26, సెప్టెంబర్ 2020, శనివారం

పుష్కరాలు

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*


సందేహం;- పుష్కరం అంటే ఏమిటి, పుష్కరాలు ఎందుకు జరుగుతాయి, పుష్కరుడు ఎవరు దాని గురించి కొంచెం వివరంగా చెప్పమని కోరుకుంటున్నాను?


సమాధానం;- పన్నెండు సంవత్సరాల కాలం. భారతదేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది. పుష్కర అనేది భూమి మీది సప్త ద్వీపాలలోను ఒకదాని పేరు. కానీ, సాధారణంగా పుష్కరం/పుష్కరాలు అంటే నదులకు జరిగే పుష్కరోత్సవాలనే స్ఫురిస్తుంది. మన దేశంలోని పన్నెండు నదులకు పుష్కరాలు జరపడానికి సంబంధించి వాయు పురాణంలో ఒక గాథ ఉంది. బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ పన్నెండు నదులనూ దర్శిస్తుంటాడని ఐతిహ్యం. బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడంచేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం. 


బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు పుష్కరం అంటారు. సంవత్సర కాలం జరిగే ఈ ఉత్సవాలలో చివరి పన్నెండు రోజులూ అంత్య పుష్కరం. పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం. పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది. సప్తర్షులే గాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా నమ్మకం. పుష్కరాల ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు. తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సంప్రదాయం కూడా ఉంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: