26, సెప్టెంబర్ 2020, శనివారం

ఆర్య

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*


మనం చెప్పే మాట ఎలా ఉండాలో సుందర పాండ్యుడనే చక్రవర్తి తన *ఆర్య* ల్లో చెప్పాడు. ఒక్క *ఆర్య* ను అధ్యయనం చేద్దాం.


*శబ్ధార్థ సూక్ష్మ వసనా*

*సత్యాభరణా, విచిత్ర హేత్వంగీ*

*విద్వన్ముఖ నిష్క్రాంతా*

*సుస్త్రీవ విరాజితే వాణీ*


శబ్ధార్థాలనే మేలి వస్త్రాలు ధరించి, విచిత్ర హేతువులనే చక్కని మేనుతో, సత్యాన్ని అలంకరించుకొని విద్వాంసుల నోటి నుండి వెలువడిన మాట మంచి మగువలా ప్రకాశిస్తుంది. 


మాటకు ఒక శరీరం ఉంటుంది. వస్త్రాలుంటాయి, అలంకారాలుంటాయి. వట్టి పొల్లు మాటలకు విలువుండదు. మనం పలికే ప్రతి మాటా హేతుబద్ధం అయి ఉండాలి. యుక్తి యుక్తంగా ఉండాలి. అందంగా, కాదనడానికి లేనట్టుగా ఉండాలి. విచిత్ర హేతుత్వం అంటే ఇదే. 


మాటకు విచిత్ర హేతువు శరీరం, శబ్ధార్థాలు మేలి వస్త్రాలు. మాట గంభీరమూ, లలిత మర్యాద గలదీ కావాలి. శబ్ధార్థాలు విషయ సౌందర్యాన్ని ప్రకాశింప చెయ్యాలి. ఆభరణాలు, శరీరానికి బట్టకు, కట్టుకూ నిండు దనాన్ని ఇస్తాయి. 


అలాగే మన మాటకు సత్యము, ప్రియము, ఆభరణాలు కావాలి. అలాంటి మాట మంచి మగువలా రాణిస్తుంది అంటాడు సుందర పాండ్యుడు.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: