21, జులై 2020, మంగళవారం

15.62 (అరువది రెండవ శ్లోకము)



భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తథాఽఽత్మనః|

వర్తయన్ స్వానుభూత్యేహ త్రీన్ స్వప్నాన్ ధునుతే మునిః॥6307॥

విచారశీలుడైన పురుషునకు స్వానుభవము చేత ఆత్మ యొక్క మూడు విధములైన అద్వైతములు గోచరించును. అవి జాగ్రత్స్వప్నసుషుప్తులు, మరియు ద్రష్టదర్శన దృశ్యములు భేదరూప స్వప్నమును తొలగించును. ఈ అద్వైతము మూడు రకములు - అవి భావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము.

15.63 (అరువది మూడవ శ్లోకము)

కార్యకారణవస్త్వైక్యమర్శనం పటతంతువత్|

అవస్తుత్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే॥6308॥

వస్త్రము దారములకంటె వేరుగాదు. అట్లే కార్యము గూడ కారణముకంటె వేరుగాదు. ఈ భేదభావము వాస్తవముగూడ కాదు. అనగా - కారణము పరమాత్మ, విశ్వము కార్యము. ఈ రెండింటియొక్క ఏకత్వభావనయే భావాద్వైతము. ఈ విధముగా అన్నిటి యందును ఏకత్వము దర్శించుటయే భావాద్వైతము.

హరిరేవ జగత్ జగదేవ హరిః హరితో జగతో న హి భిన్నతనుః|
ఇతి యస్య మతిః పరమార్థగతిః స సరో భవసాగరముత్తరతి॥ (శ్రీమధుసూదన సరస్వతీస్వామి)

15. 64 (అరువది నాలుగవ శ్లోకము)

యద్బ్రహ్మణి పరే సాక్షాత్సర్వకర్మసమర్పణమ్|

మనోవాక్తనుభిః పార్థ క్రియాద్వైతం తదుచ్యతే॥6309॥

ధర్మరాజా! మనోవాక్కాయములచే చేయబడు కర్మలన్నియును సాక్షాత్తుగా పరమాత్మకొరకే, పరమాత్మద్వారా జరుగుచున్నవనెడు భావముతో సమస్త కర్మలను పరమాత్మయందు సమర్పణము చేయుట క్రియాద్వైతము అనబడును.

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః|

సర్వధా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే॥ (గీత. 6.31)

15.65 (అరువది ఐదవ శ్లోకము)

ఆత్మజాయాసుతాదీనామన్యేషాం సర్వదేహినామ్|

యత్స్వార్థకామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే॥6310॥

భార్యాపుత్రులు మొదలగు బంధువులు, అట్లే ఇతర ప్రాణులు అన్నింటి యొక్కయు, మరియు తన స్వార్థ భోగములు ఒకటియే అని భావించుట - అనగా స్వ, పర అను భేదభావము లేకుండుట మరియు అందరిలో ఏకాత్మభావమును కలిగియుండుట ద్రవ్యాద్వైతము అనబడును.

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున|

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః॥ (గీత. 6.32)

15.66 (అరువది ఆరవ శ్లోకము)

యద్యస్య వానిషిద్ధం స్యాద్యేన యత్ర యతో నృప|

స తేనేహేత కార్యాణి నరో నాన్యైరనాపది॥6311॥

రాజా! శాస్త్రముల ఆదేశమునకు విరుద్ధముగానట్టి ద్రవ్యమును ఏ సమయమునందు, ఏ ఉపాయముద్వారా, ఏ వ్యక్తికొరకు, ఎవరిద్వారా తీసికొసవలయునో, అట్టి ద్రవ్యమును, అట్లే తీసికొని, తద్ద్వారా అప్పటి తమ కార్యములన్నింటినీ పూర్తి చేయవలయును. ఇది కేవలము ఆపత్కాలమునందు తప్ప మరొకవిధముగా, మరెప్పుడునూ చేయకూడదు.

15.67 (అరువది ఏడవ శ్లోకము)

ఏతైరన్యైశ్చ వేదోక్తైర్వర్తమానః స్వకర్మభిః|

గృహేఽప్యస్య గతిం యాయాద్రాజంస్తద్భక్తిభాఙ్ నరః॥6312॥

ధర్మరాజా! భగవద్భక్తుడు గృహస్థుడైనను వేదములలో తెలుపబడిన ఈ కర్మలను, ఇతర స్వధర్మములను తమ గృహమునందే యుండి అనుష్ఠించినచో, శ్రీహరియొక్క పరమపదమును పొందగలడు.

15.68 (అరువది ఎనిమిదవ శ్లోకము)

యథా హి యూయం నృపదేవ దుస్త్యజాదాపద్గణాదుత్తరతాత్మనః ప్రభోః|

యత్పాదపంకేరుహసేవయా భవానహారషీన్నిర్జితదిగ్గజః క్రతూన్॥6313॥

మహారాజా! నీవు నీ స్వామియైన శ్రీకృష్ణభగవానుని కృపచే, సహాయముచే ఎవ్వరికిని దాట శక్యముగాని ఆపదనుండి గట్టెక్కితివి. ఆ స్వామి పాదపద్మములను సేవించుటచే సమస్త భూమండలమును జయించి, రాజసూయము మొదలగు గొప్పయాగములను ఆచరించితివి. ఇదేవిధముగా అతని  కృపచే ఇతర జనులందరు సంసారసాగరమునుండి తరించెదరు.

15.69 (అరువది తొమ్మిదవ శ్లోకము)

అహం పురాభవం కశ్చిద్గంధర్వ ఉపబర్హణః|

నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మతః॥6314॥

మునుపటి మహాకల్పమునందు పూర్వజన్మమున నేను ఉపబర్హణుడు అను పేరుగల గంధర్వుడను. గంధర్వులలో నేను మిక్కిలి మాననీయుడను.

15.70 (డెబ్బదియవ శ్లోకము)

రూపపేశల మాధుర్యసౌగంధ్యప్రియదర్శనః|

స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తః స్వపురులంపటః॥6315॥

నా సౌందర్యము, సౌకుమార్యము, మధురభాషణము అపూర్వములు. నా శరీరమునుండి వెలువడు పరిమళము మిక్కిలి మనోజ్ఞము. స్త్రీలు నన్ను మిగుల ప్రేమించుటచే నేను వారి వ్యామోహములో పడి విషయలంపటుడనైతిని.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు: