పురుషోత్తమప్రాప్తియోగము
Yh
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - జీవుడు తాను దేహమునువీడి చనునపుడును, నూతన శరీరమును గైకొనునపుడును ఈ ఇంద్రియాదులను (వాని సంస్కారములను) తనవెంట గొనిపోవునని వచించుచున్నారు -
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్ర్కామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ ||
తాత్పర్యము:- దేహేంద్రియాది సంఘాతమునకు, ప్రభువగు జీవుడు శరీరమును విడుచునప్పుడును, నూతన శరీరమును పొందునపుడును -- పుష్పాది స్థానములనుండి గాలి వాసనలను గ్రహించిపోవు చందమున - పంచేంద్రియములు, మనస్సు అను ఆఱింటిని గ్రహించి వెడలుచున్నాడు.
వ్యాఖ్య:- 'జీవుడు ఈ శరీరమును వీడునపుడు నూతన శరీరమును గ్రహించునపుడు' - అను వాక్యముద్వారా జీవుడు శరీరము కాదనియు, శరీరముకంటె అన్యుడనియు, వస్త్రమువలె శరీరమును ధరించుచు, త్యజించుచు నుండుననియు స్పష్టమగుచున్నది. కాబట్టి దేహాభిమానమును త్యజించివేయవలెను. (తాను ఆత్మయే యను భావము గలిగియుండవలెను).
మఱియు "ఈశ్వరః” (ప్రభువు) - అను పదముచే జీవుడు వాస్తవముగ దేహమునకు, ఇంద్రియములకు, మనస్సునకు, దేహస్థమగు తదితరమునకు, వెయ్యేల, సమస్త సంఘాతమునకు ప్రభువేకాని సేవకుడుకాడనియు, బానిసకాడనియు ఋజువగుచున్నది. కాని అజ్ఞాని ఇట్టి ఈశ్వరస్థితిలో, ప్రభుస్థితిలోనుండక, సేవకావృత్తి నవలంబించి, ఇంద్రియమనంబులకు దాసానుదాసుడై దీనముగ ప్రవర్తించుచున్నాడు. అవి చెప్పినట్లు ఆడుచున్నాడు. భగవానుడు తెలిపిన ఈశ్వరత్వమెచట, ఈ క్షుద్రపరాధీనత్వమెచట! కావున ఈ ‘ఈశ్వర' పదమును గుర్తునందుంచుకొని, దేహేంద్రియాదులకు లోబడకనుండవలెను. మఱియు తాను వాస్తవముగ జీవుడుకాడు, సాక్షాత్ ఈశ్వరుడే యను భావమున్ను గలిగియుండవలెను.
‘గృహీత్వైతాని సంయాతి’ - జీవుడు శరీరమును వీడి చనుచున్నపుడును, తిరిగి శరీరమును గ్రహించునపుడును ఇంద్రియ మనంబులను వెంట తీసికొని వెళ్ళుచున్నాడని చెప్పబడినది. జీవుడు తన జీవితకాలమంతను అనేక ప్రాపంచిక పదార్థములను సేకరించుటలోను, అనుభవించుటలో కాలమును గడిపివైచుచున్నాడు. కాని తుట్టతుదకు వానిలో ఒక్క వస్తువునుగూడ తనవెంట (మరణానంతరము) తీసికొని వెళ్ళుటకు హక్కులేదని భగవాను డిచట స్పష్టముగ చెప్పివైచిరి. అయితే తనవెంట ఈ యాఱింటిని మాత్రము తీసికొనివెళ్ళవచ్చును - అవియే పంచేంద్రియములు, మనస్సు. కావున ఆ యాఱు వస్తువులను శుద్ధముగా, పవిత్రముగా, దైవసంస్కారయుతములుగా చేసికొనవలయును. అట్లు కావించుటకై జీవితములో ఎంతయో పారమార్థిక ప్రయత్నము చేయవలసియున్నది. ఏలయనగా, అవి మాత్రమే జీవునకు వెంటవచ్చి నూతనజన్మను ఏర్పఱచును. ఇంద్రియమనంబులు శుద్ధముగానున్నచో శుద్ధజన్మ , మలినముగానున్నచో క్రిమికీటాది క్షుద్రజన్మవచ్చును. కాబట్టి భావికాలస్థితి, భావిజన్మ మనచేతిలోనున్నవి. ఇపుడే ఆ యింద్రియమనంబులను ఆధ్యాత్మికచింతనచే పవిత్రీభూతములుగ నొనర్చుకొని పతనమునుండి తప్పించుకొనవలెను.
ఆ ఇంద్రియమనంబులను ఆఱు పదార్థములే మరణానంతరము జీవునకు దారిబత్తెము. అవితప్ప ఇతరమగు ఒక్క తృణముకూడ వెంటరాదు. అంత్యకాలమున ఎవరిని పిలిచినను ఎవరును అక్కరకు రారు. భార్య బంధుపుత్రగృహధన పశుక్షేత్రాదులెవ్వియు అత్తఱి జీవునకు సహాయముచేయజాలవు. వెంటగూడ రాజాలవు. రాదలంచినను వచ్చుటకు హక్కులేదు, శుద్ధమొనర్చబడిన (దైవికముగా జేయబడిన) మనస్సు, ఇంద్రియములే, అపుడు జీవునకు సహాయమొనర్పగలవు. వానికి మాత్రమే అతనివెంట వెళ్ళుటకు, సహాయముచేయుటకు అనుమతిగలదు. అవియే వానిని సంరక్షించుటకు రక్షకుల (Body-Guards) వలె వెంటవచ్చును.కాబట్టి జీవితకాలమంతయు మనుజుడు జాగరూకుడై ఆ యింద్రియమనంబులను ప్రయత్నపూర్వకముగ శుద్ధమొనర్చుకొనవలెను. మన భవిష్యత్తును మనమే ఇపుడే నిర్మించుకొనవలెను. నీచజన్మగాని, శుద్ధజన్మగాని, జన్మరాహిత్యముగాని అన్నియు మనచేతులలోనేయున్నవి. కావున మూడవదియగు జన్మరాహిత్యముకొఱకే విజ్ఞుడు పాటుపడుచు, తదనుగుణ్యమగు పవిత్రవాతావరణమునే సృష్టించుకొనవలయును.
"వాయుర్గన్ధానివాశయాత్' - శ్రీకృష్ణమూర్తి తాను బోధింపదలచిన విషయము బాగుగా అర్థమగుటకుగాను ఇట నొక చక్కని ఉపమానమును పేర్కొనిరి. సుగంధమునుగాని, దుర్గంధమునుగాని వాయువు ఆయావస్తువులనుండి గ్రహించి వేఱొక స్థానమునకు గొనిపోవుచుండును. వానికి సంబంధించిన సూక్ష్మతరములగు అణువులను సంగ్రహించుకొని అది వెడలుచుండును. ఎంతయో దూరమునగల పుష్పధూపాదులనుండి సుగంధము, క్రుళ్ళినవస్తువులనుండి, అమేధ్యమునుండి దుర్గంధము మనుజున కనుభూత మగుచుండుటకు కారణమిదియే అయియున్నది. ఆ యా సుగంధ, దుర్గంధాణువులను వాయువు వెంటతీసికొని ఇటునటు పోవుచుండును. ఇక్కార్యమున వాయువుయొక్క పక్షపాతమేమియులేదు.
వార్తావాహకుని పగిది అది ప్రవర్తించును. అట్లే జీవుడు మరణానంతరము ఇంద్రియమనంబులను గైకొని వెడలి నూతన శరీరమున ప్రవేశించును. ఇంద్రియములు, మనస్సు అపవిత్రములుగానున్నచో, జీవుడు మరణానంతరము ఆ దుర్వాసనాయుక్తములగు ఇంద్రియములనే, పాపాణువులనే గ్రహించిపోయి వానితో సహా నూతనమగు క్షుద్రశరీరమున ప్రవేశించును. ఇంద్రియమనంబులు పవిత్రములుగానున్నచో మరణానంతరం ఆ సద్వాసనాయుక్తములగు ఇంద్రియములనే, పుణ్యాణువులనే గ్రహించి నూతనమగు శుద్ధశరీరమున ప్రవేశించును. కావున ఇచట భగవంతునకుగాని, కర్మదేవతలకుగాని ఏవిధమగు పక్షపాతమున్నులేదు. ఆశయము (చిత్తము) నందెట్టి సంస్కారములుండునో దానినిబట్టియే జన్మ యేర్పడును. లేక ఆశయము (చిత్తము) వాసనారహితమై, నిస్సంకల్పస్థితిని బడసినచో ఇక జన్మయేలేక మోక్షము, జీవబ్రహ్మైక్యము ఇచటనే సిద్ధించును. కాబట్టి ప్రయత్నపూర్వకముగ వారివారి భవిష్యత్తును వారే ఇచట తీర్చిదిద్దుకొనవలెను. జీవితమందలి ప్రతినిమిషమున్ను ఆ యింద్రియమనంబులను శుద్ధమొనర్చుటయందు, నిగ్రహించుటయందు వినియోగించినచో అవియే జీవుని సద్గతికి గొనిపోవును. జన్మరాహిత్యమునుగూడ గల్గించును.
ప్రశ్న:- శరీరమును వీడునపుడుగాని, క్రొత్తశరీరమును గ్రహించునపుడుగాని జీవుడు తనతో ఏ యే వస్తువులను తీసుకొనిపోవును?
ఉత్తరము:-మనస్సును, ఇంద్రియములను, వానివానియందుండు సంస్కారములను గైకొని పోవును. ఇతరమగు ఏ వస్తువును గాదు.
ప్రశ్న:- ఏ ప్రకారముగ?
ఉత్తరము:- సుగంధవస్తువునుండిగాని, దుర్గంధవస్తువునుండిగాని వాయువు ఆ యా సుగంధ దుర్గంధాణువులను తీసికొనిపోవునట్లు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి