28, సెప్టెంబర్ 2020, సోమవారం

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


96 - అరణ్యపర్వం.


అర్జునుని హెచ్చరిక లక్ష్యపెట్టక, గంధర్వరాజు చిత్రసేనుడు, తన అనుచరులను పాండవులపైకి యుద్ధానికి వుసిగొల్పాడు. అంతే ! పాండవ, గంధర్వుల మధ్య భీకరపోరు మొదలయ్యింది. గంధర్వులు వేలసంఖ్యలో వున్నా, నలుగురు పాండవులను నిలువరించడానికి, ముప్పతిప్పలు పడుతున్నారు. అర్జునుడు ఆగ్నేయాస్త్రంతో అధికసంఖ్యలో గంధర్వులను నేలకూల్చాడు. భీముడు తన గదకు పనిచెప్పాడు. ఒక్క గదాఘాతంతో పెక్కు మంది గంధర్వులను గాయపరచసాగాడు.  


ఇక లాభంలేదని,చిత్రసేనుడే స్వయంగా బరిలోకి దిగాడు. అర్జునుడు బాణాల వేగంతో చిత్రసేనుని గదను యేడుముక్కలు చేసాడు. చిత్రసేనుడు అదృశ్యవిద్య ప్రదర్శించ డానికి సిద్ధుడయ్యాడు. అయినా, అర్జునుడు , చీకటిలోనే బాణాలు వెయ్యగల మొనగాడు. శబ్దబేది విద్యతో చిత్రసేనుని ఎదుర్కున్నాడు. అతని బాణాన్ని తుత్తునియలు చేశాడు. చిత్రసేనుడు తాను వచ్చినది పాండవులను జయించడానికి కాదని, తన లక్ష్యం వేరని, గుర్తు తెచ్చుకుని, యెదిరించడానికి, యిక ప్రయత్నించక, స్నేహహస్తం చాచి, భీమార్జునులను, ఆలింగనం చేసుకున్నాడు.  


కానీ, అర్జునుడు, చిత్రసేనుడు కౌరవ మహిళా సమూహాన్ని బంధించడం తప్పు పని అని యెత్తిచూపాడు. దానికి సమాధానంగా, ' అర్జునా ! ఇందులో నా ప్రమేయం యేమీలేదు. మహేంద్రుని ఆజ్ఞ నేను శిరసావహించాను. అంతే ! మీరు ప్రశాంతంగా ద్వైతవనం లో వున్న విషయం తెలుసుకుని, కౌరవులు మిమ్ములను రెచ్చగొట్టే ధ్యేయంతోనే, తమ వైభవం మీముందు ప్రదర్శించి, మిమ్ములను కించపరచాలని, 'ఘోషయాత్ర ' పేరుతొ ద్వైతవనం ప్రవేశించారు. ఇది తెలుసుకుని, మహేంద్రుడు వారిని నిలువరించడానికి, వారి కుటిల ఆలోచన భగ్నపరచడానికి, నన్ను పథకరచన చెయ్య మన్నాడు. అందులో భాగంగానే దుర్యోధనాదులను బంధించి అమరావతి తీసుకువెళ్తున్నాను, మహేంద్రుని సన్నిధికి. ' అని వివరంగా చెప్పాడు.


ఇది తెలుసుకుని, భీమార్జునులు అందరినీ వెంటబెట్టుకుని, ధర్మరాజు వద్దకు తీసుకువచ్చారు. కౌరవుల కుటిల ఆలోచన వారిచేతనే చెప్పించారు, ధర్మరాజుకి. ' అన్నా ! ఇది అంతా విన్న తరువాత కూడా, మీరు దుర్యోధనుని బాసటగా నిలుస్తారా ! ' అని నిష్టూరంగా అడిగాడు. దుర్యోధనుడు ' తన తప్పిదం క్షమించమని ' ధర్మరాజుకి నమస్కరించి వేడుకున్నాడు. ధర్మరాజు దుర్యోధనునికి హితబోధ చేసి, ' నారీజనాన్ని తీసుకుని క్షేమంగా హస్తిన చేరుకో, ఇకనైనా సాహసాలు చెయ్యకు. జరిగినది అవమానంగా భావించి మనసు బాధపెట్టుకోకు. ' అని సున్నితంగా మందలించి దుర్యోధనుని విడిచిపెట్టమని తమ్ముళ్లకు చెప్పాడు. లజ్జాభారంతో, బంధుజనంతో హస్తిన దారిపట్టాడు దుర్యోధనుడు. 


కానీ, హస్తినాపురం వెళ్ళడానికి దుర్యోధనునికి మనస్కరించలేదు. దారిలో ఒక రమణీయ ప్రదేశంలో, విడిదిచేశాడు. కర్ణుడు ఘోషయాత్రలో, చిత్రసేనుని సైన్యం చేతిలో చావుదెబ్బ తిని, అక్కడ నుండి బ్రతుకుజీవుడా అని పారిపోయాడు. దుర్యోధనునికి ముఖం చూపించలేక, తిరిగి యిప్పుడు ప్రక్కనచేరి, ఇచ్చకాలు ప్రారంభించాడు. 


గంధర్వులను దుర్యోధనుడు జయించినట్లుగా భావించి, పొగడడం ప్రారంభించాడు. దుర్యోధనునికి, పుండు పై కారం రాసినట్లైంది. అయినా, సహనంతో, జరిగినదంతా పూస గ్రుచ్చినట్లు చెప్పాడు. ప్రాణస్నేహితుని సానుభూతి పొందాడు. కౌరవుల పక్షాన పాండవులు గంధర్వులతో పోరాటం చేస్తుంటే, నాకు తల కొట్టేసినట్లైంది కర్ణా !. నాకు మరణమే మేలు కర్ణా ! నాకు మరణమే మేలు. ' అని చింతాక్రాంతుడయ్యాడు.  


తాను ఇక హస్తినకు రాలేనన్నాడు. కురుపెద్దల ముందు నేను తలదించుకుని బ్రతకలేనన్నాడు. దుశ్శాసనుని పిలిచాడు. అతనికి ' రాజ్యాభిషేకం చేస్తాను. ప్రజలను పాలించుకో ! ' అని అశ్రునయనాలతో చెప్పి, గాఢంగా కౌగలించుకున్నాడు. దుశ్శాసనుడు భోరున విలపించాడు. ఇదంతా చూస్తున్న కర్ణుడు చిరాకుపడ్డాడు. ' మీరు దుఃఖిస్తే, పాండవులు సంతోషిస్తారు. అది మీకు సమ్మతమేనా ! అని అడిగాడు. 


దుర్యోధనుని, ప్రాయోపవేశదీక్షను శతవిధాలా విరమింప జేసే ప్రయత్నం తనవంతుగా జేస్తున్నాడు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: