలా ఎన్నో అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ముక్తేశ్వర ఆలయం కాకినాడకు దాదాపు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..


స్థలపురాణం:-

గౌతమీ నదీ తీర అత్యంత పురాతనమై దేవాలయం.రావణ వధ తర్వాత ఆ బ్రహ్మ హత్యా పాపం పోగొట్టుకోవటానికి శ్రీ రాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు .ఒక సారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెడుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగి పోయింది .అక్కడ దిగి నడుచు కుంటూ వెళ్లితే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరు మిట్లు గొలిపే కాంతితో దర్శన మిచ్చింది .దానికి దగ్గరలో’’ శ్రమణి ‘’అనే తాపసి ధ్యానంలో కనిపించింది .రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీ రామ దర్శనం చేత తనకు శాప విమోచనమైఁదని తెలిపింది .పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపించాడు .వెంటనే పరమేశ్వరుడు దానినుండి ప్రత్యక్షమయ్యాడు .తాపసి శ్రమణి శివ దర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమై పోయింది . శ్రీ రాముని కోర్కపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు .ఒక్కక్షణ దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణ ముక్తేశ్వర క్షేత్రమయింది .శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మ హత్యా పాతకం నుండి విముక్తడయ్యాడు .కనుక ఆలయం త్రేతా యుగానికి చెందినది .సప్తమహర్షులు ఇక్కడ కొచ్చి స్వామిని అర్చించారు .క్షేత్రపాలకుడు కేశవ స్వామి .శ్రావణ ఆశ్వయుజ కార్తీక మాసాలలో, శివరాత్రికి విశేషంగా పూజలు అభిషేకాలు ఉత్సవాలు జరుగుతాయి.

గోదావరి నదిపై ఆవల కల కోటిపల్లికి వెళ్ళుటకు పంటు ఉంది. గోదావరిలో నీరు లేనపుడు పడవలు నడుపుతారు.

అమలాపురం, రాజోలు, రావులపాలెం లకు బస్సులు ఉన్నాయి.

ఆటోలు, టాక్సీలు కూడా సమీప గ్రామాల మధ్య తిరుగుతుండును.

*క్షణ కాలంలో వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి.

*ముక్తేశ్వర ఆలయం ఒక పురాతన ఆలయం. పురాణాల ప్రకారం ఈ గ్రామాన్ని ముక్తేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. ఒక దానికెదురుగా ఒకటిగా రెండు శివాలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.మొదట ఎదురుగా ఉండే దేవాలయంలో ఉన్న దేవున్ని క్షణ ముక్తేశ్వరుడు అని పిలుస్తారు.ఎదురుగా ఉండే ఆలయం శ్రీరాజరాజేశ్వరీ సమేత ముక్తేశ్వర స్వామి వారి సన్నిధి

*ఈ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారమును పోలి ఉంటుంది. 

* ఇక్కడ శివలింగానికి పూజలు చేసి ఆ పరమేశ్వరుడిని ఇక్కడే కొలువై ఉండాలని కోరగా, శ్రీరాముడి భక్తికి ఆ పరమశివుడు ఇక్కడే కొలువైనాడనికి చెబుతారు.

*ఈ క్షేత్రంలోని 'ముక్తేశ్వరుడు' శ్రీరాముడి కాలానికంటే ముందు నుంచే కొలువై వున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

*దర్శన మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక, సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.

శివసంకల్పం లో ఈరోజు మనకోసం

కామెంట్‌లు లేవు: