*(11)*
రత్నకాంతుల అతిశయంతో అమితంగా ప్రకాశిస్తూ అక్కడ వెలసి ఉన్న ఉత్తమ భవనాలకన్నా అత్యున్నతమైన పుష్పకమనే పేరుగల ఆ మహావిమానాన్ని హనుమంతుడు చూశాడు.
*(12)*
ఆ పుష్పక విమానంలో వైఢూర్యాలతోను, వెండితోను, పగడాలతోను రూపొందించిన పక్షులూ, అనేక విధాలైన మాణిక్యాలతో తయారైన సర్పాలూ, శుభకర లక్షణాలు గల ఉత్తమజాతి గుర్రాలూ అలంకార నిమిత్తం అమర్చబడి ఉన్నాయి.
*(13)*
ఆ విమానంలో మంచి ముఖాలు, కోమలమైన రెక్కలు గల పక్షులను కూడా రూపొందించారు. సవిలాసంగా ఒకింత వంకరగా వంచబడిన ఆ పక్షుల రెక్కల మీద పగడపు, బంగారపు పువ్వులు చెక్కబడి ఉన్నవి. ఆ పక్షులు మన్మథునికి దోహదపడేవిలా తోచుచున్నాయి.
*(14)*
ఆ పుష్పక విమానంలో తామర కొలను, దానిలో లక్ష్మీదేవిని అభిషేకించడానికన్నట్లు ఆయత్తమైన ఏనుగులు చిత్రించబడి ఉన్నాయి. సుందరములైన తొండములు గల ఆ ఏనుగుల శరీరాలు పుప్పొడితో నిండి ఉన్నాయి. ఆ ఏనుగులు తామర పువ్వులను తామర ఆకులను తమ తొండములతో పైకెత్తి ఆ కొలనులో క్రీడిస్తున్నాయి. అందమైన హస్తములు కలదీ, ఆ హస్తములందు పద్మములు ధరించి, ఆ ఏనుగులచే అభిషేకము పొందుచున్నదా అన్నట్లున్న లక్ష్మీదేవి ఆ కొలనులో ప్రకాశిస్తూ చిత్రీకరించబడి ఉంది.
*(15)*
అలా హనుమంతుడు సుందరమూ, శుభప్రదమూ అయిన పర్వతం మల్లే ఉన్న ఆ రావణ గృహాన్ని తిలకించి, ఆశ్చర్యచకితుడై వసంత ఋతువులో సుగంధభరితమై సుందరమైన గుహలతో మనోహరంగా ఒప్పారుతున్న పర్వతంలా ఉన్న ఆ గృహంలో మళ్ళీ ప్రవేశించి అన్వేషించసాగాడు.
*జై శ్రీహనుమాన్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి