26, సెప్టెంబర్ 2020, శనివారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


94 - అరణ్యపర్వం.


మార్కండేయమహర్షితో సద్గోష్ఠిలో ధర్మరాజు, శ్రీకృష్ణుడు మొదలైనవారు వున్న తరుణంలో, సత్యభామా, ద్రౌపదీ అల్లంతదూరంలో, ఒక చెట్టు క్రింద కూర్చుని సరదా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.


ఆ సమయంలో సత్యభామ ' ద్రౌపదీ ! అసమానశూరులైన అయిదుగురు భర్తలను మెప్పించి, వారిని నీ ఆకర్షణలో ముంచి, యే విధమైన పొరపొచ్చాలు లేకుండా యెలా నెట్టుకురాగలుగుతున్నావు ? నీ గురించి ఆ విషయంలో యెప్పుడూ ఒకింత ఆశ్చర్యమూ, ఆ రహశ్యం తెలుసుకోవాలనే వుత్సాహమూ కలుగుతూ వుంటుంది. ఈ విజయం యేదైనా మంత్రసాధన వలన సాధించావా ? లేక యేదైనా ఔషధవిద్య నేర్చుకున్నావా ? లేక అశ్వనీ దేవతలు మూలికా వైద్యము అనుగ్రహించారా ? దాపరికం లేకుండా నాకు చెప్పవా ? అష్టభార్యలతో జీవిస్తున్న నా పతిదేవుడు శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి, నీవు చెప్పే రహశ్యం నాకు వుపయోగపడవచ్చును. నాపతి నాకే స్వంతమవాలనే స్వార్ధం యేభార్యకైనా వుండడంలో తప్పులేదు కదా ! ' అని ద్రౌపదిని అడిగింది.


దానికి ద్రౌపది చిరునవ్వుతో, ' సత్యభామా దేవి యేనా యీప్రశ్న నన్ను అడిగింది ? మనం పాతివ్రత్యంలో జీవించే మహిళలం. మనకు యీచర్చ అంత సమంజసం కాదేమో ! ' అని అన్నది. అయినా సత్యభామ వత్తిడి చెయ్యడంతో, ద్రౌపది చెప్పసాగింది : 


' ఏ భర్త అయినా తనభార్య తనను మంత్రతంత్రాలతో వశపరచుకోవాలని ప్రయత్నిస్తున్నది అనితెలుసుకుంటే, తనప్రక్కలో కట్లపాము వున్నట్లుగా భయపడడా ? ఆమెను చూసినప్పుడల్లా, యెంతో భయంతో, ఆందోళనతో వుంటాడు, తనపై యే మంత్రప్రయోగం చేస్తుందో అని. అలాంటి భర్త శాంతి సౌఖ్యాలకు దూరమై, అసలు సంసారిక జీవనాన్ని అసహ్యించుకుంటాడు. '

' ఆవిషయం తన భర్త శత్రువులకు తెలిస్తే, ఆమె ద్వారా విషప్రయోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషం వికటించి, అనేక రోగాలు వచ్చే సమస్య కూడా వున్నది. కాబట్టి యేభార్యకూడా అట్టి ఆలోచనే చెయ్యకూడదు. '


' అయితే, నీవు యెంతో ఉత్సుకతతో నా నడవడిక గురించిన రహశ్యం అడుగుతున్నావు కాబట్టి చెబుతాను.విను. నేను ఏనాడూ నా భర్తలముందు అహంకారంతో సంచరించను. వారికి యేవిధంగా నేను ప్రవర్తిస్తే ఆనందంగా వుంటుందని భావిస్తారో, అలానే నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ విధంగా వారిని ఆనందింప జేస్తూ, నేనూ ఆనందం పొందుతాను. వారితో దుష్టసంభాషణలు చెయ్యను. అసభ్యభంగిమలలోవారి కంటబడను. పరపురుషుల ముఖాలలోనికి దృష్టిసారించి సంభాషణలు చెయ్యను. ఏ విషయం అయినా చర్చిస్తున్నప్పుడు, నా భర్తల మనోభావాలు వారిముఖాలలో చదవగలిగే శక్తి సంపాదించుకున్నాను. ఆవిధంగానే సంభాషణ కొనసాగిస్తాను. నా భర్తలు, భృత్యులు భుజించిన తరువాతే, నేను భోజనం చేస్తాను. '

' నా భర్తలు మేలుకుని వున్నంతవరకు, వారికి చేదోడు వాదోడుగా వుంటాను. వారు నిద్రించిన తరువాతనే, నేను నిద్రిస్తాను. అదేవిధంగా, వారు నిద్రలేచేముందే నేను పడకపైనుండి లేచి దైనందిన కార్యక్రమాలు మొదలుపెడతాను. వారు ఇంట లేననప్పుడు ద్వారందగ్గర నిలబడను. వనవిహారాలు యెప్పుడూ ఒంటరిగా చెయ్యను. ఏ సందర్భంలో కూడా, భర్తల ముందు గానీ, వేరే వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు గానీ, అతిగా నవ్వను. '


' ఇంటిని అందంగా అలంకరిస్తాను. శాకపాకాలు నా పర్యవేక్షణలో శుచిగా రుచిగా తయారుచేస్తాను. సోమరితనాన్ని నా దగ్గరకు రానివ్వను. ఎట్టి పరిస్థితులలో అబద్దం ఆడను. నా భర్తలకు యిష్టంలేని వాటిపై వ్యామోహం పెంచుకోను. అత్తగారిని ప్రేమగా చూసుకుంటాను. నా పుట్టినింటి వారిగురించి అసందర్భంగా, అనవసరంగా గొప్పలు చెప్పను. మెట్టినింటిని కించపరచను. '


' బ్రాహ్మణులకు సువర్ణపాత్రలలో భోజనాలు ఏర్పాట్లు చేసేదాన్ని. ఆ సువర్ణపాత్రలు నా సంరక్షణలో వుండేవి. భృత్యుల పేర్లు అందరివీ నాకు జ్ఞాపకం వుండేవి. జంతువులకు పోషణ, వాటి బాగోగులూ నా పర్యవేక్షణలో జరిగేవి. నేను నా భర్తల దినచర్యలలో అధికభాగం వారి రాచకార్యాలకు, ఉపాసనా కార్యక్రమాలకు వెచ్చించే విధంగా చూసుకునేదానిని. '


' ఈ విధమైన ప్రవర్తన కారణంగానే నా భర్తలు నాకు వశమయ్యారు. వశీకరణాలు, మంత్రతంత్రాలు నాకు తెలీవు. వాటి ఆలోచన కూడా నాకు యెప్పుడూ రాలేదు. '

అని సుదీర్ఘంగా చెప్పింది ద్రౌపది సత్యభామకు. ఆమె చక్కని ప్రవచనాభరితమైన వాక్కులకు సత్యభామ యెంతో సంతోషించి, తాను అడిగిన ప్రశ్నకు బాహాటంగానే సిగ్గుపడింది. ' ద్రౌపదీ ! పరిహాసంగా యీ ప్రసంగాన్ని ప్రారంభించాను. ఓ అయోనిజా ! నన్ను క్షమించు. యెంతో చక్కగా లోతుగా విడమర్చి చెప్పావు. ' అని సత్యభామ ద్రౌపదిని దగ్గరకు తీసుకున్నది.  


దానికి ద్రౌపది, ' సత్యా ! నేను యేవిధమైన కపటంతో చెప్పలేదు. భర్త మనస్సు యెలా వశం చేసుకోవాలో, యింకా చెబుతాను విను. ' భర్త గృహద్వారం ప్రవేశిస్తుండగానే, నవ్వుతూ యెదురువెళ్ళాలి. భర్త ఏకాంతం లో చెప్పే విషయాలు గోప్యంగా వుంచాలి. రహశ్య సంభాషణలు నీ ద్వారా బయటకు వెళ్ళినాయని తెలిస్తే నీ భర్త యిక నిన్ను నమ్మడు. ఏనాడూ రహశ్యాలు నీతో పంచుకోడు. నీ భర్త వైపు వారిని చులకన మాటలతో నిందిస్తూ భర్త వద్ద మాట్లాడవద్దు. భర్తకు హితులెవరో, విరోధులెవరో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించు. చివరిగా ఒకే మాట చెబుతాను. ' నీ భర్త శ్రీకృష్ణునికి నాభార్య సత్యభామకు నామీద ప్రేమ అధికంగా వున్నది, సంపూర్ణ హృదయంతో నన్ను అనుసరిస్తుంది. అనే భావం కలిగిననాడు నిన్ను విడిచి శ్రీకృష్ణుడు క్షణంకూడా వుండలేడు. అని ముగించింది ద్రౌపది.


ఈ విధంగా, కొన్నిరోజులు సత్యా కృష్ణులు కామ్యకవనం లో పాండవులతో సంతోషంగా గడిపి, తిరిగి ద్వారకకు బయలుదేరి వెళ్లారు. 


అని జనమేజయుని కి వైశంపాయనమహర్షి చెప్పాడని, శౌనకాది మహామునులకు, సూతుడు నైమిశారణ్యంలో చెప్పాడు. 

  

స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: