28, సెప్టెంబర్ 2020, సోమవారం

శిలాఫలకం

 కొందరు జాలరులు సముద్రములో చేపలు పడుతుండగా వాళ్లకు ఒక శిలాఫలకం దొరికింది. దానిమీద ఏవో అక్షరాలు వున్నట్టుగా వారికి కనిపించింది ఇదేదో శ్లోకం లాగుంది భోజరాజు గారికి యిస్తే మంచి బహుమతి యిస్తారు అని రాజు కు తెచ్చి యిచ్చారు. భోజరాజు వారికి మంచి బహుమానం యిచ్చి పంపించారు. ఆయన దాన్ని పండితులకు యిచ్చియిదేమితో పరిశీలించమని ఆజ్ఞాపించాడు. వారు దానిని నిశితంగా పరిశీలించి 

ఒక పాదం మాత్రం అర్థమయిందని చెప్పారు. 

"అయిఖలు విషమ పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాకః"

అర్థము:-అయ్యయ్యో!పూర్వ కర్మల ఫలితం ప్రాణులకు చాలా విషమం గా వుంటుంది. 

ఇంకో పాదం పూర్తిచేయమని భోజుడు కవి భవభూతి ని ఆజ్ఞాపించారు. భవభూతి యిలా పూరించాడు. 

 

" క్వను కులమ కలంకం ఆయతాక్ష్యా?కవ చ రజనీ చర సంగమ అపవాదః?"

      అర్థము:-- విశాలాక్షి అయిన సీత యొక్క అకలంక మైన కుల మెక్కడ?రాక్షసునితో సంబంధం కలిపే అపవాదు ఎక్కడా?

కానీ రాజుకు ఆ పూరణ నచ్చలేదు. తానూ యిలా పూరించాడు. 

 

"క్వ జనక తనయా? క్వ చ దశకంధర మందిరే నివాసః" 

       అర్థము :-- ఎక్కడి జనక మహారాజు కూతురు, రామపత్ని?ఎక్కడ దశకంధరుడి ఇంటిలో వుండడం. తన పూరణ కూడా ఆయనకు నచ్చ లేదు. కాళిదాసు వంక చూశాడు మహా కవీ మీరే మంటారు? అన్నాడు. కాళిదాసు కండ్లు మూసుకొని కాసేపు ధ్యానం చేసి యిలా చెప్పాడు. ఇది హనుమంతుడు వ్రాసిన హనుమ ద్రామాయణము లోని యుద్ధ కాండ లోని శ్లోకములో రెండవ పాదముగా వున్నది. అని మొత్తం శ్లోకం చెప్పాడు.

 

"శివ శిరసి శిరాంసి యాని రేజు: శివ! శివ! తాని లుఠ౦తి గృధ్ర ప్రాదై:

అయి ఖలు విషమః పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాకః "

      అర్థము:-శివ శివ! ఏ తలలు శివుని తలపై విరాజిల్లెనో(శివ- శిరసి) (రావణుడు ఒకసారి తన తలలు ఖండించి శివుడి శిరస్సు పై పడ వేస్తాడు ) అట్టి తలలు యిప్పుడు యుద్ధము లో తెగి పడి గ్రద్దల కాళ్ళచే దొర్లింప బడుతున్నాయి ఆయ్యో! పూర్వజన్మ కర్మ ఫల పరిణామం ప్రాణులకు యెంత కఠినమో కదా!

ఇది సముద్రము లో లభించినది. దాని చరిత్ర ఏమిటో ?చెప్పగలరా? అని అడిగాడు భోజుడు. 

అందుకు కాళిదాసు,యిది హనుమద్రామాయణము లోనిది. హనుమంతుడు దాన్ని రామునికి చూపించగా రాముడు హనుమా!యిందులో నీ శౌర్యాన్నినీవే ఎక్కువగా వర్ణించి నట్టున్నది.స్వోత్కర్ష ఎక్కువగా కనపడుతుంది అని అన్నాడు. దానితో హనుమంతుడు రామునికి నచ్చని ఈ గ్రంథ మెందు లకు? అని సముద్రములో పారవేసినాడు. అందులోని ఒక శిలాఫలకమే యిది . అన్నాడు కాళిదాసు. 

అందుకు రాజు నీ పూరణ యుక్తము గానే యున్నది. కానీ యిదే కవి హృదయమని యెట్లు నిర్దారింప గలవు?అన్నాడు. అప్పుడు కాళిదాసు హనుమంతుని ధ్యానించాడు. హనుమంతుడు ప్రత్యక్ష మై కాళిదాసు పూరించినది సరియైనదే అని చెప్పాడు. అప్పుడు భోజుడు ఇది జరిగి చాలా కాలమైంది కదా! మీకు అంత బాగా జ్ఞాపకముందా?అన్నాడు. అప్పుడు హనుమంతుడు రాజా!నీ ఉద్యాన వనము లో నైరుతి దిశ లో నున్న చెట్టు యొక్క ఆకు పసరు తెచ్చి ఈ శిలాఫలకము పైన పూయండి అప్పుడు ఆ శ్లోకము స్పష్టముగా కనిపిస్తుంది అని చెప్పి అదృశ్య మయ్యాడు. వారు అలా ఆ పసరు పూయగానే శ్లోకము స్పష్టంగా కనిపించింది.. అది కాళిదాసు పూరించిన శ్లోకము గానే వున్నది. అప్పుడు భోజుడు,సభాసదులు కాళిదాసు ప్రతిభను కీర్తించి నారు.

--------------------- -------------------------

కామెంట్‌లు లేవు: