28, సెప్టెంబర్ 2020, సోమవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**

*శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఏడవ శ్లోక భాష్యం - నాల్గవ భాగం


ఆమె పాదములు పూజించిన పుష్పములను గ్రహించి వాసన చూడాలనే ఆశను రేకెత్తిస్తాయి. ఆ తల్లి పద్మము పోలిన పాదములను మరీమరీ చూడాలనే తపనను కలిగిస్తాయి. మరి అమ్మ ఇంద్రియ సుఖాలనేకాదు అతీంద్రియమైన అత్యంతికమైన సుఖాన్ని కలగచేసే కరుణ కలిగినట్టిది.


దొంగ చేతిలో ఉన్న కత్తి మనను భయపెట్టి దోచుకోవడానికి ఉపయోగిస్తే, మన చేతిలోని కత్తి అతన్ని పరుగెత్తించేట్లు చేస్తుంది కదా!! మన్మథుని చేతిలో చెఱుకు వింటి రసం, పూల బాణముల నుండి స్రవించే తేనె కామరసంగా మారి లోకాన్ని కామమోహితుల్ని చేస్తుంది. అంబిక చేతులలో ఇదే వస్తువులు కరుణామృతాన్ని ప్రవహింపచేస్తాయి. తద్వారా మన హృదయాలలో ఆ తల్లిపై భక్తి ఏర్పడుతుంది. ఆమే కరుణా ప్రవాహం, మన భక్తి కలసి మన అస్తిత్వాన్ని మరపింపచేసి ముక్తిలోని బ్రహ్మానందాన్ని అనుభవింపచేస్తాయి.


మనను అంధకారంలో ఉంచేది మాయ. మన ఉనికిని మరిపింపచేసి కరిగింపచేసేది జ్ఞానం. ఒక్కమాటలో చెప్పాలంటే అంబిక చేతిలోని బాణాలు మన విషయ వాంఛలను అదుపులో పెడితే, ఆమె చెఱుకు విల్లు మన మనస్సును లయం చేస్తుంది. ఇది జరిగినప్పుడు ముక్తి సిద్ధిస్తుంది.


ఈ అయిదు బాణముల చేత పవిత్రము చేయబడిన పంచేంద్రియములు, చెఱుకు విల్లు చేత శుద్ధి చేయబడిన మనస్సు కూడి ఆరుకరణములుగా పిలవబడుతున్నాయి. తేనెటీగకు ఆరుకాళ్ళు ఉన్న విధంగా మానవునకు ఆరు కరణములు. తన ఆరుకాళ్ళతో తేనెటీగ పద్మంపై ఎలావాలుతుందో అలా మనమీ ఆరు కరణములతో అంబిక పాదపద్మములపై వాలిపోవాలి. ఆమె పాదములను పట్టుకొంటే మన రాగద్వేషములు కూడా అణగారిపోతాయి.


ఆచార్యులవారు అంబిక పాదములే వరదాభయములను ప్రసాదిస్తాయని పూర్వమే చెప్పారుకదా!! మళ్ళీ ఆమెకు నాలుగు చేతులెందుకు. ఆమె మహారాజ్ఞి!! రాజ చిహ్నములైన ధనుర్బాణాలను పట్టుకోవాలి. మరి ఆమె సామ్రాజ్యమెక్కడ ? అది జ్ఞాన సామ్రాజ్యం. రాగద్వేషాలను రూపు మాపి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని తెలియజేయడానికి పాశాంకుశములున్న చేతులు చూపబడ్డాయి. మీదు మిక్కిలి నాలుగు చేతులు ఆమెకు లోకాతీతమైన సౌందర్యాన్ని కలగజేస్తున్నాయి. ధనుర్బాణాలు మనంతటా మనం సమర్పించుకోవలసిన ఇంద్రియాలను, మనస్సును ఆమె పాదాలవైపుకు త్రిప్పుతాయి.


ఈ ధనుర్బాణాలతోనే అంబిక శుద్ధజ్ఞానమైన ఈశ్వరుని ప్రపంచ క్షేమం కోసం కామం వైపునకు మరలించి ఆయనను కరుణామూర్తిగా మలచింది. తాను శివకామసుందరి అయింది. యావజ్జీవజాలాన్నీ వారి ఇంద్రియాలను, మనస్సును తన చేతిలో ఉంచుకొని ఇవే ఆయుధాలతో రక్షిస్తోంది. ఆచార్యులవారు ఈ ధనుర్బాణాలతో చేయబడే లీల అమ్మ పాదములే చేయగలవంటున్నారు.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: