28, సెప్టెంబర్ 2020, సోమవారం

రాగస్వరూపపాశాఢ్యా - క్రోధాకారాంకుశోజ్జ్వలా’

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 11 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


   ‘రాగస్వరూపపాశాఢ్యా - క్రోధాకారాంకుశోజ్జ్వలా’ 

లలితాసహస్రనామ స్తోత్రము చదవడము వలన ఇంటికి సర్వమంగళములు లభిస్తాయి. అసురసంధ్యవేళ, దేవాలయములో చదవడము వలన భగవంతుని అనుగ్రహము పరిపుష్టముగా లభిస్తుంది. ప్రదోషవేళ శివునకు పరమప్రీతికరమైనది. ఆ సమయములో అమ్మవారు తనను స్తోత్రము చెయ్యడము కన్నా ముందు శంభుదేవుని గురించి ప్రార్థన చేస్తే ప్రసన్నురాలు అవుతుంది. సువాసినీ అర్చనకు, సువాసినీ పూజకు తొందరగా పలుకుతుంది. నాలుగు భుజములతో ఆవిర్భవించిన తల్లిగా అనుగ్రహించడమే చతుర్బాహుసమన్వితా. పరమ లలితమై, కోమలమై ఉపాసించడానికి ఎటువంటి స్థాయి వారికైనా ఇబ్బంది లేని రూపముతో ఆవిర్భవించిన తల్లి నాలుగుభుజములతో ‘సమన్వితా’ అనగా కూడి ఉన్నదని అర్థము. ఈశ్వరపరము కాని మనో బుద్ధి చిత్త అహంకారములు ఎప్పుడూ స్వతంత్రముగా తిరుగుతూ ఉంటాయి. మనసు అమ్మవారిలో భక్తితో, బుద్ధి అమ్మవారిలో భక్తితో, చిత్తము అమ్మవారిలో భక్తితో, అహంకారము అమ్మవారిలో భక్తితో సమన్వయము అయ్యేట్టుగా చెయ్యకలిగిన నాలుగుభుజములతో ఆవిడ ఆవిర్భవించింది. అమ్మవారి బాహువులను చూస్తే అవి రక్షించి తీరతాయి. ఉన్న అవలక్షణములు సంస్కరింపబడతాయి. ‘రాగస్వరూపపాశాఢ్యా’- ఆవిడ రెండు చేతులు పైకి రెండు చేతులు కిందకి ఉన్న నాలుగుచేతులలో నాలుగు ఆయుధములు పట్టుకున్నది. ఎడమచేతి వైపు కింద పాశము ఉన్నచేతితో వశిన్యాది దేవతలు స్తోత్రము చెయ్యడము మొదలు పెడుతున్నారు. కట్టడమునకు ఉపయోగించే దానిని పాశము అంటారు. రాగమనే పాశమునకు కట్టుబడడము వలన గుంజుకుంటున్నకొద్దీ ఆ పాశము ఇంకా బిగుసుకుంటున్నది. మనిషి జీవితము చిత్రముగా ఉంటుంది. ఒక పెద్ద కూడిక, ఒక పెద్ద తీసివేత. ఈ రెండే మనిషి జీవితం. రాగము అంటే దానికి ఏమీ అర్థము లేదు. తనకు తానే ఉద్ధరించుకుంటున్నాను అనుకుని రాగము పెట్టుకోవడము జరుగుతుంది. కర్తవ్యము తో చేస్తే తప్పులేదు. మరణానంతరము కూడా వచ్చేవారు ఎవరూ ఉండరు. చేసిన పుణ్య పాపములను మూటకట్టుకుని వెళ్లిపోవడము జరుగుతుంది. జీవితకాలములో పెంచుకున్న ఎన్నో బంధములు వేసుకున్న పాశములు అవి ఉద్ధరించవు. వివాహము అనేది వేదములో అంతర్భాగము. గృహస్థాశ్రమము వేద ప్రోక్తమైన విధానము. అందులో ఉండి తరించి పండినవాళ్ళు ఎందరో ఉన్నారు. అమ్మవారు సంసారము విడిచి పెట్టమని చెప్పలేదు. నావంక తిరిగి నమస్కారము చెయ్యి భక్తి అనే పాశము వేస్తాను. వేసుకున్న పాశములు సాధించలేని యోగ క్షేమములు సాధించవచ్చని చెపుతున్నది. భార్యా బిడ్డలు ఈశ్వరప్రసాదముగా స్వీకరించడము అలవరచుకోవాలి. భక్తి అన్న పాశము పడితే సంసారము ఏమీ చెయ్యదు. పైగా రక్షణ కలుగుతుంది, ఉద్ధరణ పొందుతారు. తల్లి భక్తి పాశమును వెయ్యాలి అంటే ఆమె కాంతివంక తిరిగి ధ్యానము చేసి చేతులవంక చూసి అనుగ్రహించమని ప్రార్థిస్తే పాశము వేస్తుంది. అమ్మవారికి సంబంధించిన రాగము ఉంటే ఉద్ధరణ పొందుతాము. జీవితము = కోరికలు తీరినప్పుడు పొందిన సుఖము + కోరికలు తీరనప్పుడు పొందిన దుఃఖము. ఈ రెండూ కాకుండా ఇంకేమీ ఉండదని భాగవతములో అందమైన విషయము ప్రతిపాదన చేసారు. దానిని వేదాంతము హితశత్రువు అంటుంది. రాగము హితశత్రువు చాలా సంతోషముగా ఉంటుంది. మనిషిలో కోరిక తీరనప్పుడు కన్నా తీరినప్పుడుఎక్కువ శక్తి వ్యయము అయిపోతుంది. ఈ కోరిక తీరకపోవడము వెనక ఈశ్వరుడు తమయొక్క క్షేమమును చూస్తున్నాడని అనుకోరు. కోరిక తీరలేదని కోపము వచ్చేస్తుంది. అజ్ఞానమును అంగీకరించడము నేర్చుకోవాలి. అమ్మవారు కుడిచేతి వైపు కిందచేతిలో పట్టుకున్న క్రోధమనే అంకుశమును చూస్తే వ్యక్తిలో మార్పు వచ్చి కోపము గురించి ఎలా ప్రశాంతముగా ఉండాలన్నది ఆలోచించి ఏదైనా ఉపదేశము పొందాలనుకుంటారు. కోపము మీద కోపము వస్తే అది మారడానికి మార్గము. మార్పన్నది మాత్ర వేసుకుంటే తగ్గే వ్యాధికాదు. గురువు దగ్గర విన్నదానిని అనుష్ఠానములో పెట్టుకుంటే మార్పు వస్తుంది. వినడానికి మాత్రమే గురువుగారి ప్రసంగము పనికివస్తే అది జీవితమును గట్టెక్కించలేదు.

కామెంట్‌లు లేవు: