*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*15.56 (ఏబది ఆరవ శ్లోకము)*
*య ఏతే పితృదేవానామయనే వేదనిర్మితే|*
*శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోఽపి న ముహ్యతి॥6301॥*
పితృయానము, దేవయానము అను ఈ రెండును వేదోక్త మార్గములే. శాస్త్రీయ దృష్టితో వీటి తత్త్వమును ఎరిగినవాడు శరీరముతో ఉన్నను మోహితుడుగాడు.
*15.57 (ఏబది ఏడవ శ్లోకము)*
*ఆదావంతే జనానాం సద్బహిరంతః పరావరమ్|*
*జ్ఞానం జ్ఞేయం వచో వాచ్యం తమో జ్యోతిస్త్వయం స్వయమ్॥6302॥*
జన్మను ధరించునట్టి శరీరమునకు పూర్వమున కారణరూపముతోడను, అంతమైన మీదటకూడా అవనిరూపముతోడను, ఆత్మ స్వయముగా విరాజిల్లుచుండును. ఇది భోగ రూపమున వెలుపలను ఉండును. ఇది ఉచ్చ, నీచజన్మలు కలిగియుండును. జ్ఞానము, జ్ఞేయము, వాణి, వాచ్యము, అంధకారము, ప్రకాశము మొదలగువాటి రూపములో లభించునది అంతయును ఈ ఆత్మయే.
*15.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*
*ఆబాధితోఽపి హ్యాభాసో యథా వస్తుతయా స్మృతః|*
*దుర్ఘటత్వాదైంద్రియకం తద్వదర్థవికల్పితమ్॥6303॥*
అద్దము మొదలగు వాటిలో కనబడు ప్రతి బింబమును యుక్తి యుక్తముగా విచారించినచో, అది వాస్తవము కాదు. ఐనను అది వస్తువు యొక్క రూపములో కనబడును. అట్లే ఇంద్రియముల ద్వారా గోచరించు దృశ్యపదార్థము లన్నియూ మాయద్వారా కల్పితములు. అవి సత్యములు కావు. కాని, సత్యమువలెనే ప్రతీతమగుచుండును.
*15.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*
*క్షిత్యాదీనామిహార్థానాం ఛాయా న కతమాపి హి|*
*న సంఘాతో వికారోఽపి న పృథఙ్ నాన్వితో మృషా॥6304॥*
ఈ విధముగా మాయయొక్క కార్యమగుటవలన వాస్తవమునకు ఇదంతా మిథ్యయే. పృథ్వి మొదలగు పంచమహాభూతములు మాయాకార్యములు. విషయభోగములు, పంచతన్మాత్రలు ఇవన్నియూ మాయయే. నీడకూడా మిథ్యయే. వాస్తవికదృష్టితో చూచినప్పుడు పంచభూతముల సంఘాతమగు దేహము, వాటి వికారము, పరిణామము ఇవన్నియు మాయా కార్యములగుట వలన మిథ్య మాత్రమే. అనగా బ్రహ్మసత్యం, జగన్మిథ్య అను సిద్ధాంతమును అనుసరించి తెలియవలెను.
*15.60 (అరువదియవ శ్లోకము)*
*ధాతవోఽవయవిత్వాచ్చ తన్మాత్రావయవైర్వినా|*
*న స్యుర్హ్యసత్యవయవిన్యసన్నవయవో ఽన్తతః॥6305॥*
పంచమహా భూతములు అను ఈ రెండును ఒకటియే. ఇందులో స్థూల పంచమహాభూతములు *అవయవి* అనబడును. సూక్ష్మ భూతముల తన్మాత్రలు *అవయవములు* అనబడును. సూక్ష్మదృష్టితో పరిశీలించినప్పుడు అవయవములు లేకుండా అవయవి యొక్క అస్తిత్వము సిద్ధింపదు. చివరగా అవయవి లేనప్పుడు అవయవముల యొక్క అస్తిత్వము చెల్లదు.
*15.61 (అరువది ఒకటవ శ్లోకము)*
*స్యాత్సాదృశ్యభ్రమస్తావద్వికల్ పే సతి వస్తునః|*
*జాగ్రత్స్వాపౌ యథా స్వప్నే తథా విధినిషేధతా॥6306॥*
వాస్తవమునకు పరమాత్మ సత్తాయే సమస్త ప్రాణులలో, పదార్థములలో నిండియుండును. మాయచే నిర్మింపబడిన వస్తువులన్నింటిలో కనిపించే నానాత్వము యొక్క కల్పనకు అజ్ఞానమే ముఖ్యకారణము. స్వప్నమునందు వ్యక్తి వివిధములగు దృశ్యములను గాంచును. ఆ స్వప్నమునందే అతడు ఒకసారి జాగ్రద్దశను అనుభవించును. మరియొకసారి స్వప్నమును గాంచినట్లు, వేరొకసారి గాఢనిద్రలో మునిగినట్లు అనుభవించును. స్వప్నకాలములో అవి సత్యములే అనే భ్రాంతి కలుగును. అట్లే స్వప్నమునుండి మేల్కొనిన పిదప జాగ్రద్దశలో అదంతా మిథ్య, అసత్యము అనే అనుభవము కలుగుచుండును. ఇదేవిధముగా మాయచే నిర్మింపబడిన ఈ జగత్తు అసత్యమే ఐనప్పటికినీ, పరమాత్మసత్తా ఇందుకు ఆధారమగుటచే సత్యమను భ్రాంతి కలుగుచుండును. అజ్ఞానము ఉండునంతవరకు శాస్త్రముల యొక్క విధినిషేధముల వాక్యములు వర్తించును. తత్త్వజ్ఞానము కలిగినమీదట పరమాత్మ సత్తా ఒక్కటే మిగిలియుండును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
**********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి