తనపై అపార ప్రేమ కురిపిస్తున్నా రమణీ మణుల క్షేమ సమాచారాలను కృష్ణుడు అడుగుతున్నాడు.
"కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్
గడవంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?
తొడవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా?
కడమల్ గావు గదా? భవన్నిలయముల్ గల్యాణయుక్తంబులే?
**
“మీ కొడుకులు వినయవినమ్రులై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా; మీ కోడళ్లు మీ మాటలు జవదాటకుండ ఉన్నారా; బాగా చదువుకున్న విద్వాంసు లరుదెంచి నప్పుడు సత్కారాలు చేస్తున్నారా; నగలు, చీరలు, రసవంతాలైన మధర పదార్థాలు సమస్తం సమృద్ధిగా ఉన్నాయా; మీకు ఎట్టి లోటూ వాటిల్లటం లేదు కదా.
**
తిలక మేటికి లేదు తిలకనీతిలకమ!-
పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి!
కస్తూరి యలఁదవా కస్తూరికాగంధి!-
తొడవులు దొడవవా తొడవుతొడవ!
కలహంసఁ బెంపుదే కలహంసగామిని!-
కీరముఁ జదివింతె కీరవాణి!
లతలఁ బోషింతువా లతికాలలిత దేహ!-
సరసి నోలాడుదే సరసిజాక్షి!
మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన!
గురుల నాదరింతె గురువివేక!
బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి!
యనుచు సతులనడిగెనచ్యుతుండు."
**
నుదుటికి బొట్టంత ఉన్నతురాలా! నుదట బొట్టెందుకు పెట్టుకోలేదు? పువ్వులాంటి మృదువైన మోహనాంగి! తలలో పూలు పెట్టుకోవా? కస్తూరి పరిమాళాలు వెదజల్లే కాంతా! కస్తూరి రాసుకోవా? అలంకారాలకే అందాన్నిచ్చే అందగత్తెవు! ఆభరణాలు అలంకరించుకోవా? హంసనడకల చిన్నదాన! కలహంసలని పెంచుతున్నావా? చిలుక పలుకుల చిన్నారి! చిలుకలకి పలుకులు నేర్పుతున్నావా లేదా? పూతీగె అంతటి సుకుమారమైన సుకుమారి! పూలమొక్కలు పెంచుతున్నావా? పద్మాక్షి! కొలనులలో ఈతలుకొడుతున్నావు కదా? లేడికన్నుల లేమ! లేడికూనలకి మేత మేపుతున్నావు కదా? మహా వివేకవంతురాలా! పెద్దలను చక్కగా గౌరవిస్తున్నావు కదా? బందుప్రేమకి పేరుపొందిన పడతీ! బంధువుల నందరిని ఆదరిస్తున్నావు కదా?” అంటూ ప్రియకాంతల నందరినీ పరామర్శించాడు లీలావిలాస పురుషుడైన కృష్ణపరమాత్మ
🏵️పోతన పద్యం🏵️
🏵️కడు రమ్యం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి